Tuesday, July 3, 2018

జై జగన్నాథ - 3 | పూరీ జగన్నాథ క్షేత్రం

లక్ష్మీదేవి పూరీ జగన్నాథ క్షేత్రం మహత్యాన్ని
మార్కండేయునికి చెప్పడం 

jai jagannath | puri jagannath temple
ఆదరపూరితమైన ఆ స్వరం వచ్చిన దిశగా చూశాడు మార్కండేయుడు. కొన్ని యోజనాల పర్యంతం విస్తరించి సమున్నతంగా, సుస్థిరంగా వున్న ఆ విశాల వృక్షరాజంపై వటపత్రంపై చిరునగవుతో తన కాలి బొటనవ్రేలిని చీకుతూ, ముద్దులొలికే మోముతో, ప్రశాంతమైన వదనంతో అద్భుత ఆకర్షణతో అలరారుతున్న బాలుడు కనబడ్డాడు. మహర్షి అలా సంభ్రమాశ్చర్యాలలో మునిగి వుండగానే బాలరూపంలో వున్న వటపత్రశాయి అయిన స్వామి ఆ వటవృక్ష ఛాయకు రమ్మని పిలిచాడు. ఆశ్చర్యానందాలతో నాగస్వరం విన్న నాగులా, మంత్రముగ్దునిలా ఆ బాలుని చెంతకు చేరాడు మార్కండేయుడు. తనను పిలిచినా ఆ బాలుడు మరెవరో కాదు... సాక్షాత్తూ శ్రీమన్నారాయణునిగా గుర్తించాడు తపశ్శక్తి సంపన్నుడైన మహర్షి. స్వయంగా ఆ శ్రీమన్నారాయణుడే తనను చేరబిలవడంతో మహర్షి ఆలన్డానికి అంతం లేకుండా పోయింది. స్వామి సన్నిధికి చేరుకున్నాడు. 
                    "ఓ మహానుభావా ఈ అఖండ జలరాశి మధ్యలో, సర్వసృష్టి లయమైపోయిన స్థితిలో కూడా ఈ వటవృక్షం ఎలా నిలిచి వుంది? ఏమిటీ మాయ?" అంటూ ప్రశ్నించాడు.
                   మార్కండేయ మహర్షి యందు దయతో అతడికి తనను గురించి తెలుసుకునే అవకాశం కల్పించాడు శ్రీమన్నారాయణుడు. అలా స్వామి అనుగ్రహంతో స్వామి నోటిలోకి ప్రవేశించాడు మార్కండేయుడు. అలా స్వామి గర్భంలోకి ప్రవేశించిన మార్కండేయునికి కనులు మిరుమిట్లు గొలిపాయి. శ్రీ మన్నారాయణుని ఉదరం అంటే సర్వ విశ్వానికి నిలయమే కదా! అక్కడ లేనిదేముంటుంది! శ్రీమహావిష్ణువు గర్భంలో భూభారాన్ని తన శిరస్సులతో మోస్తున్న సహస్రశీర్షుడు ఆదిశేషువు దర్శనమిచ్చాడు. బ్రహ్మరుద్రాది సమస్త దేవతలు కనుపించారు. సకల సురాసుర, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వులను, మానవులను, దానవులను,సకల జంతుజాలాలను, నాగులు, గరుడ పక్షులు మొదలైన ప్రాణులను, పాతాళలోకం, సువర్లోకం మొదలైన సర్వలోకాలను, గ్రామాలు, పట్టణాలు, జనపదాలు, కొండలు, కోనలు, సముద్రాలు, నదులు, పర్వతాలు, వృక్షాలు,లోయలు, మొదలైన ప్రదేశాలు, నారద, తుంబురాది దేవగాయకులు, ఇంద్రాది సర్వదేవతలు, దేవతాస్త్రీలు, అప్సరస్త్రీలు, తన ఆశ్రమం, ఆశ్రమంలో తపోదీక్షలో ఉన్న తానూ, ఇంకా ఇప్పుడు తానున్న వటవృక్షంతో సహా..... ఒకటేమిటి! ప్రళయంలో లయించబడిన సకలసృష్టిని అక్కడ చూశాడు మార్కండేయుడు. ఆ కుక్షిలో ఎంత తిరుగుతున్నా ఏదో ఒక లోకం, ఏదో ఒక అద్భుతం కనబడుతూనే ఉంది. ఎంత తిరిగినా దానికి అంతనేది అతడికి కానరాలేదు. దాని చివరనేది కనబడనేలేదు. అంతేకాదు......అంతటి ప్రళయంలో కూడా, జగత్తంతా జలమయమయినా....పురుషోత్తమ క్షేత్రం, వటవృక్షం మాత్రం నిశ్చలంగా నిలిచి ఉండడాన్ని గుర్తించాడు మార్కండేయుడు. ఆ వటవృక్షం ఉన్న ప్రాంతమే నేటి జగన్నాథక్షేత్రం..........................

1 comment:

  1. <a href="http://www.aardelyrics.com/2016/09/dillaku-dillaku-song-lyrics-from-racha.html/”>check out The Edublogger</a>

    ReplyDelete