Sunday, July 1, 2018

జై జగన్నాథ | పూరీ జగన్నాధ క్షేత్రం

జై జగన్నాథ

పూరీ జగన్నాధ క్షేత్రం

బ్లాగు మిత్రులకు నమస్కారాలు..... శ్రీ వెంకటేశం పత్రికలో ధారావాహికగా  వచ్చిన, పూరీ జగన్నాధ క్షేత్రం విశేషాలతో కూడిన  "జై జగన్నాధ" వ్యాసం ఈ రోజు నుండి నా బ్లాగులో  మీకోసం.....


జై జగన్నాథ - 1 పూరీ జగన్నాథ క్షేత్రం  క్షేత్రం ప్రళయకాలంలో కూడా చిరస్థాయిగా నిలిచి ఉండేది. సప్త మోక్షదాయక పట్టణాలలో ఒకటి. పంచనాధ స్థలాలలో ఒకటి. పంచాద్వారకలలో ఒకటి. ముల్లోకాలలోను ఇలాంటి క్షేత్రం మరొకటి లేనేలేదని పురాణోక్తి. "మర్త్య వైకుంఠమ్" గా  కొనియాడబడే క్షేత్రం. అదే ఓడ్ర దేశంగా చెప్పబడే ఉత్కళ దేశంలో (నేటి ఒరిస్సా) బంగాళాఖాతం తీరాన వెలసిన పురుషోత్తమ క్షేత్రం. ఇది కృష్ణ భక్తులకు అతి ప్రియమైన క్షేత్రం. వదనమంతా నాయనాలేనా.... అన్నట్టు ఇంతలేసి గుండ్రని కళ్ళతో శ్రీ కృష్ణుడు నాయన పధగామిగా తన సోదరి సుభద్ర, సోదరుడు బలభద్ర సమేతంగా వెలసిన పురుషోత్తమ క్షేత్రం. జగన్నాధుడు వెలసిన క్షేత్రం కాబట్టి జగన్నాధమయింది. అంబరీషుడు, పుండరీకుడు, జైమిని, నారదుడు మొదలైన వారందరూ ఈ క్షేత్రాన్ని దర్శించుకొని తరించారని పురాణాలు చెప్తున్నాయి. స్కంద పురాణంతో పాటు మత్స్యపురాణం, విష్ణుపురాణం, పద్మపురాణం, అగ్నిపురాణం, వామన పురాణాలలోను, కపిల సంహిత, రుద్రయామళ, నీలాద్రి మహోదయ లాంటి తంత్ర గ్రంధాలలో కూడా ఈ క్షేత్ర వర్ణన కనబడుతుంది.
     పరమ గురువులు శంకరాచార్యులవారి నుండి ప్రజాకవి శ్రీశ్రీ వరకు, విహారయాత్రికుల నుండి తీర్థయాత్రికుల వరకు, స్వదేశీయుల నుండి విదేశీయుల వరకు ప్రతి ఒక్కరినీ ఆకర్షించే పుణ్యస్థలం జగత్ప్రసిద్ధమైన పూరీ క్షేత్రం. భారతదేశ అద్భుత కట్టడాలలో ప్రముఖమైనదిగా అలరారుతోందీ ఆలయం. "పురుషోత్తమ క్షేత్రం", "శంఖుక్షేత్రం", "నీలాద్రి", "దారుకావనం", ఇలా ఎవరు ఎప్పుడు ఎలా పిలిచినా స్థిరంగా జనుల నోళ్ళలో నానే పేరు మాత్రం పూరీ. ఇక్కడ కొలువు తీరిన స్వామి నామంతో పాటు క్షేత్రనామం కూడా కలగలిసి "పూరీ జగన్నాధం" గా పిలువబడుతోంది పరమ పవిత్రమైన, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యస్థలి పూరీక్షేత్రం. ఓడ్ర దేశంగా, ఉత్కళ దేశంగా పిలవబడే ప్రస్తుత ఒడిషా  రాష్ట్రంలో ఉందీ పూరీ క్షేత్రం. పురాణకాలంలో ఈ ప్రాంతాన్ని సౌర లేదా శబర అనే ఆటవిక జాతులవారు పరిపాలించినట్టు మహాభారతం చెప్తోంది. శ్రీ కృష్ణావతారం సమాప్తి కూడా ఇక్కడే జరిగిందన్నది పురాణ కథనం. ఇంత పురాణ ప్రసిద్ధమైన ప్రాంతం ఓడ్రదేశం. ఓడ్రదేశంలో మురళీధరుడు, వేణుగానలోలుడు నయన మనోహరమైన రూపంతో జగన్నాధుడు కొలువైన ప్రాంతం పూరీ క్షేత్రం.

యుగయుగాల దేవుడు జగన్నాధుడు :

జై జగన్నాథ - 1 పూరీ జగన్నాథ క్షేత్రం
జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు జగన్నాధస్వామిగా సుభద్ర, బలభద్ర సమేతుడై కృతయుగంలోనే ఇక్కడ వెలిశాడని స్కాందపురాణం చెప్తోంది. ఈ క్షేత్ర మహాత్మ్యం గురించి సాక్షాత్తూ శివుడే కుమారస్వామికి చెప్పాడు. దానిని స్కందుని ద్వారా తెలుసుకున్న జైమిని మహర్షి ఇతర మునులకు తెలియచేశాడు. వారి ద్వారా సర్వ ప్రజానీకానికి తెలియచేయబడిందని పురాణాలు చెప్తున్నాయి. జైమిని మహర్షి తెలియచేసిన స్కందపురాణాంతర్గత కథనం  ప్రకారం కృతయుగం చివరిలో ఈ ప్రాంతంలోని సముద్రతీరంలో ఇంద్రనీలమణి రూపంలో భక్తులకు దర్శనమిచ్చేవాడు జగన్నాధుడు. సామాన్య ప్రజానీకానికి కనబడని రీతిలో ఎక్కడో కొలువుతీరి ఉన్నాడు నీలమధవుడు. శబరజాతి గిరిజనులకు కులదైవంగా భాసిల్లుతూ వారిచేత పుజలందుకుంటున్నాడు. స్వామి కొలువుతీరిన చోటు సాక్షాత్తూ కలియుగ వైకుంఠమే అన్నంత ఆనందదాయకంగా ఉంది. మాధవుడు కొలువుతీరిన ప్రాంతమంతా, చివరికి అక్కడి ఇసుక కూడా సువర్ణమయ కాంతులతో విలసిల్లుతోంది. ఇక స్వామిని చుస్తే.... ధగద్ధగాయమానంగా వెలిగిపోతూ శోభాయమానంగా విరాజిల్లుతున్నాడు. ఆ మురళీమనోహరుని దర్శనం అపురూపం....అపూర్వం. జన్మజన్మల పుణ్యకృతం. ఆ వేణుగానలోలుని దర్శించుకున్న కనులదే పుణ్యమంటే. ఆ నీలమాధవుడ్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు వారి పాపాలన్నీ పటాపంచలయిపోతున్నాయి. స్వామి దర్శనమాత్రంతోనే జనుల పాపాలు ప్రక్షాళనమై వారికీ మోక్షద్వారాలు తెరుచుకుంటున్నాయి. దాంతో చుట్టుపక్కల ఉన్నవారందరూ ఆ స్వామిని దర్శించుకొని మోక్షం పొందుతున్నారు. వారి ద్వారా స్వామిని గురించి తెలుసుకున్న ఇతరులు స్వామిని వెతుక్కుంటూ వచ్చి జగన్నాధుని దర్శనమాత్రంతోనే తమ పాపాలు ప్రక్షాళన చెందడంతో ముక్తులవుతున్నారు. ఇటువంటి స్థితిలో పాపులు, యమలోకం అన్న మాటలకు అర్థం లేకుండాపోయింది. పాపపుణ్యాల లెక్కలు చూసి శిక్షలు విధించే యమునికి పని లేకుండాపోయింది. ఇది గమనించిన యముడు ఆలోచనలో పడిపోయాడు. ఎందుకిలా జరుగుతోందో యోచించిన యముడు జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్నాడు. దాంతో హుటాహుటిన బయలుదేరి శంఖుక్షేత్రం లోని స్వామిని దర్శించుకున్నాడు. తన బాధను స్వామి ముందు వెళ్ళబోసుకున్నాడు.
   "మహానుభావా! శ్రీమన్నారాయణా! సర్వజగత్తుకు ఆధారభుతుడవు. ఓ శంఖు, చక్ర, గదాధరా, జగదాధారా నీ లీలలను తెలుసుకోవడం సృష్టి రచన చేసే బ్రహ్మకైనా సాధ్యంకాదు. ఇక నాకెలా సాధ్యమవుతుంది? అందుకే నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను కటాక్షించు. సర్వదేవతలకు వారివారి కార్యకలాపాలు నిర్దేశించినవాడవు నీవే. కానీ నీవు చేసిన  ఏర్పాటుకు నీవే విఘాతం కలిగించే పరిస్థితి ఇక్కడ నెలకొల్పావు. ఇదేమి విపరీతం స్వామీ? ఎంతటి పాపాత్ములయినా మీ దర్శనమాత్రంచేతనే మోక్షం పొందుతున్నారు. పాపులకు సరియైన శిక్షలు పడే అవకాశం లేకుండా పోతోంది. ఇలా అయితే సృష్టిక్రమం దెబ్బతినదా" అంటూ విష్ణుమూర్తి ముందు మొరపెట్టుకున్నాడు యముడు.
  యముని అంతరంగం తెలుసుకున్న శ్రీమన్నారాయణుడు " ఓ ధర్మదేవతా! నీ వేదన గ్రహించాను. అయితే నీవు కూడా ఒక విషయం తెలుసుకో. ఈ క్షేత్రం లో నీ ఆధిపత్యం నీడ కూడా పడలేదు. ఇక్కడ ప్రజలమీద నీ ప్రభావం ఎంతమాత్రం ఉండదు." అని చెప్పాడు.
  దానికి ప్రతిగా యముడు మళ్ళీ తన అంతరంగంలోని ఆలోచనను విష్ణుమూర్తి ముందు పెట్టాడు. "స్వామీ! సర్వదేవతలు తమ తమ కార్యక్రమాలు నీ అనుమతితోనే, నీవు నిర్దేశించిన రీతిలోనే చేస్తున్నారు. అదేవిధంగా పాపులను గుర్తించి వారికీ తగిన దండన విధించే పనికి కూడా నీవే నన్ను నియుక్తుడ్ని చేశావు. మరి నీవు నిర్దేశించిన పనికి నీవే అంతరాయం కలిగిస్తావా? అసలు దీనియొక్క అంతరార్థమేమిటి?" అంటూ ప్రశ్నిస్తూ, పరిపరివిధాల ప్రార్ధించాడు.
   అతడి ప్రార్ధనలకు సంతసించిన చిద్విలాసుడైన విష్ణుమూర్తి లక్ష్మీదేవివైపు చూపు సారించాడు. స్వామి మనోగతాన్ని అర్ధం చేసుకున్న శ్రీదేవి ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని యమునికి వివరించడం మొదలుపెట్టింది.
    "ఓ యమధర్మరాజ! నీ మనోవేదన అర్థమయింది. అయితే ఈ స్థల మహిమ అటువంటిది. ఈ స్థలం ఎంతటి పాపాన్నయినా పటాపంచలు చేయగల మహిమాన్వితమైనది. ఇక్కడ పాపం, శిక్ష అన్న మాటలకు ఆస్కారం లేదు. ఈ ప్రదేశం అత్యంత పుణ్యప్రదమైనది.ప్రళయంలో సర్వజగత్తు జలమయమైనను, ఇంకేది కానరాకున్నప్పటికీ ఈ పురుషోత్తమ క్షేత్రం మాత్రం ఉంటుంది" అంటూ దానికి దృష్టాంతంగా విష్ణులీలను తెలుసుకున్న మార్కండేయ మహర్షి ఉదంతాన్ని తెలియచేసింది లక్ష్మీదేవి.
మిగిలినభాగం రేపటి పోస్ట్ లో ......


2 comments: