Monday, July 30, 2018

Konark temple | భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పిన ఓ చారిత్రక వైభవం


కోణార్క్ టెంపుల్భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పినఓ చారిత్రక వైభవం

Konark temple | ఓ చారిత్రక వైభవం
చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలకు మన దేశం పుట్టినిల్లు. అలాంటి అద్భుత కట్టడాలలో ముందువరుసలో చెప్పుకునే ఆలయం కోణార్క్ సూర్యదేవాలయం.  
భారతదేశం శిల్పకళకు, సంస్కృతి, సంప్రదాయాలకు ఖండాంతరాలలో సైతం కీర్తితెచ్చిన గొప్ప కట్టడం. ఎంతోమంది విదేశీయులను తనవైపు ఆకర్షించుకొని, అనేక చారత్రక సంఘటనలకు సాక్షీభూతంగా నిలిచింది. ఇది మాది అని భారతీయులు గర్వంగా చెప్పుకునే కోణార్క్ ఆలయ విశేషాలు చూద్దాం....

కోణార్క్ ఆ పేరుకే ఎంతో అర్ధం ఉంది. కోన్ అంటే కిరణం, అర్క అంటే సూర్యుడు ఈ రెండు పదాలు కలిసి కోణార్క్ గా పేరు పడిందని చెప్తారు. దేవాలయం ఏడూ గుర్రాలతో లాగుతున్న రథం ఆకారంలో నిర్మించారు.ఈ దేవాలయ నిర్మాణం కాలచక్రానికి సంకేతంగా చెప్తారు. రథానికి ఇరువైపులా పన్నెండు చక్రాల చొప్పున మొత్తం ఇరవై నాలుగు చక్రాలుంటాయి. ఒక్కో చక్రానికి ఎనిమిది భాగాలుగా ఉంటుంది. ఈ ఎనిమిది భాగాలు ఒక రోజులో ఉండే ఎనిమిది ఝాములుగా చెప్తారు. అలాగే రథాన్ని లాగుతున్న ఎడుగుర్రాలు వారంలోని ఎడు రోజులుగాను, ఇరవైనాలుగు చక్రాలు ఒక సంవత్సరంలో చంద్రునిలో మారుతున్నా కళలకు అంటే కృష్ణ, శుక్ల పక్షాలకు సంకేతంగా చెప్తారు.

కోణార్క్ సూర్యదేవాలయం-అద్భుతాలకు నిలయం...

          ఆలయం భారతీయ నిర్మాణకౌశలతకు నిదర్శనం. పురాణ కథనాల ప్రకారం ఈ ఆలయం అతి ప్రాచీనమైనది. శ్రీ కృష్ణుని కుమారుడగు సాంబుడు ఒకసారి కొలనులో స్నానం చేస్తున్న స్త్రీలను కామద్రుష్టితో చూసాడని అతడిని శపించాడట కృష్ణుడు. కృష్ణుని శాపంతో సాంబుడు కుష్టువ్యాధి గ్రస్తుడయ్యాడు. వ్యాధి నివారణ కోసం ప్రస్తుతం కోణార్క్ గా  పిలువబడుతున్న మైత్రేయ అరణ్యానికి వచ్చిఅక్కడున్న చంద్రభాగ నదిలో స్నానం చేసి సూర్యభగవానుడిని ఆరాధిస్తూ ఉండేవాడు. అలా  12 సంవత్సరముల పాటు సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ తపస్సు చేశాడు. చివరికి సూర్యుడి అనుగ్రహంతో  ఆ వ్యాధి నుంచి బయటపద్దాడు. సూర్యుడు తనమీద చూపించిన అనుగ్రహానికి గాను సూర్యుడికి ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు. ఒకరోజున ఆయన 'చంద్రభాగ' నదిలో స్నానం చేస్తుండగా అతడికి దేవశిల్పి విశ్వకర్మ తయారుచేసిన సూర్యుడి ప్రతిమ దొరికింది. ఆ విగ్రహాన్నే సాంబుడు ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించినట్టుగా పురాణ కథనాలు చెప్తున్నాయి.

           ఆ తరువాతి కాలంలో దీనిని గంగావంశానికి చెందిన లాంగుల అనంగాభీముని కుమారుడు లాంగుల నరసింహదేవ-క్రీ.శ.1236-1264 మధ్యకాలంలో ఇప్పుడున్న ఆలయాన్ని నిర్మించాడు. 1200 మంది శిల్పులు పన్నెండేళ్ల పాటు కష్టపడి నిర్మించిన ఈ ఆలయమిడి.  సూర్యభగవానుడు హిందువులకు ఆరాధ్యదైవం. అయితే ఒక్క హిందువులు మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రతి వ్యక్తి సందర్శించాల్సిన స్థలం. అద్భుతమైన విద్యని అందించే ఒక మహా విశ్వవిద్యాలయం అంటారు పరిశోధకులు. ఇప్పటికి కూడా ఈ శిధిలాలలో కూడా ఏ భాగాన్ని చూసినా ఏదో ఒక విజ్ఞానాంశాన్ని మనకు అందిస్తుంది. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని, వందల ఏళ్ల తరవాత కూడా అద్భుత శిల్ప సౌందర్యంతో అలరారుతోంది. 

 యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలలో  స్థానం సంపాదించుకున్న  కోణార్క్ సూర్య దేవాలయం ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 66కిలోమీటర్ల దూరములోను పూరి క్షేత్రానికి 35 కిలోమీటర్ల దూరములోను ఉంది.
ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కోణార్క్ సూర్యదేవాలయాన్ని యాత్రికులు దర్శించుకోవచ్చు. జీవిత కాలంలో ఒక్కసారిఅయిన చూడతగిన క్షేత్రం కోణార్క్ సూర్య దేవాలయం.
        1984 లో ఈ సన్ టెంపుల్ వరల్డ్ హెరిటేజ్ హోదా ని సంపాదించుకుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ కోణార్క్ డాన్సు ఫెస్టివల్ వైభవంగా జరుగుతుంది
ధ్వంసకుల చేతిలో పతనమైన ప్రధాన ఆలయం గర్భ గుడి ఎంతో అద్భుతమైన కట్టడం. గర్భ గుడి పైకప్పులో 52 టన్నుల బరువైన అయస్కాంతాన్ని అమర్చి, సూర్య భగవానుడి విగ్రహం ఇనుముతో తయారుచేశారు. ఈ అయస్కాంత ప్రభావం వల్ల విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది. ఉషోదయంలో తొలి కిరణాలు నేరుగా ఈ విగ్రహానికి ఉన్న వజ్రపు కిరీటంపై పడి ఆలయ శోభను మరింత ఇనుమడింపజేసేవట. అయితే ఈ అయస్కాంతం ప్రభావంతో సముద్రంలో ప్రయాణించే ఓడలు నావికా వ్యవస్థ పని చేయకపోవడంతో ఆలయాన్ని నావికులు ధ్వంసం చేసినట్లు ఒక కథనం ఉంది. అదేవిధంగా ఎన్నో చారిత్రిక కట్టడాల మీద దాడిచేసి విధ్వంసం సృష్టించిన విదేశీయుల దాడికి గురయినప్పుడు ఈ అయస్కాంతమ్ దోపిడీకి గురయిందని,  అంగ్లేయులు ఈ అయస్కాంతాన్ని దోచుకుపోయారని కొన్ని కథనాలు చెబుతున్నాయి. 
ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఒక కథనం చెప్తారు. ఈ ఆలయంలో సూర్యభగవానుని విగ్రహం ఆలయంలో తెలుతున్నట్టుగా ఏర్పాటు చేయాలని సంకల్పించారట. అయితే శిల్పులు ఎంత ప్రయత్నించినా ఈ ఆలయ గోపురాన్నివాటి మధ్య సూర్యభగవానుడు తేలే విధంగా చేయడం వారికి సాధ్యం కాలేదట. జరుగుతున్నా ఈ జాప్యానికి కోపగించుకున్న రాజు  రేపటి రోజులోగా   గుడి నిర్మాణం పూర్తి కావాలి లేదా అందరికీ శిరచ్చేదమే అని రాజు ఉత్తర్వులు జారీ చేసి వెళ్ళి పోయాడట. అయితే ఆ రోజు సాయంత్రం వరకు ఎంత ప్రయత్నించినా వారి ప్రయత్నం సఫలం కాలేదు. ఇంకేముంది రాజుగారి ఆజ్ఞ ప్రకారం తెల్లారితే శిరచ్చేదమే అని విచారంలో పడిపోయారు శిల్పులందరూ.  అయితే అందులో ఒక శిల్పి తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఈ పనిలో చేరాడు. శిల్పి ఇక్కడ పనిలో ఉండగానే శిల్పకారుడి కుమారుడి పెద్దవాడయిపోయాడు. పెద్దవాడయిన శిల్పికుమారుడు తన తండ్రిని చూడాలని వచ్చి వారి సమస్యను తెలుసుకున్నాడు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించి ఆలయ శిఖరాన్ని పూర్తిచేసి వారందరిని ఆశ్చర్య
చకితులను చేసాడట. అయితే అంతటి మహత్కార్యాన్ని పూర్తిచేసిన తనని చూసి మిగిలిన వారిని అసమర్ధులుగా భావించి రాజు చంపేస్తాడనే భయంతో ఆ
కుర్రవాడు చంద్రభాగా నదిలో ఆత్మహత్య చేసుకున్నాడని ఒక కథనం... ఆ కుర్రవాడు ఆ అద్భుత నిర్మాణ కౌశల్యానికి నిదర్శనం అయితే ఈ ఘటన మాత్రం ఈ ఆలయానికి ఒక శాపమైందనే కథనం కూడా ఉంది.
కోణార్క్‌లో సూర్యుని దేవాలయంతో పాటు అఖండాలేశ్వర దేవాలయం, అమరేశ్వర ఆలయం, దుర్గ, గంగేశ్వరీ, కెండూలీ, లక్ష్మీ నారాయణ, మంగళ, నీల మాధవ ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ తరువాతి కాలంలో నిర్మాణం చేసినవి. ఆలయంలో సూర్యవిగ్రహం గాని, పూజలు గాని లేకపోయినా సూర్యజయంతి అయిన రథసప్తమి రోజున ఇక్కడికి ఎంతోమంది భక్తులు వస్తారు. దేవాలయానికి దగ్గర్లో ఉన్న చంద్రభాగ తీర్థంలో స్నానం చేసి దేవాలయంలో ఉన్న నవగ్రహాలను పూజిస్తారు.
అద్భుతమైన శిల్పకళకు, ఆధునిక పరిజ్ఞానికి గుర్తుగా కోణార్క్ దేవాలయాన్ని చెప్పుకోవచ్చు. ఈ కట్టడాన్ని పూర్తిగా నల్లటి రాళ్ళతో కట్టినందు వల్ల, బ్రిటిష్ వారు దీన్ని బ్లాక్ పగోడా అని కూడా అనేవారు. ఎంతో అందమైన నగిషీ చెక్కడాలతో ఆనాటి శిల్పుల కళా వైదుష్యాన్ని చాటి చెబుతున్నాయి.
ఈ సూర్య దేవాలయం తూర్పు – పడమరల దిశగా కట్టబడింది. ఇది పూర్తిగా కళింగ శిల్పకళకు, సంస్క్రుతి సంప్రదాయాలకు ఓ ప్రతీక. ఆనాటి ఆ శిల్పకళా వైభవం నేడు శిధిలాలుగా మిగిలిపోయినా, ఆ శిల్ప కళా సౌందర్యం మాత్రం ఇంకా సౌరభాలు వెదజల్లుతూనే వుంది.
       పర్యాటకులకు స్వర్గాధామం కోణార్క్‌. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది పర్యాటకులు కోణార్క్ వస్తారు. ఇక్కడ  ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 1 నుండి 5 కోణార్క్‌ డాన్స్‌ ఫెస్టివల్‌ వరకు జరుగుతుంది.ఇందులో అన్నిరకాల శాస్త్రీయ నుత్యాలు ప్రదర్శిస్తారు. కోణార్క్‌ లో జరిగే మరొ పెద్ద ఉత్సవం చంద్రభాగ మేళా. ఇది ఫిబ్రవరి నెలలో జరుగుతుంది
పురావస్తు మ్యూజియం
              కోణార్క్‌లో గల పురావస్తు మ్యూజియం కోణార్క్  ఆలయానికి సంబంధించిన చాలా విశేషాలను వివరిస్తుంది. సూర్య దేవాలయం సమీపంలోనే ఇది ఉంది. ఈ సన్‌ టెంపుల్‌ యొక్క గత వైభవాన్ని తెలుసుకునేందుకు పర్యాటకులు ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయ శిల్పాల శిథిల భాగాలను ఈ మ్యూజియంలోనే భద్రపరిచారు. వాటిని చూడడానికి కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ ఆలయంలో పడిపోయిన నిర్మాణాలు, పురావస్తు శిథిలాలు ఇక్కడికి చేర్చిన తర్వాత 1968 లో ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ మ్యూజియంలో నాలుగు గ్యాలరీలున్నాయి. ఆలయం నుంచి సేకరించిన 260 కి పైగా ప్రాచీన వస్తువులు, వివిధ విగ్రహాలు ఇక్కడ కనిపిస్తాయి. వాటితో పాటు, ఈ మ్యూజియం లో వివిధ రకాల ఇతర స్మారక చిహ్నాలు, కళింగ చరిత్రను వివరించే పురాతత్వ ప్రదేశాల చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ మ్యూజియాన్ని ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరుస్తారు.
ఇక ఈ కోణార్క్ టెంపుల్ కి ఎలా వెళ్లాలి చూద్దాం
       దేశంలో ఎక్కడి నుంచయినా రైలు, విమాన, రోడ్డు మార్గాల ద్వారా ఒడిసా రాజధాని భువనేశ్వర్‌ చేరుకోవచ్చు. అక్కడి నుంచి  అరవై కిలోమీటర్ల దూరంలో కోణార్క్‌ కి బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో కూడా చేరుకోవచ్చు.

No comments:

Post a Comment