Tuesday, July 17, 2018

Haridwar temple tour | స్వర్గద్వారం హరిద్వార్


స్వర్గద్వారం హరిద్వారం

Haridwar temple tour
స్వర్గద్వారం హరిద్వార్
మాయాపురి! గంగాద్వారం! హరద్వారం! హరిద్వార్!ఎందరినో ప్రకృతి సౌందర్యాలతో మురిపించి మరెందరినో ఆధ్యాత్మిక మార్గానికి మరలించిన హిమాలయ పర్వత పాదాల వద్ద నెలకొని ఉన్న పుణ్య క్షేత్రం. పావన గంగానదీ తీరంలో కొలువైన ఈ క్షేత్రంలో తరతరాలుగా ఎంతోమంది ఋషులు ఆశ్రమాలు నిర్మించుకున్నారు. తపస్సు చేశారు. ఇప్పటికీ  మోక్ష పథగాములైనవారు తమ ధ్యానానికి, సాధనకు అనువైన చోటుగా భావించే ప్రదేశం హరిద్వార్, ఉత్తరప్రదేశ్ లోని అతి ముఖ్యమైన పుణ్య క్షేత్రా లలో ఒకటి.
సప్తమోక్షదాయక పట్టణాలలో ఒకటి. శైవులు హరద్వారం అనీ, వైష్ణవులు హరిద్వారం అని పిలుచుకునే ఈ క్షేత్రం అమృతత్వం నిండిన ప్రదేశంగా చెప్తారు. క్షీర సాగర మధనం తర్వాత దేవదానవులు అమృత భాండం కోసం పెను గులాడుతున్నప్పుడు ఆ అమృతం నాలుగుప్రదేశాలలో పడిందట. ఆ నాలుగు ప్రాంతాలలో ఒకటి ఈ హరిద్వార్. అందుకే ఈ క్షేత్రం పరమ పవిత్రమైనదిగా చెప్తారు.
పన్నెండేళ్ల కొకసారి అంగరంగ వైభవంగా అత్యంత శోభా యమానంగా జరిగే కుంభమేళా ఇక్కడేజరుగుతుంది. చార్ ధాం గా పిలుచుకునే బదరీ, కేదార్, గంగోత్రి, యమునోత్రిలకు ఇక్కడినుంచే వందలాదిమంది భక్తులు బస్సులలో బయలుదేరతారు.
సముద్ర మట్టానికి సుమారు వెయ్యి అడుగుల ఎత్తున ఉన్న ఈ క్షేత్రం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సుందర నగరంగా ప్రసిద్ది చెందింది. ఇన్ని విశిష్టతలు కలిగిన హరిద్వార్ లో దర్శించాల్సిన విశేషాలు కూడా ఎక్కువే.

హరికీపైర్

 హరిద్వార్ లో ప్రసిద్ధి చెందిన స్నాన ఘట్టం ఇది. ఇక్కడ స్నానం చేస్తే సర్వపాపాలనుండి విముక్తులవు తారని ఆస్తికుల నమ్మకం. ఇక్కడే శంకరాచార్యులవారు శిష్యులకు ఉపదేశం చేస్తున్నట్లున్న స్థూపం, గంగా మాత ఆలయం కూడా చూడవచ్చు. ఈ స్నాన ఘట్టంలో ప్రతి ఆ రోజు రాత్రి హారతి జరుగుతుంది. ఆ సమయంలో గంగమ్మతల్లి ఆలయంలోను, నదిలోను భక్తులు వెలిగించిన దీపా లతో, దీప తోరణాలతో ఆ ప్రదేశమంతా జ్వాజ్వలమానంగా వెలుగుతూ కన్నుల పండువగా ఉంటుంది. అత్యంత శోభయమానంగా ఉన్న ఆ దృశ్యాన్ని కనులారా చూడాల్సిందే తప్ప వర్ణించడానికి మాటలు చాలవు. శ్రీమహావిష్ణువు అడుగు పెట్టిన దానికి గుర్తుగా విష్ణు పాద ముద్ర ఉన్న శిలను కూడా మనం వాడవచ్చు. ఆ కారణంగానే ఇది హరికీ పైర్' అని పిలువబడుతోంది.

భరతమాత మందిరం:

విశాలమైన ఆవరణలో ఉన్న ఎనిమిది అంతస్తుల భవనమిది. భరతమాత నిలువెత్తు విగ్రహం, భారతదేశ పటం, కాళి, దుర్గ, లక్ష్మి మొదలైన వివిధ దేవతా విగ్రహాలను కూడా చూడొచ్చు. ఈ మందిరానికి మొదటి ఆశీర్వాదం ద్వారకా పీఠాధిపతులవారు ఇచ్చారట. బెంగుళూకు చెందిన ఇంజనీర్ బి.అనంతరామయ్య పర్యవేక్షణలో బరోడాకు చెందిన చెందిన నరేంద్రభాయ్ ఏక్నాద్ దీనికి రూపకల్పన చేసారు.

మానసాదేవి మందిర్:

ఎత్తైన కొండమీద ఉంది మానసాదేవి మందిరం. నాగరాజు వాసుకి సోదరి మానసాదేవి. ఈ తల్లి దర్శనం అత్యంత పుణ్యదాయమని, ఫలప్రదమని చెప్తారు. అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ ఉన్న చెట్టుకి తాళ్లు కడుతుంటారు. అలా కడుతూ తమ కోరికలు విన్నవించుకుంటే తప్పక తీరుతాయన్నది ఒక నమ్మకం. ఈ కొండమీదకి నడకదారి, రోప్ వే కూడా ఉన్నాయి. ఈ కొండమీదనుంచే గంగాతీరం, తీరంలోని ఆలయాలు అత్యంత సుందరంగా కనపడతాయి. ఇంకా ఇక్కడ చండీదేవి మందిరం, భూమా నికేతన్, దక్షేశ్వర్ మందిర్, జగద్గురు ఆశ్రమం, మహామృత్యుంజయ మందిర్ ఇలా ఎన్నో పవిత్రమైన స్థలాలన్నాయి. జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన పుణ్యక్షేత్రం హరిద్వార్.

No comments:

Post a Comment