23, జులై 2018, సోమవారం

puri temple history | రథయాత్ర విశేషాలు


తొలి రథయాత్ర

puri temple history | రథయాత్ర విశేషాలు
ఈనాడింత ప్రసిద్ది చెందిన రథయాత్రను తొలిసారిగా జరిపినదీ, రథ నిర్మాణాన్ని చేపట్టినదీ  ఇంద్రద్యుమ్న మహారాజు. రథనిర్మాణం ఏ విధంగా చేయాలి, వాటియొక్క అలంకరణ ఏవిధంగా ఉండాలి, రథాలను ఏవిధంగా భద్రపరచాలి, ఎలా కాపాడుకోవాలి, రథనిర్మాణానికి కావలసిన సామగ్రిని, కలపను ఏ విధంగా సమకూర్చుకోవాలి అన్న అన్ని విషయాలను అశరీరవాణిగా సాక్షాత్తు నారాయణుడే చెప్పాడని పురాణాలు చెప్తున్నాయి. స్వామి చెప్పిన విషయాల ద్వారా, నారదుని సలహా, సూచనలతో ఇంద్రద్యుమ్న మహారాజు రథ నిర్మాణం చేయించగా ఒక శుభముహూర్తాన నారదుడు కార్యక్రమం నిర్వహింప చేశాడు.

చందనయాత్ర:

రథయాత్రకు శ్రీకారం చుట్టేది చందనయాత్రతోనే. అక్షయ తృతీయరోజు రథాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పుడే ఆలయం లోని విగ్రహాలకు చందనయాత్ర మొదలవుతుంది. ఉత్కళ ప్రాంతంగా పిలుచుకునే ఈ ప్రాంతంలో పంటలకు శ్రీకారం చుట్టేది కూడా ఆ రోజే. ఇది 42 రోజులపాటు జరుగుతుంది. మొదటి 21 రోజులు బాహర్ చందన్ అని పిలుస్తారు. గది బయట భక్తులు చూస్తుండగానే గంధం పూతపూసి పూజలు చేస్తారు. మిగిలిన 21 రోజులు అంతరాలయంలో జరుగుతుంది. దీనిని భీతర్ చందన్ అని పిలుస్తారు. చందనయాత్రలో భాగంగా చందన్ తాలాబ్ లేదా నరేంద్రకొలను అని పిలిచే సరస్సులో, జగన్నాథుడు మదననమోహనమూర్తిగా నౌకావిహారం చేస్తాడు. మూడురోజుల పాటు ఈ తెప్పోత్సవం నిర్వహిస్తారు. పంచపాండవులు ప్రతిష్టించినట్లుగా చెప్పబడే అయిదు శివాలయాలలోని ప్రతినిధి మూర్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ చందనోత్సవం తరువాతే స్నానోత్సవం జరుగుతుంది.

జగన్నాథుని స్నానోత్సవం:

రథయాత్రకు ముందు జ్యేష్ట పూర్ణిమనాడు జరుగుతుందీ ఉత్సవం. స్వామి అవతరించినది కూడా జ్యేష్టమాసంలోనే కాబట్టి జ్యేష్టమాసం లో జరిగే స్నానోత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దీనినే స్నానపూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఆలయంలోనే ఈశాన్యమూల ఉన్న స్నానవేదికపై మూలమూర్తుల్ని పెట్టి 108 బిందెల పవిత్రజలంతో ఈ మూర్తుల్ని అభిషేకిస్తారు. ఈ స్నానవేదికనే అనసరపిండి అని పిలుస్తారు ఆటవికులు. ఈ ఉత్సవంలో స్నానం చేయించినవారికి కోటిజన్మలలో చేసిన పాపాలయినా పరిహరించబడతాయి. అదేవిధంగా ఈ స్నానోత్సవాన్ని చూసినవారు కూడా ఎంతో భాగ్యవంతులుగానే పరిగణించాలి. ఎందుకంటే జ్యేష్టమాసంలో స్వామి జన్మదినమున జరిగే ఈ స్నానోత్సవాన్ని చూసినవారికి కలిగే పుణ్యఫలితంతో మరే ఇతర పుణ్యఫలితం సరితూగదట. ఎన్నో పుణ్యక్రతువులు చేస్తే, ఎన్నో దానధర్మాలు చేస్తే, ఎనో తీర్థయాత్రలు చేస్తే, పుణ్యతీర్థాలలో స్నానమాచరిస్తే, ఎనో వ్రతాలు, జపతపాలు చేస్తే లభించే పుణ్యంకంటే అధికమైన పుణ్యఫలం ఈ స్నానోత్సవం వీక్షణం వలన లభిస్తుందని, గర్భిణీ స్త్రీ గనక ఈ ఉత్సవాన్ని తిలకిస్తే ఉత్తములయిన సంతానం కలుగుతుంది. గర్భశోకాలనుండి రక్షించ బడుతుంది. రోగపీడితులు గనక చూస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఇలా ఏ రకమైన వేదనతో ఉన్నవారైనా ఆ వేదన నుండి బయటపడతారని స్కాందపురాణంతర్గత కథనం చెప్తోంది. ఇంతటి మహిమాన్వితమైన స్నానోత్సవం ముగిసిన తరువాత స్వామి జ్వరపీడితుడైనట్టు చెప్పి  వారం రోజులపాటు గర్భాలయంలో స్వామి విశ్రాంతి తీసుకుంటాడు. ఈ పదిహేను రోజులు భక్తులకుగాని, వేదపండితులకుగాని, చివరకు ఆ దేశపు రాజుకు కూడా దర్శనం ఉండదు. కేవలం దయితపతులు మాత్రమే స్వామికి చేయవలసిన పూజాది కార్యక్రమాలు, నైవేద్య సమర్పణలు జరుపుతారు. ఆటవికులు అతి గోప్యంగా చేసే ఈ పూజలే “అనవసరనీతి పూజలు”. వారి ఆటవిక సంప్రదాయానుసారం దేవతామూర్తులకు అడ్డుగా ఒక తడికలాంటి ఆచ్చాదన పెట్టి, పండ్లు, కందమూలాలు మొదలైన నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ పదిహేనురోజులలో రంగులు వెలసిన మూర్తులకు రంగులు వేస్తారు. ఈ రంగులు కూడా ఎటువంటి కృత్రిమత్వానికి తావులేకుండా సహజసిద్ధంగా తయారుచేసిన రంగులనే వాడతారు. ఈ రంగులు వేసే సందర్భంలో దేవతామూర్తుల ఆకారంలో ప్రస్ఫుటంగా కనబడే కనులకు రంగులు వేసే సందర్పాన్నినేత్రోత్సవం'గా పిలుస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ముగిసి తిరిగి అమావాస్య నాడీ స్వామి దర్శనం అవుతుంది. పది హేను రోజుల అనంతరం జగన్నాథుడు... సుభద్ర, బలరామ సహితుడై స్నానం పూర్తిచేసుకొని రథాలను అధిరోహించి తన జన్మస్థానమైన జనకపురికి బయలుదేరతాడు. ఈ జనకపురి జగన్నాథ ఆలయ నిర్మాత అయిన ఇంద్రద్యుమ్న మహారాణి గుండీచాదేవిది. దానినే గుండీచాబరి అని కూడా పిలుస్తారు. జగన్నాథుడు ఆమెను అత్తగా గౌరవిస్తాడని అందుకే వారం రోజులపాటు స్వామి అత్తవారింట్లో ఉంటాడని చెప్తారు. జగన్నాథ, సుభద్ర, బలభద్రుల దారుమూర్తులు తయారైంది అక్కడేనని అందుకే దీనిని జనకపురి, జన్మస్థానం అని చెప్తారు.

తొలి ఏకాదశి templeinfo

తొలి ఏకాదశి

తొలి ఏకాదశి templeinfo
హిందువులకు అతి ముఖ్యమైన, పవిత్రమైన తిథి ఏకాదశి. మేరుపర్వతమంత పాపాన్నికూడా ప్రక్షాళన చేయగల ప్రభావం గలిగింది ఏకాదశి వ్రతం. ఏకాదశినాడు చేసే పూజలు, జపతపాలు, స్నానం దానం ఇలా ఏ ఒక్క పుణ్యకార్యమైనా అఖండమైన ఫలితాన్నందిస్తుంది. వ్యాసమహర్షి అందించిన పురాణాలను నకాది మునులందరికి విశదపరచిన సూతుడే నైమిశారణ్యంలో ఏకాదశిగురించి కూడా చెప్పినట్టు నారద పురాణం తెలియజేస్తోంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఏకాదశిని హరివాసరం అని కూడా అంటారు.
పూర్వం కుంబుడు అనే రాక్షసుడు వాని కుమారుడు మృదుమన్యుడు అచంచలమైన శివభక్తితో అనేక వరములు సంపాదించుకున్నారు. అలాగే స్త్రీ పురుషులనుండి గాని ఏ ఇతర ప్రాణి    నుండిగాని తనకు మరణం లేకుండా వరాన్ని కోరుకున్నారు. అయితే మరణం అనేది అనివార్యం కాబట్టి ఆ వరం కుదరదని, ఒక అయోనిజ అయిన స్త్రీ చేత తప్ప ఇంకెవరివల్లను మరణం లేకుండా వరాన్నిచ్చాడు శివుడు. అయోనిజ ఉద్భవించడం ఎలాగూ సాధ్యంకాదు. కాబట్టి ఇక
తమకు మరణం లేదన్న గర్వంతో విర్రవీగుతూ సకల జనులను బాధపెట్టసాగారు. వారు చివరకు త్రిమూర్తులను కూడా జయించే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో త్రిమూర్తులు తమ భార్యలతో పాటు వెళ్ళి ఉసిరిక వృక్షం తొర్రలో దాక్కొనవలసి వచ్చింది. అందరూ ఆ తొర్రలోనే ఇరుక్కున్నందువలన ఆ రాపిడికి ఒక కన్య ఉద్భవించింది. ఇంతలోనే రాక్షసుడు త్రిమూర్తులను వెతుక్కుంటూ అక్కడకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో తొర్రలోనుండి వచ్చిన కన్య రాక్షసుని సంహరిం చింది. ఇలా దుష్ట సంహారం చేసి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగించింది కాబట్టి మహావిష్ణువుకు ఇష్టురాలయ్యింది. ఆ బాలికే ఏకాదశి అని ప్రతి పక్షంలోను పదకొండవ రోజు ఆమెను స్మరించు కొని శ్రీమన్నారాయణుని పూజిస్తే సకల పాపహరణమని పురాణాలు చెప్తున్నాయి.
మరో కథనం ప్రకారం, కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు ఎన్నో వరాలను సంపా దించి ఆ వరగర్వంతో మునులను, దేవతలను హింసిస్తూ చివరకు ఇంద్రుడు, బ్రహ్మలను కూడా వారి స్థానాలనుండి వెళ్ళగొట్టాడు. వారందరి బాధ తీర్చడానికి విష్ణువు మురాసురునితో తలపడ్డాడు. వెయ్యేళ్ళు యుద్దం చేసినా రాక్షసుని నిర్జించలేకపోయాడు. మహావిష్ణువు చివరకు అలసటతో 'సింహావధ' అనే గుహలో దాక్కున్నాడు. విష్ణువును వెతుక్కుంటూ వచ్చాడు రాక్షసుడు, ఆ సమయంలో విష్ణువు తన శరీరం నుండి ఒక బాలికను ఉద్బవింపజేసి మురాసురునిపైకి వది లాడు. ఆ బాలిక రాక్షసునితో యుద్ధం చేసి సంహరించింది. ఆమే ఏకాదశి. తనకు ఈ విధంగా రాక్షస సంహారంతో సంతోషం కలిగించినందుకు ఫలితంగా వరం కోరుకొమ్మన్నాడు విష్ణుమూర్తి, దానికా బాలిక ఏకాదశి "శ్రీమన్నారాయణా సర్వతిథులలోను నేను ప్రముఖంగా పూజించబడాలి. ఎల్లవేళలా నేను నీకు ప్రియమైనదానిగా ఉండాలి. నా తిథిలో ఉప వాసం ఉండి వ్రతం ఆచరించినవారు మోక్షాన్ని పొందాలి' అని అడిగింది. ఆ వరానిచ్చాడు విష్ణువు. ఇలా ఏకాదశి తిథి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్టు భవిష్యపురాణం చెప్తోంది. ఏకాద శులన్నింటిలోకి అత్యంత ప్రధానమయినది తొలి ఏకాదశికి.
ఈ ఆషాడమాసంలోని ఏకాదశే తొలి ఏకాదశి ఎలా అయింది అంటే పూర్వకాలంలో వర్షఋతువే ప్రథమ ఋతువుగా ఆషాఢమాసంతోనే సంవత్సరం ప్రారంభమయ్యేదట. అలా ఆషాఢంలో వచ్చిన ఏకాదశి తొలి ఏకాదశి అయింది. తొలి ఏకాదశినే శయనైకాదశి అనీ అంటారు. ఈ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో నిద్రకు ఉపక్రమిస్తాడు. దానివల్ల ఈ ఏకాదశి శయనైకాదశి గా పేర్గాంచింది. ఈ తొలి ఏకాదశి రోజున గోపద్మ వ్రతాన్ని ఆచరించాలని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజు ఆవుల కొట్టాన్ని శుభ్రం చేసి కొట్టం మధ్యలో ముప్ఫైమూడు పద్మాలను వేసి మధ్యలో లక్ష్మీనారాయణులను ఉంచి పూజించాలి. గంధపుష్పాలతో అర్చించాలి. ఇలా సంవత్సరం రోజులు చేసి వాయనాలతో దక్షిణతాంబూలాలనిచ్చి వ్రత ఉద్యాపనచేయాలి.

వాట్సప్ ప్రియులకు ఎంత కష్టమొచ్చిందో | templeinfo.ml


వాట్సప్ ప్రియులకు ఎంత కష్టమొచ్చిందో.....

watsapp latest updates
ఒకపూట తిండి లేకపోయినా ఫరవాలేదు. కాని ఒక్క గంట వాట్సప్ లేకపోతే అమ్మో ఇంకేమైనా ఉందా కొంపలంటుకోవూ.... ఎన్ని ఊసులు మిస్సవుతాం! ఎన్ని గ్రూపులు మిస్సవుతాం! ఆవకాయ పెట్టడం దగ్గర్నుంచి అఫీషియల్ వర్క్ వరకు అన్నీ వాట్సప్ మీద నడుస్తున్నాయి. బామ్మ గారి దగ్గర్నుంచి బాసుగారి వరకు చేతిలో స్మార్ట్ ఫోను, అందులో వాట్సప్ ఉండాల్సిందే. ప్రస్తుత పరిస్తితి ఇది. అయితే ఆ కొంపలంటుకునే క్షణం వచ్చేసింది. ఎందుకంటే వాట్సాప్.. లో ప్రచారమవుతున్న కొన్ని తప్పుడు వార్తల కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోయిన పరిస్తితులు ఎక్కువవుతున్నాయి. తెలిసో తెలియకో మనం ప్రచారం చేస్తున్న ఈ తప్పుడు వార్తల కారణంగా రెండు నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో కేవలం ఈ వార్తల కారణంగానే హత్యకు గురయినట్టు నిర్దారారణ అయింది. ముఖ్యంగా పిల్లల కిడ్నాపర్లు వస్తున్నట్టు వచ్చిన వార్తల కారణంగా ఎవరు కొంచెం అనుమానంగా కనిపించినా వాళ్ళను కొట్టి చంపేస్తున్న ఘటనలు ఊపందుకున్నాయి. దాంతో ప్రభుత్వం ఈ విషయం మీద గట్టి చర్యలే తీసుకోబోతోంది. వాట్సాప్ లో ప్రచారమయ్యే తప్పుడు వార్తలను నియంత్రించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపధ్యంలో వాట్సాప్ సంస్థ కొన్ని మార్పులు చేసిందట. ఇప్పుడు మనం ఒక మెసేజ్ ని మన బందు,మిత్ర,సపరివార సమేతానికి ఒకేసారి పంపించుకొని హమ్మయ్య ఓ పనైపోయిందని ఊపిరి పీల్చుకుంటున్నాం. ఇకమీదట అలా కుదరదు. ఒకేసారి ఐదుగురికి మాత్రమే సమాచారాన్ని షేర్ చేసే విధంగా వాట్సప్ సాఫ్ట్ వేర్ ను మారుస్తోందట. వాట్సాప్ షేర్ ఐకాన్ ను కూడా తొలగిస్తామని వాట్సాప్ తాజాగా ప్రకటించింది. తప్పుడు వదంతులు నియంత్రణలో భాగంగానే వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుందట.


19, జులై 2018, గురువారం

puri jagannatha temple history | rathayara


జగన్నాధుని ఉత్సవాలు 

puri jagannatha temple history | rathayara

పహాండీ ఉత్సవం:

ముందుగా రథం పైకి సుదర్శనమూర్తిని తీసుకువచ్చి సుభద్రాదేవి రథంలో పెడతారు. తరువాత ఎవరికి నిర్దేశించిన రథాలలో వారిని ఉంచుతారు. ఈ విధంగా మూలమూర్తులను ఆలయంలో నుంచి బయటకు రథాల దగ్గరకు తీసుకువచ్చే పని కేవలం దయితులుగా చెప్పబడేవారు మాత్రమే. ఇలా తీసుకురావడాన్నే పహాండీ ఉత్సవం ఉంటారు.
హీరాపంచమి:
రథయాత్రలో జగన్నాథుడు గుండీచా మందిరంలో కొలువుతీరిన తొమ్మిది రోజులలో అయిదవ రోజు జరిగే ఒక విచిత్రమైన ఉత్సవాన్నే హీరాపంచమిగా చెప్తారు. ఇది ఆసక్తికరమైన, విలక్షణమైన ముచ్చట. రథయాత్ర అయిదవరోజు అక్కడకు వచ్చిన లక్ష్మీదేవి తనను స్వామితో పాటు ఆలయంలోనికి తీసుకువెళ్లలేదని అలిగి అక్కడ స్వామి వచ్చిన రథాన్ని కొద్దిగా ధ్వంసం చేసి వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి పేరుమీద పూజారులే ఈ కార్యక్రమమంతా జరిపిస్తారు. ఈ ఉత్సాహకరమైన ముచ్చటే హీరాపంచమి.

బహుదా యాత్ర:

తిరుగు రథయాత్రనే బహుదాయాత్రగా పిలుస్తారు. ఈ ఉత్సవం మధ్యలో ఒకచోట ఆపి బియ్యం, బెల్లం వంటి పదార్థాలతో చేసిన ఒక తీపి పదార్థాన్ని స్వామికి సమర్పిస్తారు. ఇది స్వామికి మేనత్త అందించే ఆహారంగా నమ్మకం. రథాలు మళ్లీ మూలమందిరాన్ని చేరుకోగానే ముందుగా దేవతామూర్తులకు బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. దీనినే సునావేషగా పిలుస్తారు. అనంతరం పానకం, ఇతర నైవేద్యాలను మట్టిపాత్రలలో తెచ్చి దేవతా మూర్తులకు సమర్పిస్తారు. అవి స్వీకరించిన దేవతామూర్తులు తిరిగి ఆలయంలోనికి చేరుకొని రత్నవేదిక మీద కొలువుతీరుతారు.

రథయాత్ర దర్శన ఫలితం:

రథయాత్రను దర్శించడమే కాదు, దానిని కేవలం మనసులో స్మరించుకున్నా కూడా పూర్వజన్మలో చేసిన పాపాలు ప్రక్షాళనమవుతాయని పురాణాలు చెప్తున్నాయి. రథయాత్ర చేస్తున్న జగన్నాథుడ్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదట. ఈ రథోత్సవాన్ని దర్శించడంతోనే గతజన్మలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయట. రథోత్సవంలో సాగుతున్న సుభద్రా, బలభద్ర సమేత జగన్నాథుని దర్శించుకున్న వారికి బ్రహ్మహత్యా దోషం అయినా నివృత్తి అవుతుందని పురాణ ఉవాచ. రథోత్సవాన్ని తిలకించినవారికి గంగాస్నాన ఫలితం లభించడంతో పాటు అసంఖ్యాకమైన గోదాన ఫలితం కన్యాదాన ఫలితం, అశ్వమేధయాగ ఫలితం లభిస్తుంది. ఈ రథోత్సవాన్ని కనులార చూడడానికి బ్రహ్మతో సహా దేవతలు తరలి వస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఉత్సవం ఆద్యంతం వీక్షించి అనంతరం తిరిగి వెళతారని పురుషోత్తమక్షేత్ర మహత్మ్యం చెప్తోంది. రథోత్సవ సమయంలో ఎవరైతే రథం మీదున్న జగన్నాథునికి పుష్పసమర్పణ చేస్తారో, స్వామిని వింజామరలతో వీస్తారో, తనకు చేతనయిన రీతిలో నృత్య గానాదులతో స్వామిని కీర్తిస్తారో అట్టివారందరూ ఇహలోకంలో సుఖసంతోషాలతో జీవించి సురక్షరంతరం వైకుంఠవాసాన్ని పొందుతారని క్షేత్ర మహత్యంగా తెలుస్తోంది. ఒకవేళ పూరీ క్షేత్రానికి వెళ్లి ఈ రథయాత్ర చూడలేనివారు తమ ఇళ్లలోనే రథయాత్ర జరిగినన్నాళ్లు ఒంటిపూట భోజనం చేస్తూ రక్తిశ్రద్దలతో స్వామిని ఆరాధిస్తే ప్రతిరోజు సాయం సమయంలో శ్రీమన్నారాయణుని దర్శించి నేతితో దీపాలను వెలిగిస్తే సకల సంపదలు చేకూరి అనుకున్న పనులన్ని నెరవేరుతాయని చెప్తారు.

Latest Tollywood news | chit chat with RX100 Director Ajay Bhupathi

Special chit chat with RX100 Director Ajay Bhupathi

Latest Tollywood news | chit chat with RX100 Director Ajay Bhupathi
RX100 యూత్ ని కుదిపేస్తున్న పేరు. టాలివుడ్ లో సంచలనంగా మారిన పేరు. రకరకాల సంచలనాల మధ్య విజయం సొంతం చేసుకున్న అర్జున్‌ రెడ్డిని ఇంకా మర్చిపోనేలేదు. ఇప్పుడలాంటి ఊపుతోనే ఓ రకంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ జోష్ తోనే వచ్చేసింది RX 100 మూవీ. మరో బోల్డ్ సినిమా. సినిమా టైటిల్‌ తో పాటు పోస్టర్స్‌, టీజర్స్‌ వెరైటీగా, డిఫరెంట్‌గా ఉండటంతో సినిమా మీద భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది. దానికి తగ్గట్టుగా చిత్రయూనిట్‌ కూడా తన బోల్డ్ కామెంట్స్ తో టాలివుడ్ ఆడియన్స్ అటెన్షన్ బాగానే గెయిన్ చేసింది. రొటీన్‌ సినిమాలు చూడాలనుకునేవారు మా సినిమాకు రావొద్దంటూ ధైర్యంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వటంతో సినిమా మీద అంచనాలు ఇంకా ఇంకా పెరిగిపోయాయి. దానికి తోడూ మూవీ డైరెక్టర్ ది గ్రేట్ రామ్‌ గోపాల్ వర్మ దగ్గర దర్శశిష్యుడాయే. సో... ఇవన్నీ కలిస్తే rx 100. మరి మూవీ మీద అందరి కన్ను పడకుండా ఉంటుందా.... అదంతా సరే అసలీ rx100 పేరేంటి? అదేంటో మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి మాటల్లోనే విందాం....

18, జులై 2018, బుధవారం

puri jagannatha temple history | జగన్నాథ రథయాత్ర


రథయాత్రలో విశేషాలు

puri jagannatha temple history | జగన్నాథ  రథయాత్ర
రథయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరువాత పూరీలో శంకర భగవత్పాదులు ఏర్పాటు చేసిన గోవర్ధన మఠ పీఠాధిపతులు వచ్చి స్వామిని దర్శించుకొని వెళతారు. అనంతరం భగవంతుడి ముందు ఎంతటివారైనా సేవకులే అని చెప్పడానికి నిదర్శనంగా పూరీ రాజు వచ్చి మూడు రథాల ముందు కస్తూరి కళ్లాపి జల్లి బంగారు చీపురుతో ఊడుస్తాడు. అనంతరం రథం  త్రాళ్లు లాగి  రథయాత్రను ప్రారంభిస్తాడు. దీనినే 'చెహరాపహారా' అంటారు. తరువాత పండాలు “జై మనిమా..” అంటూ రథయాత్రను కొనసాగిస్తారు. ముందు బలభద్రుని రథం, తరువాత సుభద్రాదేవి రథం, ఈ తరువాత జగన్నాటక సూత్రధారి... చిద్విలాసుడు అయిన జగన్నాథుని రథం లాగుతారు. ఇక అక్కడి నుంచి రథయాత్ర సందోహం మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి జై జగన్నాథా... అంటూ నినదిస్తూ వివిధ వాయిద్యాలతో, నృత్య గానాలతో సాగిపోయే జనయాత్ర మరో సాగరఘోషను తలపింపచేస్తుంది. ఇసుకేస్తే రాలని జనసంద్రంతో ప్రధాన ఆలయం నుంచి ప్రారంభమయ్యే రథయాత్ర కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సుదీర్ఘ సమయం పడుతుంది. జాతి, మత బేధాలు గాని, పేద, గొప్ప తారతమ్యాలుగాని, చిన్న, పెద్ద అంతరాలుగాని లేకుండా ప్రతిఒక్కరూ ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాన్నిచ్చేది రథయాత్ర. రథయాత్ర ప్రారంభ దినం నాడు గుండీచా మందిరానికి చేరుకున్న జగన్నాథుడు ఆ రోజు రాత్రి మందిరం బయటే ఉండి సోదర, సోదరీలతో విశ్రాంతి తీసుకొని ఆ మరునాడు మందిరంలోనికి చేరుకుంటాడు. అప్పటి నుండి తొమ్మిదిరోజులు గుండీచా మందిరంలోనే కొలువుతీరి భక్తులకు దర్శనమిస్తాడు సోదరీ, సోదర సమేతుడైన జగన్నాథుడు.

తలకింత:

ఈ యాత్రలో లక్షలాదిగా వచ్చే ప్రజలు ఎక్కడ ఒకింత చోటు దొరుకుతుందా అక్కడ చేరి స్వామిని దర్శిద్దామా అన్న ఆత్రంతో ఉంటారు. ఏ ఇంటి మేడ చూసినా జనాలతో క్రిక్కిరిసి ఉంటుంది. ఇదే అదనుగా అక్కడ రథయాత్ర జరిగే ప్రాంతంలో ప్రతి ఇంటివారు తమ ఇంటి మేడలను, మిద్దెలను ఎక్కి చూడడానికి అద్దెను కూడా వసూలు చేస్తారు. ఒకొక్క మనిషికి ఇంత అని రుసుమును వసూలు చేస్తారు.

రధయాత్రలో వింత ఆచారాలు:

puri jagannatha temple history | జగన్నాథ  రథయాత్ర
జగన్నాథుని రథయాత్రలో ఎన్నో విచిత్రమైన, వింతైన ఆచారాలు కనబడతాయి. రథయాత్రలో ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా రథం కొంచెం కూడా ముందుకు కదలదట. అలాంటప్పుడు రథయాత్రలో ఏదో తెలియని పొరపాటు జరిగి ఉంటుందని భావించి, జరిగిన పొరపాటేదైనా తమను క్షమించమని వేడుకుంటూ
రధం ముందు కొబ్బరికాయలు కొడతారట. అప్పుడు రథం ముందుకు కదులుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఉత్సవంలో స్వామి రథం మీద అసభ్యపదజాలంతో స్వామిని దూషిస్తూ ఉండే ఒక మనిషి ఉంటాడట. ఆ వ్యక్తి స్వామిని ఉద్దేశించి అసభ్యమైన మాటలతో పాటలు పాడుతూ ఉంటే స్వామి రథం మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతుందనే అభిప్రాయంతో అనాటి రాజులు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించేవారట. ఆ వ్యక్తినే 'ధక్కువాడు' అని పిలుస్తారు. కేవలం ఈ రకమైన పాటలు పాడడానికే దక్కువాడు ఉద్దేశించబడి ఉంటాడు. ఉత్సవంలో ఈ ధక్కువాడు అలగడం, అతడిని అందరూ బ్రతిమాలడం కూడా ఒక ఆనవాయితీగా ఉండేదట అప్పట్లో అయితే దీని వెనుక మరో కథనాన్ని చెప్తారు పెద్దలు. ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం ఒక నిరుపేద భక్తుడు స్వామిని నమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. ఎంతగా స్వామిని నమ్ముకున్నా జగన్నాథుడు అతడిని కరుణించకపోవడంతో బాధపడిన ఆ భక్తుడు స్వామి మీద ఆగ్రహించి, దుఃఖంతో, అసహాయతతో కూడిన ఆగ్రహంతో రథయాత్ర సమయంలో స్వామి రథం ముందు నిలబడి ,స్వామిని ఉద్దేశించి ఒరియా భాషలో "ఓ జగన్నాథా..! నీవు కరుణామయుడవంటారే! భక్తులకు ఎల్లవేళలా అండగా ఉంటావంటారే..! నిరంతరం నీ భక్తులను కంటికి రెప్పలా కాపాడతావంటారే..! మరి అహర్నిశలూ నేను నిన్నే నమ్ముకున్నాను. నీవు తప్ప మరో దైవాన్ని తలచుకొని ఎరగను. నీవు తప్ప మరో దైవాన్ని తలచుకొని ఎరుగను. మరి నన్నెందుకు నీవు కరుణించవు? నేను నీకు చేసిన పూజలు, జపాలు చాలలేదా? లేక నీవు నిజంగా అందరూ అంటున్నట్లు భక్తులను ఆదుకునేవాడివి కాదా?" అంటూ వివిధ రకాలుగా కఠినమైన మాటలతో నిందించాడట. అప్పటి నుండి అదొక సంప్రదాయంగా మారి, రానురాను శృతిమించి రాగాన పడినట్లు నిందారోపణలు, దారితప్పి అసభ్యతకు దారితీసి అదే ఢక్కువాడి సంప్రదాయంగా మారినట్లు ఒక కథనం.

నేటి విశేషం | great fire of romeరోమ్ఈ తగలబడిపోతుంటే ఫిడేల్ వాయించుకున్న నీరో చక్రవర్తి 

Today importance | Great fire of Rome
Great fire of rome 
జూలై 18. ఈ రోజు ప్రంపంచ చరిత్రలో మరచిపోలేని రోజు.1964 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు అంటే జులై 18 న అగ్ని ప్రమాదం జరిగి రోమ్ లో చాలా భాగం తగలబడిపోయింది. అదే Great fire of rome. ఆ రోజు రాత్రి మొదలైన మంటలు 5 రోజుల వరకు చల్లారలేదట. రోమ్ లోని 14 ప్రాంతాల్లో 4 ప్రాంతాలు పూర్తిగా భస్మమయి పోయాయి. మరో ఏడూ ప్రాంతాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయట. ఈ విషయం గురించే ఓ పక్కన రోమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి హాయిగా ఫిడేలు వాయించుకుంటూ ఉన్నాడని అంటుంటారు. నిజానికది ఫిడేలు కాదు. లైర్ అనే వాద్యమట. అప్పటికింకా ఫిడేలు రూపొందలేదట. రోమన్ చరిత్రకారుడు టాసిటస్ రాసినదాని ప్రకారం .... చూస్తె అప్పటి రోమ్ చక్రవర్తి నీరో ఓ పక్క నగరం తగలబడిపోతుంటే తన అంతఃపురంలో కూచుని లైర్ వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ ఉన్నాడట. దీన్నే గ్రేట్ ఫైర్ ఆఫ్ రోమ్ గా ప్రసిద్ధి చెందింది.
క్రీ.శ.64 జూలై 18. న రోమ్ నగరం తగలబడిపోయిన రోజు. ఇళ్లు, భవంతులు అన్నీ బూడిద కుప్పలయ్యాయి. వరసగా ఐదు రోజులు మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయట. నీరో చక్రవర్తే ఈ దారుణానికి పూనుకున్నాడని అంతా అనుకున్నారు. డోమస్ ఆరియా అనే మహా అద్భుత రాజప్రాసాదాన్ని నిర్మించేందుకు నీరో ఈ దారుణానికి ఒడిగట్టాడంటారు.
ఓ పక్క నగరమంతా తగలబడిపోతుంటే నీరో మాత్రం ‘లైర్’ అనే వాద్యాన్ని వాయించడంలో మునిగిపోయాడట.  

17, జులై 2018, మంగళవారం

Puri jagannath temple history | జగన్నాథ రథయాత్ర


జగన్నాధుని ఉత్సవాలు

Puri jagannath temple history
జగన్నాథ రథయాత్ర 
జగాలనేలే జగన్నాధుని ఉత్సవాల విషయానికి వస్తే.. ఆ పరమాత్మకు ఉత్సవాలకే కొదవా! ఎన్ని ఉత్సవాలు.. మరెన్ని పండుగలు.. ఇంకెన్ని పర్వాలు.. జగన్నాధుని ఉత్సవాల విషయంలో ఒక నానుడి ఉంది. సంవత్సరంలో పన్నెండు నెలల్లో పదమూడు ఉత్సవాలని!ఈ నయనపథగామికి ప్రతిరోజు ఉత్సవమే! ఈ ఉత్సవాలన్నింటిలోకి ముఖ్యంగా చెప్పుకోవలసినవి దేవస్నాన పూర్ణిమ, రథయాత్రలు, శయనయాత్రలు, దక్షణాయన ఉత్సవాలు, పార్శ్వ పరివర్తన, దేవ ఉధ్యాపన, ప్రావణ షష్టి, పుష్య విశాఖ, మకరసంక్రాంతి, డోలోత్సవం, దమనక చతుర్దశి, అక్షయ తృతీయ. అయితే వీటిలో కూడా చెప్పుకోతగినది, ప్రపంచ ప్రసిద్ది చెందినది మాత్రం రథయాత్ర.

రథయాత్ర:

Puri jagannath temple history
పూరీ అనగానే.. జగన్నాథుని పేరు వినగానే వెంటనే జ్ఞాపకం వచ్చేది రథయాత్ర. ఆలయంలో తన సమీపానికి రాలేని ప్రజానీకం కోసం ఆ పరంధాముడు తానే స్వయంగా కదలి వచ్చే ఉత్సవం రథయాత్ర. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో జరిగే రథయాత్రను ప్రపంచమంతా ఆసక్తిగా తిలకిస్తుంది. ఈ రథయాత్రనేమహావేదీ మహెూత్సవం'గా పురాణాలు వర్ణించాయి. ఈ ఉత్సవాలనేఘోషయాత్రలు', 'గుండీచా యాత్రలు'గా కూడా వర్ణిస్తారు. రథయాత్రకు సంబంధించిన విషయంలో అంటే ఎప్పుడు చేయాలి.. ఎలా చేయాలి.. ఇత్యాది విషయాలు, సంగతులు అన్నీ కూడా సాక్షాత్తు విష్ణుమూర్తే స్వయంగా ఇంద్రద్నుమ్న మహారాజుతో చెప్పాడని పురాణాలు చెప్తున్నాయి. సాధారణంగా ఆలయాలలో రథోత్సవాలలో ఉత్సవమూర్తుల్ని ఊరేగిస్తారు. కాని ఇక్కడ ప్రధాన మూర్తులే ఊరేగడం జరుగుతుంది. ప్రతి ఆలయంలోనూ రథం స్థిరంగా ఉంటుంది. ఉత్సవాల సమయంలో ఆ రథాన్నే ఉపయోగిస్తారు. కాని పూరీ జగన్నాథుడి తేరు తీరే వేరు. రథయాత్రకు సరిగ్గా అరవై రోజుల ముందు వైశాఖ బహాళ విదియనాడు రథ నిర్మాణానికి కావలసిన కలపను సేకరించవలసిందిగా పూరీ మహారాజు ఆదేశిస్తాడు. సామంతరాజైన దనపల్లా రాజు నేతృత్వంలో వృక్షాల సేకరణ చేసిన బ్రాహ్మణులు, దయిత నాయకులు వాటికి తగిన శాంతులు చేసి వాటిని 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తీసుకువస్తారు. అలా తీసుకువచ్చిన వృక్షపు ముక్కలతో అక్షయతృతీయ నాడు రథ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. అత్యంత కఠినమైన నియమనిష్టలతో రథాల నిర్మాణం జరుగుతుంది. రథోత్సవం అనంతరం ఆ రథాలను మళ్లీ విడగొట్టేస్తారు. అలా విడగొట్టిన చెక్కను విక్రయిస్తారట. ఆ చెక్కలను కొనుక్కొని ఇళ్లకు సింహద్వారాలుగా కట్టుకొని అది తమకు శుభాన్నిస్తుందని నమ్ముతారెంతోమంది.

నందిఘోష్:

నలభై అయిదు అడుగుల ఎత్తుతో జగన్నాథుడి రథం తయారుచేయబడుతుంది. ఇదే 'నందిఘోష్. దీనికి పదహారు చక్రాలుంటాయి. ఇవి షోడశకళలను సూచించేవిధంగా ఉంటాయి. రథాన్ని ఎర్రటి చారలు కలిగిన పసుపు వస్త్రాలతో అలంకరిస్తారు. రథం పైన అమర్చిన విజయధ్వజాన్ని త్రైలోక్యమోహిని అంటారు. ఈ రథసారథి దారుకుడు. రథంలో వరాహస్వామి, గోపీకృష్ణుడు, నరసింహుడు, నవరుద్రులు, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, సప్తర్షులు కొలువుతీరి ఉంటారు. వీరే దుష్టశక్తుల నుండి రథాన్ని కాపాడే పార్శ్వదేవతలు.

తాళధ్వజ్:

బలభద్రుడి రథం నలభై నాలుగు అడుగుల ఎత్తుతో చతుర్ధశ మన్వంతరాలను సూచించే, పధ్నాలుగు చక్రాలతో ఉంటుంది. దీని పేరు తాళధ్వజ్. దీనినే ధర్మరథమని కూడా చెప్తారు. రథసారధి మాతలి. ఎర్రటి చారలున్న నీలిరంగు వస్త్రంతో రథాన్ని అలంకరిస్తారు. గణేశుడు, కార్తికేయుడు, సర్వమంగళ, ప్రళంబోయ, మృత్యుంజయుడు, నటేశ్వరుడు, శేషదేవుడు, రుద్రుడు మొదలయిన వారు రథాన్ని రక్షిస్తూ ఉంటారు. రథంపై హలధ్వజం రెపరెపలాడుతుంది.

పద్మధ్వజ్:

సుభద్రాదేవి రథం 43 అడుగుల ఎత్తుతో ద్వాదశమాసాలకు గుర్తుగా పన్నెండు చక్రాలతో ఉండే పద్మధ్వజం. దీనినే దేవదళ్ అని కూడా పిలుస్తారు. ఎర్రటిచారలున్న నల్లటి వస్త్రంతో రథాన్ని అలంకరిస్తారు. రథసారథి అర్జునుడు. రథంపై పద్మధ్వజం ఉంటుంది.

Haridwar temple tour | స్వర్గద్వారం హరిద్వార్


స్వర్గద్వారం హరిద్వారం

Haridwar temple tour
స్వర్గద్వారం హరిద్వార్
మాయాపురి! గంగాద్వారం! హరద్వారం! హరిద్వార్!ఎందరినో ప్రకృతి సౌందర్యాలతో మురిపించి మరెందరినో ఆధ్యాత్మిక మార్గానికి మరలించిన హిమాలయ పర్వత పాదాల వద్ద నెలకొని ఉన్న పుణ్య క్షేత్రం. పావన గంగానదీ తీరంలో కొలువైన ఈ క్షేత్రంలో తరతరాలుగా ఎంతోమంది ఋషులు ఆశ్రమాలు నిర్మించుకున్నారు. తపస్సు చేశారు. ఇప్పటికీ  మోక్ష పథగాములైనవారు తమ ధ్యానానికి, సాధనకు అనువైన చోటుగా భావించే ప్రదేశం హరిద్వార్, ఉత్తరప్రదేశ్ లోని అతి ముఖ్యమైన పుణ్య క్షేత్రా లలో ఒకటి. సప్తమోక్షదాయక పట్టణాలలో ఒకటి. శైవులు హరద్వారం అనీ, వైష్ణవులు హరిద్వారం అని పిలుచుకునే ఈ క్షేత్రం అమృతత్వం నిండిన ప్రదేశంగా చెప్తారు. క్షీర సాగర మధనం తర్వాత దేవదానవులు అమృత భాండం కోసం పెను గులాడుతున్నప్పుడు ఆ అమృతం నాలుగుప్రదేశాలలో పడిందట. ఆ నాలుగు ప్రాంతాలలో ఒకటి ఈ హరిద్వార్. అందుకే ఈ క్షేత్రం పరమ పవిత్రమైనదిగా చెప్తారు.
పన్నెండేళ్ల కొకసారి అంగరంగ వైభవంగా అత్యంత శోభా యమానంగా జరిగే కుంభమేళా ఇక్కడేజరుగుతుంది. చార్ ధాం గా పిలుచుకునే బదరీ, కేదార్, గంగోత్రి, యమునోత్రిలకు ఇక్కడినుంచే వందలాదిమంది భక్తులు బస్సులలో బయలుదేరతారు.
సముద్ర మట్టానికి సుమారు వెయ్యి అడుగుల ఎత్తున ఉన్న ఈ క్షేత్రం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సుందర నగరంగా ప్రసిద్ది చెందింది. ఇన్ని విశిష్టతలు కలిగిన హరిద్వార్ లో దర్శించాల్సిన విశేషాలు కూడా ఎక్కువే.

హరికీపైర్

 హరిద్వార్ లో ప్రసిద్ధి చెందిన స్నాన ఘట్టం ఇది. ఇక్కడ స్నానం చేస్తే సర్వపాపాలనుండి విముక్తులవు తారని ఆస్తికుల నమ్మకం. ఇక్కడే శంకరాచార్యులవారు శిష్యులకు ఉపదేశం చేస్తున్నట్లున్న స్థూపం, గంగా మాత ఆలయం కూడా చూడవచ్చు. ఈ స్నాన ఘట్టంలో ప్రతి ఆ రోజు రాత్రి హారతి జరుగుతుంది. ఆ సమయంలో గంగమ్మతల్లి ఆలయంలోను, నదిలోను భక్తులు వెలిగించిన దీపా లతో, దీప తోరణాలతో ఆ ప్రదేశమంతా జ్వాజ్వలమానంగా వెలుగుతూ కన్నుల పండువగా ఉంటుంది. అత్యంత శోభయమానంగా ఉన్న ఆ దృశ్యాన్ని కనులారా చూడాల్సిందే తప్ప వర్ణించడానికి మాటలు చాలవు. శ్రీమహావిష్ణువు అడుగు పెట్టిన దానికి గుర్తుగా విష్ణు పాద ముద్ర ఉన్న శిలను కూడా మనం వాడవచ్చు. ఆ కారణంగానే ఇది హరికీ పైర్' అని పిలువబడుతోంది.

భరతమాత మందిరం:

విశాలమైన ఆవరణలో ఉన్న ఎనిమిది అంతస్తుల భవనమిది. భరతమాత నిలువెత్తు విగ్రహం, భారతదేశ పటం, కాళి, దుర్గ, లక్ష్మి మొదలైన వివిధ దేవతా విగ్రహాలను కూడా చూడొచ్చు. ఈ మందిరానికి మొదటి ఆశీర్వాదం ద్వారకా పీఠాధిపతులవారు ఇచ్చారట. బెంగుళూకు చెందిన ఇంజనీర్ బి.అనంతరామయ్య పర్యవేక్షణలో బరోడాకు చెందిన చెందిన నరేంద్రభాయ్ ఏక్నాద్ దీనికి రూపకల్పన చేసారు.

మానసాదేవి మందిర్:

ఎత్తైన కొండమీద ఉంది మానసాదేవి మందిరం. నాగరాజు వాసుకి సోదరి మానసాదేవి. ఈ తల్లి దర్శనం అత్యంత పుణ్యదాయమని, ఫలప్రదమని చెప్తారు. అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ ఉన్న చెట్టుకి తాళ్లు కడుతుంటారు. అలా కడుతూ తమ కోరికలు విన్నవించుకుంటే తప్పక తీరుతాయన్నది ఒక నమ్మకం. ఈ కొండమీదకి నడకదారి, రోప్ వే కూడా ఉన్నాయి. ఈ కొండమీదనుంచే గంగాతీరం, తీరంలోని ఆలయాలు అత్యంత సుందరంగా కనపడతాయి. ఇంకా ఇక్కడ చండీదేవి మందిరం, భూమా నికేతన్, దక్షేశ్వర్ మందిర్, జగద్గురు ఆశ్రమం, మహామృత్యుంజయ మందిర్ ఇలా ఎన్నో పవిత్రమైన స్థలాలన్నాయి. జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన పుణ్యక్షేత్రం హరిద్వార్.

16, జులై 2018, సోమవారం

కిరణ్ బేడీ తొలి మహిళా ఐ పి ఎస్

సంచలనంగా మారిన కిరణ్ బేడీ ట్వీట్  

Kiranbedi 1st lady IPS
కిరణ్ బేడీ తొలి మహిళా ఐ పి ఎస్
ఆదివారం రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ క్రొయేషియాపై విజయం సాధించింది. మరి సహజంగానే గెలిచిన వారికి జేజేలు పలకడం ఉన్నదే కదా. అలాగే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ కూడా ఫ్రాన్స్ జట్టుకు అభినందనలు తెలియచేసారు. ఇప్పుడదే కిరణ్ బేడీ ని ఎగతాళి పాలు చేసింది. ఫ్రాన్స్ విజయం సందర్భంగా పుదుచ్చేరియన్లం. ప్రపంచ కప్ గెలుచుకున్నాం. అభినందనలు అంటూ ట్వీట్ చేశారు కిరణ్ బేడీ. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఒకప్పుడు  ఫ్రెంచ్ భూభాగంలో ఉందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె ఫ్రాన్స్ విజయాన్ని ఈ విధంగా వర్ణించడంతో నెటిజనలు ట్రోల్స్ మొదలుపెట్టేసారు. మనం భారతీయులమని గుర్తుంచుకోండిఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు ఆపాలంటూ చురకలేస్తున్నారు.     ఇంతకీ విశేషమేమిటంటే మనదేశంలో తోలి ఐ పి ఎస్ అధికారిగా కిరణ్ బేడీ 1972 లో సరిగ్గా ఇదేరోజు అంటే జూలై 16న నియమించబడ్డారు. ఈ సందర్భంగా ఓసారి కిరణ్ బేడీ జీవిత విశేషాలు చూద్దాం....
కిరణ్ బేడి జూన్ 9, 1949వ తేదీన పంజాబ్ లోని అమృతసర్ లో జన్మించారు. 1972లో  పోలీస్ సర్వీస్ లో చేరారు. ఐపిఎస్ కేడర్ల అఫీసర్లలో ఈమే మొట్టమొదటి మహిళా ఆఫీసర్. డిసెంబర్ 2007 సంవత్సరంలో కిరణ్ బేడి డైరెక్టర్ జనరల్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవలప్ మెంట్ లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రెండు స్వచ్ఛంద సేవా సంస్ధలను ప్రారంభించారు. ప్రభుత్వ సేవలకుగాను 1994 లో ఈమెకు రామన్ మెగసేసే అవార్డు లభించింది. టెన్నిస్ ఆటలో అద్భుత ప్రావీణ్యం ఉన్న కిరణ్ బేడీ 22 సంవత్సరాల వయసుకే అనేక జాతీయ స్ధాయి అవార్డులు గెలుచుకున్నారు. 1972 వ సంవత్సరంలో కిరణ్ బేడి బ్రిజ్ బేడి అనే పారిశ్రామిక వేత్తను మతాంతరం వివాహం చేసుకున్నారు. ఐపిఎస్ ఆఫీసర్ గా అనేక సాహసోపేతమైన నిర్ణయాలతో సుభాష్ అనిపించుకున్నారు. మత్తు మందుల నియంత్రణ వంటి విషయాల్లో చాలా సాహసోపేతంగా ముందుకు దూకారు. అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కిరణ్ బేడి ఒక ప్రధాన సభ్యురాలు. కిరణ్ బేడి జీవితంపై ఆస్ట్రేలియా చలన చిత్ర నిర్మాత మేగన్ డోనేమన్ ఒక చిత్రాన్ని కూడా నిర్మించారు.

puri temple history | జగన్నాథ - 12


పూరీ జగన్నాథ క్షేత్ర చరిత్ర 

puri temple history - 12
puri temple history

అసంపూర విగ్రహాల వెనుక ఉన్న కారణం :

పూరీ క్షేత్రంలో దేవతామూర్తులు అసంపూర్ణమైన అవయవాలతో మనకు దర్శనమిస్తారు. ఇలా ఎందుకంటే దానికొక పురాణ కథనాన్ని చెప్పారు. ఇంద్రద్యుమ్నుడు తనకు జగన్నాధుడు కలలో కనబడి చెప్పిన ప్రకారం సముద్రంలో దొరికిన కొయ్యదుంగలను సేకరించి విగ్రహాలను చేయించడానికి శిల్పుల కోసం అన్వేషణ ప్రారంభించాడు. కాని విగ్రహాలను తయారుచేసేందుకు తగిన శిల్పులు ఎవరూ లభించలేదు. రాజు ఈ విధమైన అన్వేషణలో  ఉన్న సమయంలోనే విశ్వకర్మ ఒక వృద్ధశిల్పి రూపంలో వచ్చి
తాను విగ్రహాలను తయారుచేస్తానన్నాడు. అయితే తనకు కావలసిన సంభారాలను, ఒక ప్రత్యేకమైన గదిని ఇవ్వాలని, తాను విగ్రహాలను తయారుచేస్తున్నంకాతలం తన పరిసర ప్రాంతాలకు ఎవరూ రాకూడదని, తనను గాని తాను తయారుచేస్తున్న విగ్రహాలను గాని ఎవ్వరూ చూడడానికి ప్రయత్నించకూడదని షరతులను విధించాడు. షరతులకు ఒప్పుకొని అతడికి కావలసినవన్నీ సమకూర్చాడు రాజు. ఆ శిల్పి కోయ్యదుంగలతో సహా తనకు కేటాయించిన మందిరంలోనికి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. ఇలా కాలం గడుస్తూనే ఉంది. మూసుకున్న తలుపులు మూసుకున్నట్టే ఉన్నాయి. లోపల నుంచి విగ్రహాలు తయారవుతున్నదానికి సంకేతంగా ఒక ఉలిదేబ్బగాని, ఎలాంటి శబ్దం గాని వినరావడంలేదు. కొంతకాలానికి రాణికి సందేహం వచ్చింది.శిల్పి ఉన్న గదిలోనుంచి ఎటువంటి శబ్దాలు రావడంలేదు. అసలు విగ్రహాలు తయారవుతున్నాయా... లేదా ..? ఆ శిల్పి లోపలేం చేస్తున్నాడు? అసలు గదిలోపల ఆ శిల్పి ఉన్నాడా లేదా? ఇలా అనేక సందేహాలతో సతమతమవుతున్న రాణి తన అనుమానాన్ని రాజు ముందు పెట్టింది. అక్కడితో ఆగకుండా ఒక్కసారి తలుపులు తెరిచి చూద్డామని కూడా చెప్పింది. ఆమె యొక్క ప్రోద్బలంతో శిల్పి ఉన్న భవంతి తలుపులను బలవంతంగా తెరిపించాడు రాజు. వీరు మాట తప్పి అలా చేయడంతో శిల్పి మాయమయిపోయాడు. మొండి చేతులతో సగం సగం తయారయిన విగ్రహాలు మాత్రం కనబడ్డాయి. జరిగిన సంఘటనతో తమ తప్పు తెలుసుకొని చాలా బాధపడ్డారు ఇంద్రద్నుమ్నుడు, అతని రాణి. అప్పుడు జగన్నాథుడు అదృశ్యంగా వారిని ఊరడించి.. “జరిగినదానికి బాధపడవద్దు! ఆ అసంపూర్ణ విగ్రహాలనే ప్రతిష్టించి పూజించండి!అని చెప్పాడట. అదీ అసంపూర్ణ విగ్రహాల వెనుక ఉన్న కథ. 

 క్షేత్రవైశిష్ట్యం:

అయోధ్య, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతికా, పూరీ, ద్వారావతీశ్చైవ సప్తైతే మోక్షదాయికామోక్షాన్నిచ్చే సప్త పట్టణాలలో ఇది కూడా ఒకటి. చార్ ధామ్ లలో ఒకటి ఈ క్షేత్రం. ఈ క్షేత్రంలో బలభద్రుడు రుగ్వేదస్వరూపుడని, జగన్నాధుడు సామవేదస్వరూపుడని, సుభద్ర యజుర్వేద స్వరూపిణి అని సుదర్శనుడు అధర్వణ వేదస్వరూపుడని వ్యాసులవారు చెప్పినట్టు పురాణోక్తి. శ్రీమహావిష్ణువు రామేశ్వరంలో స్నానసంధ్యాదులు గావించి బదరీనాద్ లో అల్పాహారం చేసి.. పూరీ క్షేత్రంలో భోజనం చేసి రాత్రి విశ్రాంతి కోసం ద్వారకానగరానికి
చేరుకుంటాడట. పూరీలో స్వామి భోజనం చేస్తాడు కాబట్టే ఇక్కడ - అన్నప్రసాదానికి అంత ప్రాధాన్యత, పురుషోత్తముడైన శ్రీమహావిష్ణువు జగన్నాథుడిగా కొలువుతీరిన క్షేత్రం కాబట్టి పురుషోత్తమక్షేత్రమని పిలుస్తారు. స్వామి జగన్నాథునిగా పిలువబడడానికి కూడా ఒక కారణాన్ని చెప్తారు. సంస్కృత పదాలయిన జగత్ అంటే సమస్త విశ్వం, నాథ్ అంటే పతి. జగత్తుకు నాధుడయినవాడు కాబట్టి ఇక్కడి స్వామిని జగన్నాధుడుగా కొలుచుకోవడం జరుగుతుంది. జగత్తుకు నాధుడయిన జగన్నాధుడు కొలువుతీరిన క్షేత్రం కాబట్టి జగన్నాధమని, శంఖు ఆకారంలో ఉంటుంది కాబట్టి శంఖు క్షేత్రమని, నీలాచల కొండలలో ఉన్నది కాబట్టి నీలాద్రి అని కూడా పిలుస్తారు. తొమ్మిది ద్వారాల పురమే దేహమని, ఆ దేహాన్నే క్షేత్రం అంటారు కాబట్టి, ఈ క్షేత్రాన్ని పురి అన్న పేరుతో పురాణాలు వర్ణించాయి. కాల క్రమేణా పూరీగా వ్యవహారంలోకి వచ్చినట్టు పెద్దలు చెప్తుంటారు. ఈ క్షేత్రం మహత్యాన్ని వినడం వల్లనే నూరు కపిలగోవులను దానం చేసిన ఫలం, గంగా పుష్కరజల స్నానఫలం, ఆయుష్షు, సర్వపాపక్షయం, మోక్షం సిద్ధిస్తాయని పురాణ ఉవాచ. ఈ క్షేత్రమహత్మ్యం ని ఎంతటిదంటే ఒక నిశ్వాస కాలం ఉంటే చాలు అశ్వమేధయాగఫలం లభిస్తుందని చెప్తారు. ఈ క్షేత్రంలో మరణించినవారి మీద యముడి అధిపత్యం ఉండదట. అంటే యమబాధలుండవు. ఈ క్షేత్రంలో సోదర, సోదరీ సహిత జగన్నాధుని సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే వైశాఖ శుక్ల అష్టమీ, గురువారం, పుష్యమీ నక్షత్రం ఉన్న సమయంలో ప్రతిష్టించాడని పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని నృసింహ యంత్రంతో, మంత్రంతో చేస్తాడని, అందుకే ఇది ప్రధానంగా నారసింహక్షేత్రమని - పురాణాలు చెప్తున్నాయి. ఈ క్షేత్రానికి శివుడు క్షేత్రపాలకుడు. ఎనిమిది లింగమూర్తులుగా వివిధ దిశలలో నెలకొన్ని ఉన్నాడు.
ఇంకా ఉంది ........

రామప్ప టెంపుల్...ఓ చారిత్రక వైభవం | కాకతీయుల కళావైభవం

రామప్ప టెంపుల్...ఓ చారిత్రక వైభవం

Ramappa temple a historical glory
రామప్ప టెంపుల్ ... ఓ చారిత్రక వైభవం 
800 సంవత్సరాల చరిత్ర ఆ టెంపుల్ ది. కళల కాణాచి ఆ ఆలయం. కాల ప్రవాహంలో ఎన్నో ఎదురుదాడులు. ఎన్నో యుద్ధాలు, ఇంకెన్నో దాడులు, మరెన్నో ప్రకృతి వైపరీత్యాలు అన్నిటినీ తట్టుకొని ఠీవిగా నాటి రాజసానికి, సంస్కృతీ సంప్రాదాయలకు ప్రతీకగా సజీవంగా నిలబడింది ఆ గుడి. ఆలయమంతా ఎన్నో అద్బుతాలు. ఒకప్పటి కాకతీయ రాజుల క‌ళా వైభవాన్ని ఆధునికులకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. తెలంగాణ ప్రాంత చారిత్రక కీర్తిని ప్రపంచానికి చాటుతోంది. ఓ వైపున చారిత్రక నేపథ్యం ... మరో వైపున ఆధ్యాత్మిక వైభవం....ఇంకోవైపు కాకతీయుల కళావైభవానికి గీటురాయి అన్నీ కలగలిసిన అరుదైన పుణ్య క్షేత్రం. తెలంగాణ లోని వరంగల్ జిల్లాలో రామప్ప టెంపుల్.

అద్భుతాలకు నిలయం రామప్ప టెంపుల్

రామప్ప దేవాలయం ఎన్నో విశిష్టతలకు, మరెన్నో అద్భుతాలకు నిలయం. రామప్ప దేవాలయంగా పిలుస్తున్నా నిజానికిది శివాలయం. స్థానికులు దీనిని రామలింగేశ్వర ఆలయంగా పిలుచుకుంటారు. సాధారణంగా గుడిలో అయినా ప్రధాన దైవం పేరుతొ ఆ ఆలయాన్ని పిలుస్తారు. కాని ఇక్కడ దానికి పూర్తీ భిన్నంగా జరుగుతుంది. ఆలయంలోని దైవం పేరుమీద కాకుండా ఆలయ నిర్మాణం సాగించిన ప్రధాన శిల్పి రామప్ప పేరుమీద రామప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.  శివ,కేశవ అబేధానికి కూడా ఉదాహరణ ఈ ఆలయం. విష్ణుమూర్తి అవతారమైన రాముడు, శివుడు ఇద్దరి పేరుమీద రామలింగేశ్వరాలయం గా ప్రసిద్ధి చెందింది. 

శతాబ్దాలనాటి కళావైభవాన్ని కళ్ళకు కట్టే టెంపుల్

రామప్ప దేవాలయం కాకతీయుల కళావైభవానికి ప్రతీక. ఆనాటి శిల్పకళను అద్భుతంగా చూపించే  వేదిక రామప్ప దేవాలయం. నక్షత్రం ఆకారంలో ఉన్న ఎత్తైన పీఠంమీద కొలువుతీరి ఉంటుంది గుడి. దీనిని 'రామప్ప' అనే శిల్పి తన శిష్య బృందంతో కలిసి 40 సంవత్సరాల పాటు శ్రమించి శిల్పకళా శోభితంగా మలిచాడు. ఆలయంలోని ప్రతి రాయి ఒక సజీవశిల్పంగా కనిపిస్తుంది. పురాణ గాధలతో పాటు చెక్కబడిన అప్సరసలు ... గంధర్వ కన్యలు ... నాగకన్యల ప్రతిమలు అపురూప సౌందర్యానికి, ఆ శిల్పుల శిల్పకళా నైపుణ్యానికి మచ్చుతునకగా కనబడతాయి. తూర్పు ముఖద్వారం నుంచి లోనికి వెళ్లి ఆలయదర్శనం ఎలా చేయాలో చూపేవిధంగా ఆలయం చుట్టూ ఏనుగుల విగ్రహాలు మనతో కలిసి వస్తున్నట్లు వివిధ భంగిమల్లో అద్భుతంగా కఅమర్చబడ్డాయి. నల్లరాతి స్తంభాలపై మలిచిన గోపికా వస్ర్తాపహరణం, క్షీరసాగరమధనం, శివపార్వతుల కళ్యాణం, దక్షయజ్ఞం, తారకాసుర సంహారం వంటి పురాణగాథలు, పేరిణి శివతాండవం దృశ్యాలు ఆనాటి శిల్పకళా వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు కనబడతాయి.
         దీనిని కూడా చూడండి - బుధ నీలకంఠ మందిరం 
పాలంపేటలో కొలువుతీరిన రామప్పటెంపుల్ చారిత్రిక నేపధ్యం చూద్దాం.
ఈ ప్రాంతం కాకతీయుల పాలనాలో ఓ వెలుగు వెలిగింది. వారి పరిపాలన సామర్ధ్యానికి, శిల్పకళపై వారికున్న అభిరుచికి.. ఆసక్తికి నిదర్శనమే ఈ ప్రాంతం అంటారు చరిత్రకారులు. నిజానికి ఈ ప్రాంతాన్ని అప్పట్లో అప్పలంపేట అని పిలిచేవారట. అదే కాలక్రమంలో పాలంపెటగా మారిందని చెప్తారు. కాకతీయ గణపతిదేవ చక్రవర్త్తి సర్వ సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. దాంట్లో భాగంగానే ఈ అప్పలంపేటలో ఆలయాన్ని, ఒక పెద్ద చెరువును నిర్మించాడట. ఆలయానికి.. చెరువుకు తన పేరు ఉండేట్లు రుద్రేశ్వరాలయం.. రుద్ర సముద్రం అని పేరు పెట్టాడట. అయితే ఆ పేర్లు కేవలం శాసనాలకే పరిమితమయిపోయి, మహాశిల్పి రామప్ప పేరుమీదుగా రామప్పగుడి.. రామప్ప చెరువుగా మారిపోయాయి.

ఎంతోమందికి ప్రేరణ రామప్ప టెంపుల్

ఆలయం ఎంతోమందికి ప్రేరణగా నిలిచిందని చెప్పాలి. ఆలయం మధ్యలో ఒక రంగమంటపం ఉంది. కాకతీయుల కాలంలో ఇక్కడ శివుని ముందు నాట్యప్రదర్శన జరిగేదట. మండపానికి నాలుగువైపులా పెద్దపెద్ద నల్లని స్తంభాలుంటాయి. వాటిమీద అందమైన, అద్భుతమైన నల్లరాతి శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఈ శిల్పాల చెక్కడం వెనుక ఒక కథనం ఉంది. గణపతిదేవ చక్రవర్తి బావమరిది అయిన జాయపసేనాని నృత్యానికి సంబంధించి రచించిన నృత్యరత్నావళి గ్రంధం ఆధారంగా చెక్కారని, ఆనాటి పేరిణి శివతాండవ నృత్యానికి చెందిన నృత్య భంగిమలని చెప్తారు.  ఆ కాలంలో సైనికులు యుద్ధానికి వెళుతున్నపుడు వారిని ఉత్తేజపరచడం కోసం కాకతీయులు ఆ నృత్యాన్ని ప్రదర్శించేవారట. ఆ నృత్య రీతులన్నీ ఇక్కడి స్తంభాలమీద మనం చూడొచ్చు. కీ||శే||శ్రీ నటరాజ రామకృష్ణగారు ఈ రామప్ప గుడిలోని నాట్య భంగిమల మీదే దాదాపు మూడు సంవత్సరాలు అక్కడే ఉండి పరిశోధన చేసి శతాబ్దాల క్రితం మరుగున పడిపోయిన అప్పటి పేరిణి శివతాండవ నాట్యాన్ని పునరుద్ధరించి, ఆ విషయం మీద ఓ పుస్తకం రచించి, 1985లో తన శిష్యుల చేత పేరిణి శివతాండవ నృత్యాన్ని ప్రదర్శించారట. అప్పుడా ప్రదర్శన చూడ్డానికి ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారట. ఇంకో విశేషమేమిటంటే మంచిమనసులు చిత్రంలో ఓ అద్భుత గీతం ఈ నల్లని రాళ్ళలో అనే పాటను సి నారాయణరెడ్డి గారు ఈ శిల్పాలు చూసి ఆ ఇన్స్పిరేషన్ తోనే రాశారని కూడా చెప్తారు.
         ఇక్కడ మరో విశేషం ఆలయం ముందు కొలువైన నంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి ఉంచి, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా ? ఎప్పుడు ముందుకురుకుదామా అన్నట్టుగా కనబడుతుంది. ఆ నందికి ముందు భాగంలో ఎటువైపు నుంచి చూసినా అది మన వైపే చూస్తున్నట్లు ఉంటుంది. గర్భగుడికి ఎదురుగా వున్న మండపంలోని స్థంబాలమీద నాట్యం చేస్తున్న అందమైన స్త్రీమూర్తుల శిల్పాలు చూసేవాళ్ళకు కనువిందు చేస్తాయి. గుడి మెట్ల దగ్గర నుంచి మొదలుకొని పై కప్పు వరకు ప్రతి చోట ఎన్నో శిల్పాలు. కాకతీయుల ప్రత్యేక శిల్పశైలికి ఇది మచ్చుతునకగా చెప్తారు.
        రామప్ప దేవాలయాన్ని కేవలం ఆధ్యాత్మిక కోణంలో మాత్రమే చూడటం కాదు ఇది ఒక వైజ్ఞానిక దర్శనం అంటారు పరిశోధకులు. రామప్ప దేవాలయం ఓ విజ్ఞాన భాండాగారం. కేవలం శిల్పకళ గురించే కాదు. నాట్యం గురించి, వాయిద్యాల గురించి, ఆ కాలపు ఆహార్యం గురించి తెలుసుకోవాలంటే ఈ ఆలయానికి వెళ్లాల్సిందే అంటారు.
రామప్ప దేవాలయాన్ని సందర్శించేవారికి సమీపంలోని రామప్ప సరస్సులో బోటు షికారు చేయటం అందమైన, మరుపురాని అనుభవం.
       క్రీస్తు శకం 1213 లో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయ రాజు రుద్రదేవుడి హయంలో ప్రారంభమైన గుడి నిర్మాణం గణపతి దేవ చక్రవర్తి కాలంలో పూర్తయిందట. వారి తరఫున రేచర్ల రామయ్య అనే సామంత రాజు ఈ దేవాలయాన్ని కట్టించినట్టుగా శాసనాలు చెప్తున్నాయి.  ఆలయ నిర్మాణం పూర్తైన తర్వాత సుమారు 100 ఏళ్లపాటు ఈ దేవాలయం ఓ వెలుగు వెలిగిందని, ఆ తరువాత తన ప్రాభవాన్ని కోల్పోయి క్రీస్తుశకం 1910 వరకూ ఈ ఆలయంలో దీపారాధన కూడా జరగలేదని చరిత్ర చెప్తోంది. ఆ తరువాత మళ్ళీ 1911లో అప్పటి నిజాం ప్రభుత్వం రామప్ప ఆలయ విశిష్టతను గుర్తించి తిరిగి రామప్ప దేవాలయాన్ని పునరుద్ధరించిందట.
       పచ్చటి ప్రకృతి మధ్య సువిశాలమైన ప్రాంతంలో సాండ్‌ స్టోన్‌ తో నిర్మించిన అపురూప కట్టడం ఈ రామప్ప దేవాలయం. ఈ దేవాలయాన్ని ముఖ్యంగా ఆలయ గోపురాన్ని అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మించారట. ఈ ఇటుకలు నీళ్లలో వేస్తే తేలుతాయి. కొంత మంది ఇక్కుడున్న నీళ్ళపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు. అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది పర్యాటకుల్ని తన వైపు ఆకర్షించుకుంటున్నఈ దేవాలయం సినిమా వాళ్లకి ఓ వరం అని చెప్పాలి. ఇక్కడున్న అందమైన పరిసరాలు సినిమా వాళ్లకి ఓ విందుభోజనమే. అందుకే చాలా తెలుగు సినిమాల్లో రామప్ప ఆలయం అందాలు చోటుచేసుకుంటాయి.
ప్రతి సంవత్సరం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునే వారి సంఖ్య ఎక్కువగానే వుంటుంది.

ఎలా వెళ్ళాలి ...

సరే ఇంత చారిత్రక ప్రాభవాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న అద్భుత ఆలయం రామప్ప గుడికి ఎలా వెళ్ళాలో చూద్దాం.....
తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదుకి 157 కిలోమీటర్ల దూరంలోను కాకతీయుల రాజధాని వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది పాలంపేట గ్రామం. ఆ పాలంపేటలోనే ఉంది స్థానిక ప్రజలు గుళ్ల తీర్థంగా పిలుచుకునే రామప్ప దేవాలయం. హన్మకొండ లేదా వరంగల్ చేరుకొని, అక్కడి నుండి బస్సులలో పాలంపేట వెళ్లి అక్కడి నుండి ఆటోలో రామప్ప దేవాలయం చేరుకోవచ్చు.