Monday, July 16, 2018

puri temple history | జగన్నాథ - 12


పూరీ జగన్నాథ క్షేత్ర చరిత్ర 

puri temple history - 12
puri temple history

అసంపూర విగ్రహాల వెనుక ఉన్న కారణం :

పూరీ క్షేత్రంలో దేవతామూర్తులు అసంపూర్ణమైన అవయవాలతో మనకు దర్శనమిస్తారు. ఇలా ఎందుకంటే దానికొక పురాణ కథనాన్ని చెప్పారు.
ఇంద్రద్యుమ్నుడు తనకు జగన్నాధుడు కలలో కనబడి చెప్పిన ప్రకారం సముద్రంలో దొరికిన కొయ్యదుంగలను సేకరించి విగ్రహాలను చేయించడానికి శిల్పుల కోసం అన్వేషణ ప్రారంభించాడు. కాని విగ్రహాలను తయారుచేసేందుకు తగిన శిల్పులు ఎవరూ లభించలేదు. రాజు ఈ విధమైన అన్వేషణలో  ఉన్న సమయంలోనే విశ్వకర్మ ఒక వృద్ధశిల్పి రూపంలో వచ్చి
తాను విగ్రహాలను తయారుచేస్తానన్నాడు. అయితే తనకు కావలసిన సంభారాలను, ఒక ప్రత్యేకమైన గదిని ఇవ్వాలని, తాను విగ్రహాలను తయారుచేస్తున్నంకాతలం తన పరిసర ప్రాంతాలకు ఎవరూ రాకూడదని, తనను గాని తాను తయారుచేస్తున్న విగ్రహాలను గాని ఎవ్వరూ చూడడానికి ప్రయత్నించకూడదని షరతులను విధించాడు. షరతులకు ఒప్పుకొని అతడికి కావలసినవన్నీ సమకూర్చాడు రాజు. ఆ శిల్పి కోయ్యదుంగలతో సహా తనకు కేటాయించిన మందిరంలోనికి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. ఇలా కాలం గడుస్తూనే ఉంది. మూసుకున్న తలుపులు మూసుకున్నట్టే ఉన్నాయి. లోపల నుంచి విగ్రహాలు తయారవుతున్నదానికి సంకేతంగా ఒక ఉలిదేబ్బగాని, ఎలాంటి శబ్దం గాని వినరావడంలేదు. కొంతకాలానికి రాణికి సందేహం వచ్చింది.శిల్పి ఉన్న గదిలోనుంచి ఎటువంటి శబ్దాలు రావడంలేదు. అసలు విగ్రహాలు తయారవుతున్నాయా... లేదా ..? ఆ శిల్పి లోపలేం చేస్తున్నాడు? అసలు గదిలోపల ఆ శిల్పి ఉన్నాడా లేదా? ఇలా అనేక సందేహాలతో సతమతమవుతున్న రాణి తన అనుమానాన్ని రాజు ముందు పెట్టింది. అక్కడితో ఆగకుండా ఒక్కసారి తలుపులు తెరిచి చూద్డామని కూడా చెప్పింది. ఆమె యొక్క ప్రోద్బలంతో శిల్పి ఉన్న భవంతి తలుపులను బలవంతంగా తెరిపించాడు రాజు. వీరు మాట తప్పి అలా చేయడంతో శిల్పి మాయమయిపోయాడు. మొండి చేతులతో సగం సగం తయారయిన విగ్రహాలు మాత్రం కనబడ్డాయి. జరిగిన సంఘటనతో తమ తప్పు తెలుసుకొని చాలా బాధపడ్డారు ఇంద్రద్నుమ్నుడు, అతని రాణి. అప్పుడు జగన్నాథుడు అదృశ్యంగా వారిని ఊరడించి.. “జరిగినదానికి బాధపడవద్దు! ఆ అసంపూర్ణ విగ్రహాలనే ప్రతిష్టించి పూజించండి!అని చెప్పాడట. అదీ అసంపూర్ణ విగ్రహాల వెనుక ఉన్న కథ. 

 క్షేత్రవైశిష్ట్యం:

అయోధ్య, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతికా, పూరీ, ద్వారావతీశ్చైవ సప్తైతే మోక్షదాయికామోక్షాన్నిచ్చే సప్త పట్టణాలలో ఇది కూడా ఒకటి. చార్ ధామ్ లలో ఒకటి ఈ క్షేత్రం. ఈ క్షేత్రంలో బలభద్రుడు రుగ్వేదస్వరూపుడని, జగన్నాధుడు సామవేదస్వరూపుడని, సుభద్ర యజుర్వేద స్వరూపిణి అని సుదర్శనుడు అధర్వణ వేదస్వరూపుడని వ్యాసులవారు చెప్పినట్టు పురాణోక్తి. శ్రీమహావిష్ణువు రామేశ్వరంలో స్నానసంధ్యాదులు గావించి బదరీనాద్ లో అల్పాహారం చేసి.. పూరీ క్షేత్రంలో భోజనం చేసి రాత్రి విశ్రాంతి కోసం ద్వారకానగరానికి
చేరుకుంటాడట. పూరీలో స్వామి భోజనం చేస్తాడు కాబట్టే ఇక్కడ - అన్నప్రసాదానికి అంత ప్రాధాన్యత, పురుషోత్తముడైన శ్రీమహావిష్ణువు జగన్నాథుడిగా కొలువుతీరిన క్షేత్రం కాబట్టి పురుషోత్తమక్షేత్రమని పిలుస్తారు. స్వామి జగన్నాథునిగా పిలువబడడానికి కూడా ఒక కారణాన్ని చెప్తారు. సంస్కృత పదాలయిన జగత్ అంటే సమస్త విశ్వం, నాథ్ అంటే పతి. జగత్తుకు నాధుడయినవాడు కాబట్టి ఇక్కడి స్వామిని జగన్నాధుడుగా కొలుచుకోవడం జరుగుతుంది. జగత్తుకు నాధుడయిన జగన్నాధుడు కొలువుతీరిన క్షేత్రం కాబట్టి జగన్నాధమని, శంఖు ఆకారంలో ఉంటుంది కాబట్టి శంఖు క్షేత్రమని, నీలాచల కొండలలో ఉన్నది కాబట్టి నీలాద్రి అని కూడా పిలుస్తారు. తొమ్మిది ద్వారాల పురమే దేహమని, ఆ దేహాన్నే క్షేత్రం అంటారు కాబట్టి, ఈ క్షేత్రాన్ని పురి అన్న పేరుతో పురాణాలు వర్ణించాయి. కాల క్రమేణా పూరీగా వ్యవహారంలోకి వచ్చినట్టు పెద్దలు చెప్తుంటారు. ఈ క్షేత్రం మహత్యాన్ని వినడం వల్లనే నూరు కపిలగోవులను దానం చేసిన ఫలం, గంగా పుష్కరజల స్నానఫలం, ఆయుష్షు, సర్వపాపక్షయం, మోక్షం సిద్ధిస్తాయని పురాణ ఉవాచ. ఈ క్షేత్రమహత్మ్యం ని ఎంతటిదంటే ఒక నిశ్వాస కాలం ఉంటే చాలు అశ్వమేధయాగఫలం లభిస్తుందని చెప్తారు. ఈ క్షేత్రంలో మరణించినవారి మీద యముడి అధిపత్యం ఉండదట. అంటే యమబాధలుండవు. ఈ క్షేత్రంలో సోదర, సోదరీ సహిత జగన్నాధుని సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే వైశాఖ శుక్ల అష్టమీ, గురువారం, పుష్యమీ నక్షత్రం ఉన్న సమయంలో ప్రతిష్టించాడని పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని నృసింహ యంత్రంతో, మంత్రంతో చేస్తాడని, అందుకే ఇది ప్రధానంగా నారసింహక్షేత్రమని - పురాణాలు చెప్తున్నాయి. ఈ క్షేత్రానికి శివుడు క్షేత్రపాలకుడు. ఎనిమిది లింగమూర్తులుగా వివిధ దిశలలో నెలకొన్ని ఉన్నాడు.
ఇంకా ఉంది ........

No comments:

Post a Comment