Thursday, July 5, 2018

జై జగన్నాథ - 5 | జగన్నాథ చరిత్ర

ఇంద్రద్యుమ్నుడు జగన్నాధుని చూడాలన్న
తన కోరికను పండుతుల ముందు పెట్టడం 

puri jagannath history
"పండితులారా! మానవుడిగా జన్మించిన వారికి ఎంతో సాధన చేస్తే, మరెంతో పుణ్యఫలం తోడైతే తప్ప మానవదేహంతో, చర్మచక్షువులతో భగవంతుని దర్శించడం సాధ్యంకాదని పెద్దలు చెప్తారు. అయితే ఎలాగైనా ఈ కనులతో భగవంతుని దర్శించాలన్నదే నా తపన. అలా ఆ స్వామిని దర్శించగలిగే ప్రదేశం ఈ లోకంలో ఎక్కడైనా ఉందా? మీరు పండితులు. ఎన్నో తీర్థాలను, క్షేత్రాలను దర్శించిన మహానుభావులు...పుణ్యాత్ములు. మీకు తెలియని విషయాలు లేవు. ఆ జగన్నాధుని ఈ మానవ కనులతో వీక్షించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ తీర్ధంలో సేవించాలి? మీ దివ్యద్రుష్టికి అందనిదంటూ ఉండదు. కాబట్టి నా కోరిక తీరే మార్గం సెలవివ్వండి" అంటూ ప్రార్ధించాడు.
      రాజు ప్రశ్నకు అందరూ ముఖాముఖాలు చూసుకుంటున్న తరుణంలో, అప్పుడక్కడ ఒక వృద్ధ పండితుడు "మహారాజా! ఈ సృష్టిలో మానవదేహంతో, చర్మచక్షువులతో జగన్నాధుని దర్శించాలంటే దానికి తగిన క్షేత్రం ఒకే ఒక్కటుంది. అదే ఓడ్రదేశంలోని పురుషోత్తమక్షేత్రం. అది పరమ పవిత్రమైన క్షేత్రం. ఆ దేవదేవుడు సశరీరంగా దర్శనమిచ్చే తీర్ధరాజం. నీలాచల పర్వతాల సమీపంలో ఉందా ప్రాంతం. దట్టమైన అరణ్యం గుండా లోనికి వెళితే అక్కడ నీలాచల పర్వత సమీపంలోనే రౌహిణుమనే కుండం ఉంటుంది. ఆ కుండం అత్యంత పవిత్రమైన జలంతో కూడి ఉంటుంది. ఆ జలంలో స్నానం చేస్తే ఎంతటి పాపమయినా ప్రక్షాళనమయిపోతుంది. అంతటి పుణ్యజలమది. అక్కడినుంచి సన్నటి కాలిబాటగుండా వెళితే అక్కడ ఒక విష్ణ్వాలయం ఉంటుంది. అక్కడ నీలమణి రూపంలో జగన్నాధుడు వెలిసి సకల శుభాలను ఇస్తున్నాడు. సకల దేవతలు ప్రతిరాత్రి అక్కడకు వచ్చి స్వామిని ప్రత్యక్షంగా సేవించి వెళతారు. అక్కడకు వెళ్లి స్వామిని సేవిస్తే నీ కోరిక తీరుతుంది" అని చెప్పి అకస్మాత్తుగా అంతర్ధానమైపోయాడు. ఇన్ని వివరాలు చెప్పిన మహానుభావుడు అలా అకస్మాత్తుగా అంతర్ధానమయిపోవడంతో, తనకు మార్గదర్శకం చేయగలవారేవరా.... అని విచారించిన ఇంద్రద్యుమ్నుడు తన సమస్యను రాజపురోహితుని ముందుంచాడు.
        "ఓ పురోహితవర్యా!నా తపనకు సమాధానం దొరికినట్టే దొరికి మాయమయింది. దేవతలాగా వచ్చి స్వామి ప్రత్యక్షంగా, సశరీరంగా దర్శించగల స్థలాన్ని మాత్రం చెప్పిన ఆ మహానుభావుడు అంతలోనే మాయమయిపోయాడు. కాని ఇప్పుడా స్థలాన్ని ఎలా చేరుకోవాలో.....అక్కడ స్వామి ఎక్కడ, ఎలా దర్శనమిస్తాడో మాత్రం చెప్పలేదు ఆ విషయంలో నాకు దారి చూపగాలవారెవరు...?" అంటూ ప్రశ్నించాడు.
      దానికి సమాధానంగా పురోహితుడు "మహారాజా! చింతించవలసిన పనిలేదు. ఇటువంటి సమయంలో మనకు సహాయపడగలవాడు విద్యాపతి ఒక్కడే. ఆ విద్యాపతి నా చిన్నతమ్ముడే. విద్యాపతి ఎన్నో ప్రదేశాలను తిరుగుతూ, నిరంతరం వివిధ క్షేత్రాలను సందర్శిస్తూ ఉంటాడు. అతడి సాయంతో ఆ జగన్నాధుడుండే తావును కనుగొనవచ్చు. నేను ఇప్పుడే విద్యాపతిని రప్పించే ప్రయత్నం చేస్తాను" అని చెప్పి రాజును ఊరడించాడు.     
     
puri jagannath history
అనుకున్న ప్రకారం విద్యాపతిని రప్పించి అతనికి తమ ఆలోచన చెప్పి పయనానికి సంసిద్ధుడను చేసాఋ. రాజు తలచుకుంటే ఇక కానిదేముంటుంది! ప్రయాణమునకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి ఒక సుముహూర్తమున జగన్నాధుడుండే తావును కనుగొని రమ్మని రాజపురోహిర్తుని తమ్ముడు విద్యాపతిని పంపించారు. విద్యాపతి కూడా ఎంతో సంతోషంగా ఈ పనికి పూనుకున్నాడు. ఆ పనికి నియోగింపబడడం తన పూర్వజన్మ పుణ్యఫలితంగా భావించాడు విద్యాపతి. ఇటువంటి కార్య నిర్వహణకు అవకాశం రావడంతో తన జన్మ ధన్యమయినట్లేనని సంతసించాడు. ఈ విధంగానైనా జగన్నాధుని దర్శనభాగ్యం తనకు కలుగుతుందని భావించి అత్యంత ఉత్సాహంతో బయలుదేరాడు. .....................

No comments:

Post a Comment