10, జులై 2018, మంగళవారం

జై జగన్నాథ - 8 | puri temple history

ఇంద్రద్యుమ్నుడు జగన్నాధుని దర్శనం కోసం బయలుదేరడం


puri temple story
ఇంద్రద్యుమ్నుని వినయ, విధేయతలకు, అతడి భక్తిప్రపత్తులకు సంతసించిన నారదుడు అతడి ప్రయత్నాలను కొనియాడు. రాజుతో పాటు జగన్నాథ క్షేత్ర సందర్శనానికి బయలుదేరాడు. అలా ఇంద్రద్యుమ్నుడు వెంటనే సపరివారంగా
జగన్నాధుని దర్శనార్ధం బయలుదేరాడు.
ఇన్నాళ్లకు తన భాగ్యం పండిందని ఆనందిస్తూ పురుషోత్తమ క్షేత్రంలో నీలమణిరూపంలో వెలసిన జగన్నాథుని దర్శించాలని హుటాహుటిన బయలుదేరాడు. దారి పొడవునా నారదుడు విష్ణుభక్తి గూర్చి, శ్రీమన్నారాయణుని భక్తుల కథనాల గురించి వివరిస్తూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. అయితే ఇంద్రద్యుమ్నుడు ఎంత ఆత్రంగా అక్కడికి చేరుకున్నాడో అంత ఆశాభంగం చెందాడు. సరిగ్గా నీలమాధవుని దర్శనం కోసం వెళ్లేసరికి ఇతడికి దర్శనం ఇవ్వకుండానే అంతర్షితుడైపోయాడు నీలమాధవుడు. జరిగిన దానికి హతాశుడయ్యాడు  ఇంద్రద్యుమ్నుడు.
    అయ్యో! స్వామిని దర్శించే యోగ్యత, అర్హత తనకు లేవు. కాబోలు.. అందుకే ఆ పరమాత్ముడు తనకు దర్శనమివ్వడానికి నిరాకరించి అంతర్షితుడయ్యాడు. తనెంత దురదృష్టవంతుడు” పరిపరివిధాల అనుకుంటూ పరితపించిపోయాడు ఇంద్రద్యుమ్నుడు.
    ఇదంతా స్వామి యొక్క లీలా విలాసమని, బ్రహ్మ వంశంలో ఐదవవానిగా జన్మించిన నీవు ఇలా బేలగా మారడం తగదని నారదుడు ఎంతగా నచ్చచెప్పినా ఇంద్రద్యుమ్నుడు మాత్రం ఊరడిల్లలేకపోయాడు.
" మహర్షీ నేనేదో పాపం చేశాను. అందుకే ఇలా జరిగింది. కాని నాకు తెలిసి  నేను ఇతరులకు ఎన్నడూ అపకారం తల పెట్టలేదు. భక్తిమార్గం విడిచి పెట్టలేదు. చేయరాని కార్యాలు చేయలేదు. చేయవలసిన ధర్మకార్యాలు నిర్వర్తిస్తూనే ఉన్నాను. ధర్మమార్గం నుండి వైదొలగలేదు. పూజ్యులను అగౌరవపరచలేదు. పెద్దలు, పూజ్యుల మార్గాన్నే అనుసరిస్తూ వచ్చాను. అయినప్పటికీ నా జన్మజన్మల పాపమేదో ఇంకా నన్ను వదలలేదు కాబోలు. అందుకే జగన్నాథుడు నాకు దర్శనాన్నివ్వడానికి నిరాకరించాడు. ఇక నాకు మరణమే శరణ్యం. అందుకే నా తదనంతరం నా కుమారుని రాజుగా ప్రకటించి అతనికి రాజ్యమును అప్పగిస్తున్నాను. అందరూ నా మాటలకు ఎంత గౌరవమిచ్చి నర్తించారో అదేవిధంగా నా కుమారునికి కూడా సహకరించండి” అంటూ అప్పగింతలు పెట్టాడు.
      
puri temple history
నారదాదులు అతడిని శాంతపరిచే ప్రయత్నంలో ఎన్నో విధాలుగా నచ్చచెప్పారు. భగవంతుని దర్శనం అంత సులభంగా దొరికేది కాదని, ఇదంతా పరీక్షగా భావించి ఓపికగా ఎదురు చూడవలసి ఉంటుందని, కాబట్టి నిరాశపడవద్దని ఎన్నో విధాల అతనికి చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇంద్రద్యుమ్నుడు తన దుఃఖం నుంచి బయటపడలేకపోయాడు. ఇంత ప్రయత్నించి కూడా స్వామి దర్శనాన్ని పొందలేకపోయాడంటే ఇక తన జన్మ వృథా అనుకున్నాడు. స్వామి అనుగ్రహాన్ని పొందలేకపోయిన తరువాత ఇక ఈ తనువెందుకనుకున్నాడు. ఆ శ్రీమన్నారాయణుని కృప లేని ఈ ప్రాణం ఇంకా నిలుపుకోవలసిన అవసరం లేదనుకున్నాడు. అందుకే జగన్నాథుని దర్శనం పొందలేకపోయిన తన దౌర్భాగ్యానికి బాధపడి ప్రాయోపవేశం చేయడానికి సంకల్పించాడు ..................

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి