Wednesday, July 4, 2018

జై జగన్నాథ - 4 | పూరి జగన్నాథ క్షేత్రం

పురుషోత్తమక్షేత్రంగా పిలుచుకునే జగన్నాథ క్షేత్రాన్ని
 మార్కండేయ మహర్షి  దర్శించడం 

                         
puri jagannath temple
ఆ అద్భుతాన్ని చూసిన  మార్కండేయుడు బయటకు వచ్చి స్వామిని పరిపరి విధాల స్తుతించాడు. "స్వామీ నీ మాయను తెలుసుకోవడం ఆ విధాతకయినా తరం కాదంటారు. ఇక నాలాంటివానికి ఎలా సాధ్యమవుతుంది?జల ప్రళయంలో నాశనమొందిన సమస్త సృష్టిని నీ కుక్షిలో నేను చూసాను. ఓ జగదాధారా! శ్రీమన్నారాయణ! జగన్నాటక సూత్రధారీ! అనాధరక్షకా! ఆపద్బాంధవా! నిన్ను స్తుతించడానికి కూడా శక్తి చాలనివాడను, అల్పప్రాణిని. నాయందు దయ ఉంచి నన్ను ఉద్ధరించు. నీవు నన్ను చేరబిలిచే వరకు అగాధమయిన జలములలో  పడి జల, వాయు బాధతో పీడించబడి అలమటించిపోయాను. ఈ మృత్యుభయం నుంచి నన్ను కాపాడు" అంటూ ప్రార్ధించాడు.
                  మార్కండేయుని ప్రార్ధనలకు సంతసించిన శ్రీమన్నారాయణుడు మహర్షి మీద తన కరుణామృతాన్ని కురిపించాడు. "ఓ మహర్షీ నీ తపశ్శక్తిచేత ఇప్పటికి నీవు చిరాయువును మాత్రం పొందగలిగావు. కాని ఇప్పుడు చిరంజీవిగా మారే సమయం ఆసన్నమయింది. ఇక్కడే ఈ వటవృక్షానికి ఆగ్నేయమూలన నా చక్రముచే ఒక కుండమును ఏర్పాటు చేసి నీకు ప్రసాదిస్తాను. అందులో ఉండి నీవు నా స్వరూపమే అయిన ఈశ్వరుని ధ్యానించు. అప్పుడే నీవు మృత్యుంజయుడవవుతావు." అంటూ ఒక కుండమును ఏర్పాటు చేసి ఇచ్చాడు. స్వామి ఆనతిచ్చిన విధంగా ఆ కుండంలో నివసిస్తూ పరమేశ్వరుని గురించి తపస్సు చేసిన మార్కండేయుడు చిరంజీవిత్వాన్ని పొందాడు. ఆ కుండమే మార్కండేయ కుండంగా ప్రసిద్హి చెందింది. అంతటి మహిమాన్వితమైనది ఈ స్థలం. అందుకనే ఈ స్థల మహాత్మ్యం, స్వామి కరుణ రెండు కలసి జనులకు మోక్షద్వారాలు సులభంగా తెరుచుకుంటున్నాయి. ఈ క్షేత్రంలో స్వామిచే సృజించబడిన రుద్రుడు అష్టరూపాలతో కపాలమోచనుడు, క్షేత్రపాలుడు, యమేశ్వరుడు, మార్కండేశ్వరుడు, ఈశానుడు, బిల్వేశుడు, నీలకంటుడు, వటేశుడు అన్న నామాలతో ఎనిమిది దిక్కులలో పరివేష్టితుడై క్షేత్రపాలకునిగా ఉన్నాడు. అదేవిధంగా నాచే సృజించబడిన ఎనిమిది శక్తులు కూడా మంగళ, విమల, సర్వమంగళ, అర్దాశిని, లంబ, కాళరాత్రి, మరీచిక, చండరూప అనే పేర్లతో క్షేత్రం చుట్టూ పరివేష్టితమై ఉన్నాయి" అంటూ లక్ష్మీదేవి యమునికి ఆ క్షేత్ర మహిమను తెలియచేసింది.
         
అలా యమునికి పురుషోత్తమ క్షేత్ర మహిమను తెలుపుతున్నప్పుడే విష్ణు ప్రేరితుడైన బ్రహ్మ కూడా అక్కడికి చేరుకున్నాడు. అలా అక్కడ ఉన్న బ్రహ్మదేవుడికి "ఓ చతుర్భుజా! కొంతకాలానికి అవంతీపురాన్ని పరిపాలించే ఇంద్రద్యుమ్నుడనే రాజు ఇక్కడికి చేరుకొని స్వామి దర్శనం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాడు. ఇక్కడ ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తాడు. ఆ మహారాజుకు అన్నివిధాల నీవు నీ సహాయ సహకారాలనందించు. అతని ప్రయత్నంతో మా యొక్క దారుమూర్తులు విశ్వకర్మచే తయారుచేయబడతాయి. వాటిని ఒక సుముహూర్తంలో నీవు ప్రతిష్ట చేయు" అని చెప్పింది లక్ష్మీదేవి. అలా లక్ష్మీదేవి ద్వారా పురుషోత్తమక్షేత్ర మహాత్మ్యాన్ని విన్నటువంటి యముడు, బ్రహ్మ ఇద్దరూ స్వామికి జేజేలు పలుకుతూ తమ తమ స్థావరాలకు చేరుకున్నారు.

             ఇంద్రద్యుమ్నుని కథ 

        సత్యయుగంలో సూర్యవంశంలో జన్మించి, అవంతీపురం రాజధానిగా మాళవ దేశాన్ని పరిపాలిస్తున్న ఇంద్రద్యుమ్నుడు విష్ణుభక్తుడు. నిరంతరం శ్రీమన్నారాయణుని ధ్యానంలోనే ఉంటూ రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఇంద్రద్యుమ్నుడు సర్వవిద్యాపారంగతుడు. సౌమ్యుడు. సకల కళావల్లభుడు. కళారాధకుడు. పెద్దవారిని ఉచితరీతిన గౌరవిస్తూ, పిన్నలను తగినరీతిన ఆదర్స్తూ, ఆపన్నులను ఆదుకుంటూ, న్యాయబద్ధంగా, ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు.జన్మతః వచ్చిన సంస్కారంతో వీలున్నంతవరకు విష్ణుభక్తుల సన్నిధిలో, విష్ణు సంబంధ కథనాలు వింటూ ఆదర్శవంతమైన జీవనాన్ని గడుపుతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో ఒకరోజు పండితులతో, విశ్నుభక్తులతో కూడి సభలో ఉన్నపుడు ఇంద్రద్యుమ్నుడు ఎప్పటినుంచో తన మనస్సులో ఉన్న కోరికను వారిముందు బయటపెట్టాడు..................... 

No comments:

Post a Comment