Saturday, July 7, 2018

జై జగన్నాథ - 6 | puri temple history

జగన్నాధుని కోసం విద్యాపతి వెతుకులాట,

శబరనాయకుడు విశ్వావసును కోలుసుకోవడం  

   
puri temple history
రాజు తలచుకోవాలే కాని కానిదేముంటుంది? అందులోను చక్రవర్తి! మహారాజు చేసిన ఏర్పాట్లతో సౌకర్యవంతంగా ప్రయాణం ప్రారంభించి, వాయువేగంతో పయనించిన విద్యాపతి అలా వెళ్లి, వెళ్లి నీలాచల పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. ఎంత ఉత్సాహంతో బయలుదేరాడో అంత  నిరాశ ఎదురయిందక్కడ. ఆ దట్టమయిన అటవీప్రాంతంలో నీలమాధవుడుండే తావేక్కడో అనుకుంటూ వెతుకులాటలో పడ్డాడు.
అయితే జగన్నాధుడుండే తావును మాత్రం కనుగొనలేకపోయాడు. ఎన్నో ప్రయత్నాలు చేసాడు. అయినా నీలమాధవుడుండే తావును మాత్రం కనుక్కోలేకపోయాడు. చివరకు చేసేదిలేక తనకు మార్గదర్శకం చేసి, తనను కరుణించి దర్శనభాగ్యం ప్రసాదించమని, తన కార్యం నిర్విఘ్నంగా గట్టెక్కేలా అనుగ్రహించమని ఆ సర్వేశ్వరుడిని వేడుకుంటూ అక్కడే నిద్రకుపక్రమించాడు. అలా అక్కడ విశ్రమించిన సమయంలోనే ఎక్కడినుండో శ్రావ్యంగా జగన్నాధుని కీర్తిస్తూన్న పలుకులు చెవిన పడ్డాయి. అత్యంత మధురంగా, రమణీయంగా వినవస్తున్న ఆ భవత్సంకీర్తనకు ఒక్కసారిగా ఇహలోకంలోకి వచ్చాడు. విద్యాపతి.
     "ఆహా! ఎంత మధురంగా ఉన్నాయా మాటలు. అవునుమరి! ఆ శ్రీమన్నారాయణుడు.... నీలమాధవునికి సంబంధించిన పలుకులు కదా! అందుకే అంత మధురంగా ఉన్నాయి. ఇంత మధురమయిన వాక్కులు ఎక్కడి నించి వినవస్తున్నాయో కదా!" అనుకుంటూ, ఒక్క ఉదుటున లేచి వడివడిగా ఆ ధ్వని వినవచ్చిన వైపుగా నడుస్తూపోయాడు. ఆ మార్గం తిన్నగా శబరదీపకమనే గిరి ప్రాంతానికి చేర్చిందతనిని. అక్కడ అపర వైష్ణవుడికి ప్రతీకగా ఉన్న ఒక వ్యక్తిని చూశాడు. అతడు శబరుల నాయకుడు విశ్వావసు. తన ప్రజలతో కూడి స్వామిని కీర్తిస్తూ ఉన్నాడు.  తనువెల్లా విష్ణుభక్తితో తొణకిసలాడుతున్న అతడిని చూడగానే విద్యాపతికి అర్ధమయిపోయింది.... తనకు విష్ణుదర్శనం చేయించగలవాడితడేనని, తన కార్యం ఇతని వల్లనే సానుకూలమవుతుందని, భగవంతుని వేడుకున్నందుకు ఆ స్వామి తనకు మార్గదర్శకుడ్ని చూపించాడని సంతసించి, తన ఉనికిని తెలియచేస్తూ వారి మధ్యకు వెళ్ళాడు విద్యాపతి. తనను తాను పరిచయం చేసుకున్నాడు. అలా అకస్మాత్తుగా తమ మధ్యకు వచ్చిన ఆ బ్రాహ్మణ యువకుడ్ని చూసి, ఆ విష్ణుమూర్తే తమ మధ్యకు వచ్చాడన్నంత సంతసంతో అతడికి అతిధి సత్కారాలు చేయ సంకల్పించాడు శబర నాయకుడు విశ్వావసు. కాని విద్యాపతి అతనిని వారించి చెప్పాడు.....
     
puri temple history
"ఓ మహానుభావా! నీవు చూపిస్తున్న ఈ ఆదరానికి కృతజ్ఞతలు. కాని అతిధి సత్కారాల కంటే ముందు నీవు నాకు చేయవలసిన సహాయమొకటుంది. అది చేస్తే సంతోషిస్తాను" అన్నాడు.
      "తప్పకుండా .... నేను మీకు సహాయపడతాను. మీ కార్యాన్ని సానుకూల పరిచేందుకు నాకు చేతనయినంత వరకు నా వంతు సహాయం చేస్తాను. మీకు ఎలాంటి సహాయం కావాలో సెలవివ్వండి." అన్నాడు శబర నాయకుడు విశ్వావసు. దాంతో తను వచ్చిన పని బయటపెట్టాడు విద్యాపతి.
     " నే ఇచ్చటకు కార్యార్ధినై వచ్చాను. నీలమాధవుడుగా వెలసియున్న విష్ణువును దర్శించి స్వామి ఉండే తావు కనుగొని రమ్మని ఇంద్రద్యుమ్న మహారాజు పంపగా ఇక్కడకు వచ్చాను. తమరిని చూస్తె స్వామిని దర్శనం చేయించగలవారు మీరేనని అనిపిస్తోంది. కావున నీలమాధవుని ఆచూకీ చెప్పి స్వామి దర్శనం చేయించండి." అని కోరాడు.
          విద్యాపతి మాటలతో విశ్వావసు ఒక్కసార్గా కళవళపడ్డాడు. "ఇదేమి విపరీతం!" అనుకుంటూ ఆందోళన చెందాడు. "శ్రీమన్నారాయణ! ఇదేమి పరీక్ష..?" అన్న ఆలోచనలో పడిపోయాడు. తన పూర్వీకుల నుండి వినవస్తున్న ఒకమాట అప్రయత్నంగా అతని మదిలో మెదిలింది. రహస్యంగా తమకు మాత్రమే తెలిసి, తమ పూజలందుకుంటూ ఉన్న జగన్నాధుడు కొంతకాలానికి సార్వజనీనుడు అవుతాడని, ఎప్పుడైతే ఇంద్రద్యుమ్నుడనే రాజు స్వామిని వెతుక్కుంటూ వస్తాడో అప్పుడే స్వామి భూమిలోనికి అంతర్హితుడయిపోతాడని, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు, నారదాది మునుల సహాయంతో ఇంద్రద్యుమ్న మహారాజు ఇక్కడ జగన్నాధుని దారు విగ్రహాలు ప్రతిష్టిస్తాడని తనకు తెలిసిన కథను మననం చేసుకున్నాడు విశ్వావసు. ఆ ప్రకారమే విద్యాపతి రావడంతో ఇక నీలమాధవుడు అంతరహితుడయే సమయం ఆసన్నమయిందని గ్రహించాడు విశ్వావసు. జరగబోయేది అర్ధమయిన అతడికి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏం చేయడానికి పాలుపోక అయోమయంలో పడిపోయాడు....................

1 comment: