Monday, July 2, 2018

జై జగన్నాథ 2 | పురీ జగన్నాథ క్షేత్రం

లక్ష్మీదేవి యమునికి చెప్పిన మార్కండేయ ముని కథనం 

 ప్రళయంలో మార్కండేయ మహర్షి 

 
puri jagannath temple (జై జగన్నాథ)
 మార్కండేయ మహర్షి ఆరు మన్వంతరాలు కఠోరమైన తపస్సు చేశాడు. ఏడో మన్వంతరం గడుస్తోంది. మహర్షి తపస్సు కొనసాగుతూనే ఉంది. ఎక్కడ కఠినమైన తపస్సు కొనసాగుతుంటుందో దానిని చెడగొట్టే ప్రయత్నంలో ముందుండే ఇంద్రుని కథనాలు మనపురాణాలలో ఎన్నో వింటుంటాం. ఇక్కడ కూడా అదే జరిగింది.ఏడో మన్వంతరంలో మహర్షి తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు ఇంద్రుడు. ఆ ప్రయత్నంలో భాగంగా అప్సరసలను పంపాడు ఇంద్రుడు. అప్సరసలు మహర్షి సరసన చేరారు. ఆటలాడారు, పాటలు పాడారు. తమ హొయలు చూపారు. మహర్షిని ఆకర్షించడానికి సర్వశక్తులు ఒడ్డారు. ఎన్నో విధాలుగా మహర్షిని దారి మళ్ళించడానికి ప్రయత్నించారు. అంతమాత్రానికే చలిస్తే అతడు మార్కండేయుడెందుకవుతాడు? అప్సరసలు ఎన్ని ఆగడాలు చేసినా మార్కండేయుడు చలించలేదు. వారి ప్రయత్నాలన్నీ వమ్మయిపోయాయి. మహర్షి తపస్సును మాత్రం భగ్నం చేయలేకపోయారు. ఇంద్రుడు చేసిన ఈ పని మార్కండేయునికి అదృష్టాన్నే కలిగించింది. మార్కండేయుని నిశ్చలతకు ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు.
              "ఓ మహర్షీ నీ నిశ్చలమైన తపోదీక్ష నాకు ఎంతో సంతసాన్ని కలిగించింది. ఫలితంగా నీకు ఏదేని వరం ఇవ్వదలిచాను కోరుకో" అన్నాడు.
              దుర్లభమైన శ్రీమన్నారాయణుని దర్శనంతో పులకించిపోయిన మార్కండేయుడు స్వామిముందు మోకరిల్లి పరిపరి విధాల స్తుతించాడు. క్లిష్టమైన స్వామి దర్శనంతో పాటు వరం కూడా ఇస్తాననడంతో ఆనంద పరవశుడైన మార్కండేయుడు, "స్వామీ నీ మాయను తెలుసుకోవడం సామాన్య మానవులకు, దేవతలకే కాదు బ్రహ్మ రుద్రాదులకు సైతం సాధ్యం కాదని చెప్తారు. అటువంటి నీ మాయను చూడాలని ఉంది" అన్నాడు.
             "తధాస్తు" అని వరమిచ్చి అంతర్దానమైపోయాడు శ్రీమన్నారాయణుడు. కాలం తన పని చేస్తూ సాగిపోతూనే ఉంది. మార్కండేయ మహర్షి కోరిక, వరం సిద్ధించే సమయం ఆసన్నమయింది.
               
puri jagannath temple (జై జగన్నాథ క్షేత్రం)
 అది ప్రయకాలం. ఆ ప్రళయకాలంలో ప్రచండమైన వాయువు వీచడం మొదలైంది. ఆకాశం చిల్లులు పడినట్టు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. మహాసముద్రాలన్నీ ఉప్పొంగాయి. జగత్తంతయు జలమయమైపోయింది. యావత్  ప్రపంచం  ఆ జలములలో మునిగి లుప్తమైపోయింది. సృష్టంతా ఆ జలంలో లయమైపోయింది. ఎక్కడా భూమన్నది కానరాని పరిస్థితి. పరమేశ్వరుని కృపచే దీర్ఘాయుష్షు పొంది, ఏడు కల్పముల కాలం ఆయు:ప్రమాణమున్న మార్కండేయ మహర్షి కూడా జలములలో మునిగిపోయాడు. ఆ సమయంలో మార్కండేయ మహర్షి కూడా మొహావేశానికి లోనయ్యాడు.జరుగుతున్న భీభత్సానికి తట్టుకోలేని స్థితిలో పడిపోయాడు. దిక్కుతోచని స్థితిలో నివడానికి భూమంటూ కానరాక అయోమయావస్థలో జలములలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ స్థితిలోనే ఈ పురుషోత్తమ క్షేత్రం ఉన్న ప్రాంతంలో నిశ్చలంగా వున్న ఒక మహా వృక్షాన్ని చూశాడు. అది ఒక వటవృక్షం. సృష్టంతా లుప్తమైపొయి, సర్వ జగత్తు జలమయమైపోయి ఏకార్నవంగా, మహాసముద్రంగా మారిన ఆ స్థితిలో కూడా సమున్నతంగా నిలిచి ఉన్న ఆ వృక్షరాజాన్ని చూసి ఆశ్చర్యంబుధిలో మునిగిపోయాడు మార్కండేయుడు. జగమంతా జలమయమైన ఆ పరిస్థితిలో అసలా వటవృక్షం ఎలా నిలచివుందో అతడికర్ధం కాలేదు. "ఇదేమి మాయ! ఇదంతా భగవానుని మర్మమేనా?" అతడా అయోమయ స్థితిలో ఉండగానే.......
"ఓ మహర్షీ ఆందోళన చెందకు. ఆ వటవృక్ష ఛాయకు రా" అన్న మృదుమధురమైన పిలుపు వినబడింది.

puri jagannath temple (జై జగన్నాథ క్షేత్రం)
మిగిలినది తరవాతి పోస్ట్ లో........
           

No comments:

Post a Comment