Sunday, August 5, 2018

puri jagannath temple history | పూరీలో దర్శించాల్సిన స్థలాలు


జమేశ్వర్ టెంపుల్

జగన్నాధ మందిరానికి దక్షిణంగా కిలోమీటరు దూరంలో ఉంది. జమేశ్వర్ ఆలయం లేదా పరమేశ్వరుని మందిరం. ఇది యమధర్మరాజుచే ప్రతిష్టించబడినదిగా పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడి స్వామి యమబంధాలను తొలగించేవాడు కాబట్టి యమేశ్వరునిగా ప్రసిద్ది చెందాడు. యమేశ్వరుడే స్థానికులచేత జమేశ్వరుడుగా కొలువబడుతున్నాడు. ఇక్కడి స్వామి యమేశ్వరుడుగా పేరు పొందడానికి కారణం... ఒకసారి ఈ పూరీ క్షేత్రంలో తపస్సులో మునిగి ఉన్న శివుని ధ్యానభంగం చేయడానికి ప్రయత్నించాడట యముడు. దాంతో ఆగ్రహించిన ఈశ్వరుడు యుద్ధంలో యముడ్ని ఓటమిపాలు చేసి అతనికి బుద్ధి చెప్పాడని అప్పటి నుంచి ఈ స్వామి యమేశ్వరునిగా ప్రసిద్ది చెందాడని పురాణ కథనాలు చెప్తున్నాయి. స్థానికంగా యముడ్ని జముడు అని పిలుస్తారు కాబట్టి ఇది జమేశ్వరాలయంగా ప్రసిద్ధిచెందింది. ఇది పంచపాండవ ఆలయంగా కూడా చెప్తారు. ఇలా పంచపాండవాలయంగా చెప్పడానికి ఒక పురాణ కథనం కూడా ప్రచారంలో ఉంది. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఒకసారి పూరీ క్షేత్రాన్ని దర్శించుకొని తమ అజ్ఞాతవాసం సఫలీకృతమవ్వాలని భగవంతుని ప్రార్థించారట. వారి క్షేత్ర దర్శనానికి గుర్తుగా అయిదు శివాలయాలు నిర్మించబడినట్లు అవే పంచపాండవ ఆలయాలుగా ప్రసిద్ది చెందినట్లు చెప్తారు. ఆ పంచపాండవ ఆలయాలే లోకనాధ ఆలయం, జమేశ్వర ఆలయం, కపాలమోచన ఆలయం, మార్కండేశ్వర ఆలయం, నీలకంఠేశ్వర ఆలయాలు.

బేడీ ఆంజనేయుడు:

పూరీలో చూడవలసిన ప్రదేశాలలో బేడీ ఆంజనేయుని ఆలయం ఒకటి. దీనినే దరియా మహావీర్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఆంజనేయస్వామి కాళ్లకు సంకెళ్లతో మనకు దర్శనమిస్తాడు. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పురాణ కథనాన్ని... అది కూడా త్రేతాయుగం నాటి కథనాన్ని చెప్తారు. పూరీ క్షేత్రానికి తరచు సముద్రుని కారణంగా విపత్తు ఏర్పడుతూ ఉండేదట. నయనపథగామి జగన్నాథుని దర్శించాలన్న తపనతో సముద్రుడు ఉప్పొంగి ఉరకలేసేవాడు. జలాల విజృంభణకు పూరీక్షేత్రం పూర్తిగా మునిగిపోయేది. ఈ కారణంగా పూరీలో ఉన్న ప్రజలు ఎన్నో ఇక్కట్లకు గురవ్వాల్సి వచ్చేది. దాంతో ఈ విపత్తు నుంచి  ఎలాగైనా బయటపడాలని భావించిన పూరీక్షేత్రంలో పండితులు కొందరు శ్రీరామచంద్రుని దగ్గరకు వెళ్లి తమకు ఎదురవుతున్న కష్టాన్ని వివరించి, ఆ కష్టం నుండి తమను గట్టెక్కించమని కోరుకున్నారు. వీరి మొరాలకించిన శ్రీరామచంద్రుడు సముద్రుని పిలిచి ఇకమీదట పూరీవాసులకు ఎలాంటి కష్టం కలిగించడానికి వీలులేదనీ గట్టిగా చెప్పాడు. శ్రీరాముని మాటకు సరేనన్న సముద్రుడు కొంతకాలానికి తన సహజ ప్రవృత్తి ప్రకారం పూరీని ముంచెత్తాడు. దాంతో మళ్లీ శ్రీరామునితో మొర పెట్టుకున్నారు పూరీ ప్రజలు. ఇక లాభం లేదని ఆంజనేయుని పిలిచి, పూరీక్షేత్రానికి వెళ్లి సముద్రునికి బుద్ది చెప్పి, వారి కష్టాన్ని గట్టెక్కించి, పూరీ వాసులను రక్షించేవిధంగా కాపలాగా ఉండమని చెప్పి పంపించాడు శ్రీరాముడు. తన ప్రభువు చెప్పిన విధంగా పూరీ వెళ్లి రామాజ్ఞను పాటిస్తూ ఉన్నాడు. అయితే ఆంజనేయుడు పూరీ పండితులు పెట్టే చప్పిడి భోజనం తినలేకపోయాడట. ఆంజనేయునికి అసలే లడ్డూలంటే అత్యంత ప్రీతి. అయోధ్యలో ఉండగా అతడు భుజించిన లడ్డూలు అతడికి నోరూరిస్తూ ఉండేవి. దాంతో రాత్రివేళల్లో అయోధ్యకు వెళ్లి తనకిష్టమైన లడ్డూలను తినివస్తూ ఉండేవాడట. ఇలా ఆంజనేయుడు రాత్రివేళల్లో పహరాలేకుండా అయోధ్య వెళ్లిపోతున్నాడని తెలుసుకున్న సముద్రుడు ఒకనాటి రాత్రివేళ పూరీని ముంచెత్తాడు. మళ్లీ మళ్లీ భోరుమంటూ శ్రీరాముని ముందు చేరారు పూరీవాసులు. అంజనేయుడు వంటి అరివీరభయంకరుడు కాపలా ఉన్నాకూడా ఇలా ఎందుకు జరిగిందో ఆరా తీసాడు శ్రీరామచంద్రుడు. ఆంజనేయుడు రాత్రివేళల్లో పూరీలో ఉండకుండా అయోధ్యకు చేరుకోవడం వలన, ఆంజనేయుడు లేని సమయంలో ఇలా జరిగిందన్న విషయాన్ని తెలుసుకొని ఆంజనేయుని రప్పించి ఇకమీదట ఇలా చేయవద్దంటూ హెచ్చరించి ఆంజనేయుడి కాళ్లను గొలుసులతో బంధించి పూరీలోనే ఉండమని ఆజ్ఞాపించాడట. అప్పటి నుంచి ఆంజనేయుడు పూరీని వదిలి పెట్టకుండా ఉన్నాడని, ఆంజనేయుని తృప్తిపరచడానికి పూరీవాసులు కూడా లడ్డూలను ఆంజనేయునికి సమర్పిస్తూండేవారని ఒక కథనం. ఈ కారణంగానే ఆంజనేయుడు కాళ్లకు సంకెళ్లతో పూరీ సముద్రతీరంలో మనకు దర్శనమిస్తాడు.

No comments:

Post a Comment