Wednesday, January 24, 2018

endala mallikarjuna swamy temple ravivalasa in telugu | tekkali, Srikaku... ''మహాశివుడు...'' పేరుకు తగినట్టుగా భారీగా 20 అడుగుల పొడవుతో ఒక కొండలాగా భాసించే భారీశివలింగం మల్లికార్జున స్వామిగా అశేష ప్రజల నీరాజనాలందుకుంటోంది. ఎటువంటి ఆర్భాటాలు, అట్టహాసాలు కోరుకోని భక్తసులభుడు పరమేశ్వరుడు. నిండుమనుసుతో, నిష్కళంకమైన భక్తితో కాస్త జలం, గుప్పెడు పత్రాలు సమర్పిస్తే చాలు కోరిన కోరికలు నెరవేర్చే స్వామి మల్లికార్జునుడు అని చెప్తున్నాయి పురాణాలు. అలా పేరకు తగినట్టుగానే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా భక్తుల నీరాజనాలందుకుంటున్న యుగయుగాల దేవుడు ఎండలమల్లికార్జునుడు.

అద్భుత కథనాల దేవుడు 

ఈ స్వామి ఆవిర్బావానికి అత్యంత ఆసక్తికల పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం ఒకసారి నారదమహర్షి పార్వతీపరమేశ్వరులను దర్శించుకున్నప్పుడు స్వామీ! తమరు వెలసిన జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం భక్తులకు చాలా ప్రయాసతో కూడుకున్న పనిగా ఉంటుంది. అందుకే ఆ జ్యోతిర్లింగాలు ఒకేచోట ఉంటే భక్తులకు అనువుగా ఉంటుంది అన్నాడట. ఇది విన్న పరమేశ్వరుడు ఈ విషయం ఆలోచించదగినదే అని భావించి, జ్యోతిర్లింగాలలోని శక్తిని తన ఆత్మలింగంలో నిక్షప్తం చేసి దానితో పాటు కాశీ మొదలైన శివక్షేత్రాలలోని శక్తిని సుమంచు పర్వతంపై ఉంచగా ఆ శివలింగం బరువుకు ఆ సుమంచు పర్వతం భూమిలోకి కృంగిపోయిందట. అప్పుడుఅయ్యో.... ఇలా జరిగిందేవిటా అని విచారంలో పడ్డ నారదుని ఓదార్చి, త్రేతాయుగంలో రావణాసురుని వధించిన అనంతరం శ్రీరాముడు ఈ ప్రాంతానికి వస్తాడని అప్పుడు ఈ శివలింగ ప్రతిష్ట చేస్తాడని చెప్పాడట పరమేశ్వరుడు. అందుకే భూమిలోపల 65 మీటర్ల లోతు వరకూ ఈ శివలింగం ఉంటుందని స్థల పురాణం చెప్తోంది.
శ్రీకాకుళం జిల్లాలోని రావివలస గ్రామంలో ఎప్పుడో త్రేతాయుగంలో వెలసిన పరమేశ్వరుడు
మల్లికార్జున స్వామిగా వేలాది మంది భక్తుల పూజలందుకుంటున్నాడు. ఇక్కడ వెలసిన మల్లికార్జునునికి యుగయుగాల చరిత్ర ఉంది. త్రేతాయుగంలో రావణ వధానంతరం శ్రీరాముడు అయోధ్యకు వెళుతూ మార్గమధ్యంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడట. ఆ ప్రాంతంలో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మూలికలున్నాయి.
అయినా కూడా అక్కడి ప్రజల అనారోగ్యంతో సతమతమవుతున్నారు. ఇదంతా గమనించాడు అక్కడ సేదతీరిన రామా పరివారంలో ఉన్న సుషేణుడు అనే వానర వైద్యుడు. దాంతో ఈ ప్రాంత ప్రజల రోగబాధలను ఎలాగైనా తీర్చాలనుకున్నాడు. అందుకే అక్కడే పరమేశ్వరుని గూర్చి ఘోరమైన తపస్సును ప్రారంభిచాడు. తపస్సులో ఉన్న సుషేణుని అక్కడే వదిలి శ్రీరాముడు పరివార సమేతంగా అయోధ్యకు చేరుకున్నాడు. కొంతకాలం గడిచిన తరువాత సుషేణుని చూసి రమ్మని హనుమంతుని పంపిస్తాడు శ్రీరాముడు. రామాజ్ఞతో సుమంత పర్వతానికి వచ్చి చూసిన ఆంజనేయునికి చలనం లేని సుషేణుని శరీరం కనబడుతుంది. దాంతో సుషేణుడు మరణించాడని నిర్ణయించుకున్న ఆంజనేయుడు ఆ శరీరంపై మల్లేపూలు చల్లి, జింకచర్మం కప్పి, హుటాహుటిన వెళ్లి శ్రీరామునికి విషయం విన్నవిస్తాడు. వెంటనే శ్రీరాముడు ఈ సుమంత పర్వతం దగ్గరకు వచ్చి ఆ జింక చర్మాన్ని తొలగిస్తాడు. చూస్తున్న వారందరిని విస్మయానికి గురిచేస్తూ అక్కడ సుషేణుడి కళేబరానికి బదులు అద్భుతమైన శివలింగం దర్శనమిచ్చింది. దాంతో శివలీలను గ్రహించిన శ్రీరాముడు ఆ శివలింగానికి ప్రతిష్ట చేస్తాడు. అలా పూజలు చేస్తున్న సమయంలోనే ఆ శివలింగం క్రమక్రమంగా పెరగటం ప్రారంభించిదట. అలా దాదాపు 26 మీటర్ల వరకు పెరిగి ఆ లింగం పెరుగుదల ఆగిపోయింది. అంతే కాకుండా అక్కడ అంతకుముందు సుషేణుని కళేబరం మీద చల్లిన మల్లేపూల నుంచి అద్భుతమైన సువాసనలు అక్కడ గాలితో ఆ ప్రాంతమంతా వ్యాపించాయట. దాంతో ఆ ప్రాంతీయుల అనారోగ్యమంతా మటుమాయమైందని స్థలపురాణం చెప్తోంది.

 ఇక ద్వాపరయుగ కథనానికి వస్తే పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఇక్కడ ఉన్న గుహలో కొంతకాలం నివసిస్తూ ఈ శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవారట. ఆ సందర్భంలోనే అర్జునుడు పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసాడు. అతడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయి వరాలిచ్చినట్టుగా పురాణ కథనాలు చెప్తున్నాయి.
ఎలాంటి గుడి, గోపురం లేని దేవుడు
మామూలు ఆలయాల మాదిరిగి ఇక్కడ ఎలాంటి ఆలయనిర్మాణం మనకు కనబడదు. దీనికి సంబంధించి కూడా ఒక కథనం ప్రచారంలో ఉంది. 1870 ప్రాంతంలో టెక్కలి జమిందారు ఆలయాన్ని నిర్మిచడానికి ప్రయత్నించాడు. అయితే కట్టిన గోడలు కట్టినట్టే కూలిపోవడం, మరోసారి అగ్నికి ఆహుతి కావడం వంటి సంఘటనలు జరగడంతో జమిందారు ఖిన్నుడయి, మళ్లీ ఆలయ నిర్మాణం ప్రయత్నాలు మొదలుపెట్టాడట. అయినా కూడా ఆ పనులకు అడగడుగునా విఘ్నాలే ఏర్పడేవి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక జమిందారు చింతాక్రాంతుడయి ఉండగా మల్లికార్జునుడు జమిందారు కలలో కనబడి ఆలయ నిర్మాణ ప్రయత్నాలు విరమించమని, నేను ఇలాగే ఎలాంటి గోపురం లేకుండా ఉంటానని చెప్పాడట. అలా స్వామి ఎండకు ఎండుతూ ఎండల మల్లికార్జునుడుగా ప్రసిద్ధి చెందాడు.
ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రతి శివరాత్రికి, కార్తీక మాసంలోను ఇక్కడ ప్రతేక పూజలు జరుగుతున్నాయి. సుదూర ప్రాంతాలనుంచి వేలాది మంది భక్తులు ఇక్కడకు స్వామి దర్శనం కోసం వస్తారు. ఈ పూజల సందర్భరంగా ఈ శివలింగం చుట్టూ అలంకరించడానికి 35 మూరల పొడవుండే వస్త్రం అవసరమవుతుందట అంతటి భారీ శివలింగం ఇది. ఇక్కడ అరుదుగా పూసే కోటిలింగాల పుష్పాలతో స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అదే విధంగా ఇక్కడున్న శివసాగరం అనే కొలనులో స్నానం చేస్తే పాపాలు ప్రక్షాళనమవుతాయని కూడా భక్తుల నమ్మకం
కలియుగ కార్తీక కైలాసంగా పేరుగాంచిన ఈ పుణ్యక్షేత్రం టెక్కలికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వయంభూ శివలింగంగా ప్రపంచంలోనే పెద్ద లింగంగా గుర్తింపు పొందింది. ఏటా శివరాత్రితోపాటు కార్తీక మాసంలో పెద్దఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి రోజున, కార్తీకమాసం సోమవారం పర్వదినాల్లో లక్షలాదిమంది భక్తులు సందర్శిస్తారు. శ్రీకాకుళం జిల్లాకేంద్రం నుంచి టెక్కలికి 50 కిలోమీటర్ల దూరం. అక్కడి నుంచి బస్సులోగాని, ఆటోలోగాని ఇక్కడకు చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు రావివలస మీదుగానే వెళ్తుంటాయి. ఇదీ ప్రపంచంలోనే పెద్ద శివలింగంగా ప్రసిద్ధి చెందినా రావివలస ఎండల మల్లికార్జునుడి విశేషాలు.


No comments:

Post a Comment