Wednesday, July 25, 2018

Nachiyar koil Temple mystery | సైన్స్ కే సవాలుగా మారిన ఆలయం

సైన్స్ కే సవాలుగా మారిన ఆలయం

Nachiyar koil Temple | సైన్స్ కే సవాలుగా మారిన ఆలయం
సైన్స్ కే సవాలుగా మారిపోయిందా టెంపుల్. సైంటిస్టులకే చుక్కలు చూపిస్తోంది. ఆ ఆలయం నిండా అంతుచిక్కని రహస్యాలే. వీడని చిక్కుముళ్ళే.  
అది 108 వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. పేరుకి వైష్ణ్వాలయమే కాని చూడ్డానికి శివాలయంలా కనబడుతుంది. ఏ ఆలయంలో అయినా ఉత్సవాల్లో ప్రధాన దైవం ఉత్సవామూర్తుల్నే ఊరేగిస్తారు. కాని ఇక్కడ మాత్రం వారి వాహనమైన గరుత్మంతుడిని ఊరేగిస్తారు. అలా ఊరేగిస్తున్నప్పుడు కూడా వింతలే. ఊరేగింపు మొదలైనప్పట్నుంచి గరుడుడు క్రమంగా బరువు పెరిగిపోతూ ఉంటాడు. చివరికి ఆ బరువు మొయ్యలేక మరింత మంది మోతదారులు రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఊరేగింపు మొదలైనపుడు మామూలుగా ఉన్న ఉత్సవ విగ్రహ వస్త్రాలు తిరిగి వచ్చేసరికి పూర్తిగా తడిసిపోతాయి. ఎందుకలా.... ఎన్ని పరిశోధనలు జరిగినా ఈ విడివడని చిక్కుముళ్లన్నీ రహస్యాలుగానే మిగిలిపోయాయి. మరి ఈ విశేషాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయో... ఆ రహస్యాల పరమర్ధమేంటో చూద్దాం......

తమిళనాడు రాష్ట్రం కుంభకోణం దగ్గర తిరునాయూర్ లో ఉంది నాచియార్ కోవెల దీన్నే తిరునాయూర్ నంబి టెంపుల్ అని కూడా  పిలుస్తారు. నాచియార్ అంటే అమ్మవారు.  నాచియార్ కోవెల ... ఈ దేవాలయ పేరులోనే తెలుస్తోంది ఇక్కడ స్వామి కన్నా అమ్మవారికే ప్రాధాన్యత ఎక్కువని. అమ్మవారి పేరుతో, అమ్మవారి ప్రాధాన్యతతో అలరారుతున్న అతి తక్కువ క్షేత్రాల్లో ఇది ఒకటి.  ఇక్కడ ఇలా అమ్మవారి పేరుమీదుగా, అమ్మవారి ప్రాధాన్యతతో ఆలయం ఏర్పడడానికి ఒక కథనాన్ని చెప్తారు.
 ఈ ప్రాంతంలో పూర్వం మేధావి మహర్షి ఆశ్రమం ఏర్పరచుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు.  ఆయనకి విష్ణుమూర్తిని తన అల్లుడుగా పొందాలనే కోరిక వుండేది.  స్వామి అల్లుడు కావాలంటే అమ్మవారు తన కూతురు కావలి కదా అందుకే ఆయన వంజుల వృక్షం కింద మహాలక్ష్మి అమ్మవారి  కోసం తపస్సు చేశాడుట, ఆమెను కూతురుగా పొందటానికి. మహర్షి తపస్సుకు కరుణించిన మహలక్ష్మి చిన్న పాపగా ప్రత్యక్షమయింది. వంజుల వృక్షం కింద దర్శనమిచ్చిన ఆ పాపకి వంజులా దేవి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు మహర్షి.
అలా పెరిగి పెద్దదయిన లక్ష్మీదేవిని వివాహం చేసుకోవటంకోసం విష్ణుమూర్తి సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుధ్ధ, పురుషోత్తమ వాసుదేవ అనే ఐదు రూపాలు ధరించి భూలోకానికి వచ్చాడుట.  ఆ ఐదుగురూ ఐదు వైపులకు వెళ్ళి అమ్మవారి కోసం వెతికారు కానీ ఆమె వాళ్ళకి ఎక్కడా కనబడనేలేదట.  దాంతో విష్ణుమూర్తి లక్ష్మీదేవి జాడ కనిపెట్టమని తన వాహనమైన  గరుక్మంతుడికి చెప్పాడు. స్వామి ఆదేశం ప్రకారం లక్ష్మీదేవిని వెతకడానికి బయలుదేరాడు గరుడుడు. మేధావి మహర్షి ఆశ్రమంలో పెరుగుతున్న లక్ష్మీదేవిని చూసి ఆ విషయాన్ని తన స్వామికి చెప్పాడు గరుత్మంతుడు.  వెంటనే స్వామి మేధావి మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆయన కూతురుని తనకిచ్చి వివాహం చేయమని అడిగాడుట.  తన కోరిక తీరబోతున్నందుకు మహర్షి చాలా సంతోషించాడు, కానీ కూతురు క్షేమంకోసం ఒక షరతు పెట్టాడు.  తన కూతురికే అన్ని విషయాలలోనూ అధికారం వుండాలని, వివాహం తరువాత  తన కూతురు అల్లుడు ఇక్కడే ఉండాలని షరతు పెడతాడు. ఆ షరతుకు అంగీకరించిన   శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకొని అమ్మవారితో కలిసి అక్కడే విగ్రహ రూపంలో కొలువుండిపోయాడు. 
ఈ షరతులకు నిదర్శనంగానే  గర్భగుడిలో అమ్మవారు స్వామి కన్నా కొంచెం ముందుకి వుంటారు.  ఉత్సవాల సమయంలో జరిగే ఊరేగింపులలో కూడా అమ్మవారి విగ్రహమే  ముందు కదులుతుంది.  ఆమె వెనుకే అయ్యవారి విగ్రహం. పూజలు, నైవేద్యం, అన్నీ అమ్మవారికే ముందు జరుగుతాయి. ఎ ఆలయంలోను లేనివిధంగా ఇక్కడ అమ్మవారి నడుముకి తాళాల గుత్తి వుంటుంది.  స్వామి తన మామగారైన మేధావి మహర్షికిచ్చిన మాట ప్రకారం ఈ క్షేత్రంలో పెత్తనమంతా అమ్మవారికే అప్పచెప్పాడట. అందుకే ఈ క్షేత్ర పాలనాధికారమంతా ఆమెదే అన్నదానికి గుర్తుగా అమ్మవారి నడుముకు తాళాల గుత్తి వేలాడుతూ ఉంటుందని చెప్తారు. అలా ఈ కోవెల పేరు, ఊరు పేరు కూడా అమ్మవారి పేరుమీదే నాచియార్ కోయిల్ గా ప్రసిద్ధి చెందింది వీరి వివాహం చేయించిన బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవిని వెదకటానికి వచ్చిన విష్ణుమూర్తి పంచ రూపాలయిన, ప్రద్యుమ్న, అనిరుధ్ధ, పురుషోత్తమ, సంకర్షణ, వాసుదేవ మూర్తులను కూడా గర్భగుడిలో చూడవచ్చు.  
ఈ ఆలయంలో గరుక్మంతుడికి ప్రాధాన్యత ఎక్కువ. అమ్మవారు ఎక్కడుందో కనిపెట్టి ఆమెతో తన వివాహం జరగడానికి ముఖ్యపాత్ర పోషించినందుకు గాను ఇక్కడ గరుత్మంతుడికి విశేష ప్రాధాన్యత నిచ్చాడట స్వామి. అందుకే భక్తులను నా  బదులుగా  నువ్వే ఆశీర్వదించు అంటూ గరుడుని ఆదేశించాడుట.  దీనికి గుర్తుగా గర్భ గుడి ముందు గరుక్మంతుడి భారీ విగ్రహం కొలువుతీరి ఉంటుంది. అందుకే భక్తులు తమ కోరికలు నేరవేర్చమని గరుత్మంతుడినే వేడుకుంటారు. ప్రతి గురువారం భక్తులు శీఘ్రకళ్యాణం కోసం, సర్ప దోష నివారణకు, గ్రహాల అనుకూలతకూ  ఇక్కడ గరుత్మంతుడికి ప్రత్యెక పూజలు  చేస్తారు. ఇక ఇక్కడ జరిగే ఓ విచిత్రం గురించి చెప్పుకోవాలి. ఊరేగింపు సమయంలో స్వామివారిని ఊరేగించటానికి ఈ గరుక్మంతుడి విగ్రహాన్ని బయటకి తీస్తారు.  గుడిలోంచి బయటకి వచ్చేటప్పుడు విగ్రహం క్రమంగా బరువు పెరిగిపోతూ ఉంటుందట. నలుగురు మనుషులు మొయ్యగలిగిన ఆ విగ్రహం తరువాత అలా అలా బరువు పెరిగిపోయి దాదాపు ఓ ముప్పై మంది మోస్తేకానీ కదలనంత బరువు పెరిగిపోతుందట.  అలా ఆరు గంటల పాటు జరిగే ఊరేగింపు పూర్తయి తర్వాత తిరిగి గుడిలోకి వచ్చేటప్పుడు ఈ విగ్రహం బరువు మళ్ళీ అంచెలంచలుగా తగ్గి, ఆలయం లోపలకి వచ్చే సమయానికి మొదట ఎంత బరువుతో ఉందో అంతే బరువుకు మరుతుందట.  పైగా గరుక్మంతుడికి ధరింప చేసిన బట్టలు పూర్తిగా చెమటతో తడిసి వుంటాయిట. . అలా తడిసిపోవడానికి  గల కారణాలు ఏమిటో సైంటిస్టులు కూడా ఇప్పటికీ   తెలుసుకోలేకపోయారు. అది ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీగానే మిగిలి ఉంది. దీనికి శాస్త్రీయ కారణమయితే తెలియడంలేదు కాని దీనికొక పురాణ కథనం చెప్తారు. ఇక్కడ అమ్మవారికే అన్ని విధాలా ప్రాముఖ్యత వుంటుందని స్వామి మాట ఇచ్చారు. స్వామి వాహనం గరుక్మంతుడు వేగంగా వెళ్ళగలవాడు.  మరి అమ్మవారి వాహనం హంస.  హంసకి గరుక్మంతుని అంత వేగం వుండదు.  అందుకే గరుక్మంతుడు అమ్మవారికన్నా ముందు వెళ్ళకుండా అలా బరువు పెరిగి తన నడకని నియంత్రించుకుంటాడుట.
ఈ ఆలయం విష్ణ్వాలయం కాని చూడ్డానికి శివాలయంలా కనబడుతుంది. దానికి కూడా ఓ కారణం ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించిన చోళ రాజు కొచెంగనన్ శివ భక్తుడు. ఆయన తన జీవిత కాలంలో 70 శివాలయాలు నిర్మించాడు. ఒకసారి ఆయనకి మహా విష్ణువుని చూడాలనిపించిదట. దాంతో రాజు శ్రీమహావిష్ణువును ప్రార్ధించాడు. రాజు భక్తికి మెచ్చిన విష్ణువు రాజుకు దర్శనమిచ్చి, తనకి ఆలయం నిర్మించమని ఆదేశించాడుట.  అలా కొచెంగనన్ రాజు నిర్మించిందే ఈ  ఆలయం. ఆయన ఈ ఆలయన్నీ శివాలయం నమూనాలోనే నిర్మించాడుట.  ఆ తర్వాత తంజావూరుకి చెందిన నాయక రాజు రఘునాధ నాయకన్ అమ్మవారికి మండపం నిర్మించాడు. పంచ కృష్ణ స్ధలాలలో ఇది ఒకటి.  అలాగే వైష్ణవులు ముక్తి ధామాలుగా భావించే 12 క్షేత్రాలలో కూడా ఇది ఒకటి. ఉదయం 7-30నుంచీ 12-30 దాకా తిరిగి సాయంత్రం 4-30 నుంచీ రాత్రి 9 గం. ల వరకు దర్శనాలుంటాయి..
ఇక్కడ తమిళ మాసం మార్గై అంటే డిసెంబరు – జనవరి మధ్యలో  10 రోజులు బ్రహ్మోత్సవాలు, ఫన్గుని మాసం అంటే మార్చి – ఏప్రిల్ మధ్యకాలంలో  గరుడ సేవ అత్యంత వైభవంగా జరుగుతాయి.    

No comments:

Post a Comment