Saturday, July 28, 2018

Pasupathinath temple kathmandu nepal


ప్రపంచ పైకప్పులో వెలసిన పశుపతినాథుడు

Pasupathinath temple kathmandu nepal
సామాన్య జీవితంలో కలగని ఆధ్యాత్మిక చింతన ఇక్కడ అడుగు పెట్టడంతోనే మొదలవుతుంది. ప్రపంచంలోని వేలాదిమంది హిందువులందరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని తహతహలాడే ప్రదేశం. ఆరాధ్య మందిరం. యునెస్కో వారిచేత గుర్తించబడిన ప్రపంచ వారసత్వ సంపదలలో ఒకటి. . ప్రసిద్ది చెందిన 275 శైవక్షేత్రాల్లో ఒకటి. అదే పశుపతినాథ్ టెంపుల్. ప్రపంచ పైకప్పుగా పిలుచుకునే నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది పశుపతినాథ్ మందిరం. ఇక్కడ చాలా అరుదుగా లభించే నాలుగుముఖాల శివదర్శనం లభిస్తుంది. పరమేశ్వరుడు ఒకసారి భూమ్మీద పర్యటిస్తూ నేపాల్ లోయ పరిసరాలకు వచ్చి ఆ లోయ అందానికి ముగ్ధుడైపోయాడట.  బంగారు కొమ్ములున్న లేడిగా మారి అక్కడ సంచరించాడట. అలా అక్కడ నాలుగు ముఖాలతో పశుపతినాథుడిగా అక్కడ వెలసినట్టు స్థల పురాణం చెప్తోంది.


   మంచుదుప్పటి కప్పుకున్న ఎవరెస్టు శిఖరం, పచ్చటి తివాచీ పరిచినట్టున్న పర్వతాలు, స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదంగా సాగిపోయే నదులు, సెలయేరుల గలగలలు, జలపాతాల హోరు వీటన్నిటికీ వేదిక నేపాల్. ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశం. మన పొరుగుదేశం. శ్రీమహాలక్ష్మీ అవతారమైన సీతమ్మవారి జన్మస్థలం. బుద్ధ భగవానుడు జన్మించిన పుణ్యభూమి. అలాంటి మనోహరలోకం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉన్న పశుపతినాథ్ మందిరం హిందువుల ఆరాధ్యమందిరం. ఇక్కడ పరమేశ్వరుడు పశుపతినాధునిగా కొలువుతీరాడు. ప్రపంచ ప్రఖ్యాత శైవక్షేత్రం పశుపతినాథ్ ఆలయంలో పశుపతినాధుడిని నేపాలీలు జాతీయదైవంగా పరిగనిస్తారు. ఈ దేవాయంలోకి కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అన్యమతస్థులకు ప్రవేశం లేదు. హిందువులు కానివారు కేవలం భాగమతి నది ఒడ్డునుంచి మాత్రమే చూడాల్సి ఉంటుందని చెప్తారు. కాని మందిరంలోనికి వెళ్ళే యాత్రికులు హిందువులా ఇతరులా అని పరిశీలించే ఏర్పాటేదీ ఉండదక్కడ. ఇలా విభిన్న లక్షణాలకు నిలయం ఖాట్మండు పశుపతినాథుని మందిరం. తూర్పు ఖాట్మండులోని భాగమతి నదీ తీరాన వెలిసిన పశుపతినాథ్ మందిర విశేషాలు చూద్దాం.
      సుప్రసిద్ధ శైవక్షేత్రాల్లో పశుపతినాథ్ ఆలయం కూడా ఒకటి. స్కాంద పురాణంలో పశుపతినాధుని చరిత్ర కనబడుతుంది. ఒకప్పుడు పరమేశ్వరుడు కైలాసం నుండి ఎవరికీ చెప్పకుండా భూమ్మీదకు వచ్చాడట. భూమ్మీద పర్యటిస్తూ నేపాల్ లోయ పరిసరాలకు వచ్చి ఆ లోయ అందానికి ముగ్ధుడైపోయాడట.  బంగారు కొమ్ములున్న లేడిగా మారి అక్కడ సంచరించేవాడు. ఇక్కడ కైలాసంలో శివుడు కనబడక బ్రహ్మాది దేవతలు శివుడిని వెదుకుతూ ఈ ప్రాంతం చేరుకుని లేడి రూపంలో ఉన్న శివుణ్ణి చూసారు. ఆ లేడి రూపాన్ని వదిలిపెట్టి తిరిగి కైలాసం రావలసిందిగా ప్రార్ధించారు. వారి కోరికను శివుడు అంగీకరించక ఈ లోయలో తాను పశురూపంలో ఉన్నాను కాబట్టి పశుపతిగా పిలవబడుతూ భక్తులననుగ్రహిస్తానని చెబుతాడు. అయితే ఎలాగైనా శివుని ఒప్పించి తిరిగి కైలాసం తీసుకువెళ్లాలన్న పట్టుదలతో శ్రీ మహా విష్ణువు లేడి రూపంలో ఉన్న శివుని కొమ్ములను గట్టిగా పట్టుకున్నాడట. దాంతో ఆ కొమ్ములు విరిగి క్రింద పోయాయి. అంఅప్పుడు శ్రీమహావిష్ణువు  అక్కడికి సమీపంలోనే ఉన్న భాగమతి నదీ తీరంలో విరిగిన ఆ లేడి కొమ్ములను శివలింగంగా మార్చి దేవాలయాన్ని నిర్మించాడట. కాలక్రమంలో ఆ ఆలయం భూగర్భంలొనికి చొచ్చుకొని పోయి మరుగున పడిపోయింది. తిరిగి చాలాకాలం తరువాత ఒక ఆవు ప్రతి రోజూ ఆ దేవాలయం  భూమిలోనికి చొచ్చుకుపోయిన చోటికి వచ్చి అక్కడ  నిలబడి పాలు పోస్తూ ఉండేది. ఇది చూసిన  పశువుల కాపరి ఆ ప్రాంతాన్ని త్రావ్వాడు. అప్పుడక్కడ పశుపతినాధ్ లింగం బయటపడింది. వెంటనే స్థానికులంతా కలసి అక్కడ పశుపతినాధుని ఆలయాన్ని నిర్మించారు.
       మరో కథనం ప్రకారం ఒకరోజు శివుడు కాశి నుండి భాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతి సమేతంగా వచ్చి జింక అవతారంతో నిద్రుస్తున్నాడు. అప్పుడు దేవతలు వచ్చి శివుడిని తిరిగి కాశీకి తీసుకొని పోవడానికి జింక కొమ్ములు పట్టుకొని లాగారట. అలా  లాగినప్పుడు ఆ  జింక కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడింది. ఆ నాలుగు ముక్కలే చతుర్ముఖ లింగంగా మారిందని నేపాల్ మహత్యం, హిమవత్‌ఖండం చెప్తున్నాయి. ఆ నాలుగు ముఖాలతో పాటు ఊర్ధ్వ ముఖం కూడా కలిసి పంచముఖుడుగా అరాధించబడుతున్నాడు శివుడు. సద్యోజాత, వామదేవ, అఘోరా, తత్పురుష అనెవి పశుపతినాథుని నాలుగు ముఖాలు. ఐదవదైన ఊర్ధ్వ ముఖానికి మాత్రం రూపం ఉండదు. స్వామి వారి నాలుగు ముఖాలు భిన్నంగా ఉండడం విశేషం. పశ్చిమం వైపు గల సద్యోజాత ముఖం బాలకుని ముఖంలా సౌమ్యంగా కనిపిస్తుంది. ఉత్తరం వైపు గల వామదేవ ముఖం అర్ధనారీశ్వర రూపం. దక్షిణం వైపు గల అఘోర ముఖం సమ్హార రూపం. తూర్పు ముఖమైన తత్పురుష ముఖం శాంతిరూపం. ఈ నాలుగు ముఖాలకు విభిన్నమైన అలంకారాలను చేస్తారు.
             ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు అన్నవిషయంపై సరైన అధారాలు లేవు. అయితే గోపాలరాజ్ వంశవలి అనే చారిత్రాక పత్రిక ప్రకారం శుశూపదేవ అనే రాజు  క్రీ.శ.753 సంవత్సరంలో ఈ ఆలయనిర్మాణం జరిపాడని, పదకొండవ జయదేవ, పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం చెప్తోంది. ఆ తరువాతి ఈ ఆలయం శిదిలమయిపోగా 1416 సంవత్సరంలో రాజా జ్యోతి మల్ల ఈ దేవాలయానన్ని పునరుద్ధరించాడని, 1697 సంవత్సరంలో రాజా భూపేంద్ర ఈ దేవాలయానికి పునఃనిర్మించాడని కొన్ని శాసనాలు చెప్తున్నాయి.  
           పశుపతినాధ దేవాలయం పగోడ ఆకారంలో ఉంటుంది. రాగి, బంగారాలతోను తాపడం చేసన రెండు పైకప్పులతో  నాలుగు వైపులా వెండిద్వారాలతో విలక్షణ శైలిలో ఉంటుంది ఆలయం.  పడమడ ద్వారం దగ్గర బంగారు కవచంతో 6 అడుగుల ఎత్తు, 6 అడుగుల చుట్టుకొలతతో ఒక భారీ నంది మన చూపుల్ని కట్టిపడేస్తుంది. జగమంతా శివమయం అన్నట్టుగా ప్రదక్షిణ మార్గంలో వందలాది శివలింగాలు దర్శనమిస్తాయి. ఇక్కడ శివునితో పాటు ఇతర దేవతల మందిరాలు ఎక్కువగానే కనిపిస్తాయి. నిరంతరం భక్తులతో కిటకిటలాడే పశుపతినాధుని మందిర పరిసరాలలో ఎక్కడ చూసినా  జప,ధ్యానాలు చేసుకునే సాధువులు కూడా ఎక్కువగానే కనబడతారు.
      ఇక్కడ పూజలు చేసే పూజారులను భట్ట అని , ప్రధాన అర్చకుడిని మూల భట్ట అని, రావల్ అని పిలుస్తారు. ప్రపంచంలోని హిందువులందరూ చూసి తీరాలని తహతహలాడే ఈ ఆలయంలో ప్రధాన అర్చకుడికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ప్రధాన అర్చకుడు కేవలం  నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారీగా ఉంటాడు.
                   ఈ ఆలయంలో అర్చనా విధానాలు కూడా ఒక చరిత్రను సొంతం చేసుకున్నాయి.. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. అలా ఉండడానికి కూడా ఒక కారణం ఉంది.  నేపాల్ ప్రజలు తమ రాజును తండ్రిగా భావిస్తారు. రాజు మరణించినప్పుడు దేశం సంతాప సముద్రంలో ఉంటుంది. తండ్రిలాంటి రాజు చనిపోతే నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్యకైంకర్యాలు చేసే అవకాశం ఉండదు. అందువల్ల పశుపటినాధుని నిత్యపూజలకు అంతరాయం ఏర్పడుతుంది. అలా కాకుండా పశుపతినాథునికి నిత్యకైంకర్యాలు నిరంతంగా కొనసాగాలనే ఉద్దేశ్యంతో భారతదేశ అర్చకులే ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తుంటారు. చెప్పుకోవలసిన విషయం ఏంటంటే ఇక్కడి అర్చకులు గత 350 సంవత్సరాలుగా కర్నాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లా నుండి నియమించబడినవారేనట. అయితే, కొంతకాలం నుంచి ఈ సంప్రదాయం మారి స్థానికులను కూడా ఈ దేవాలయంలో అర్చకులుగా నియమిస్తున్నారు.
          ఈ ఆలయం అత్యంత మహిమన్వితమైనది. 2015లో వచ్చిన భారీ భూకంపంలో నేపాల్ లో ప్రసిద్ధి చెందిన కాష్టమండపమందిరంతో సహా ఎన్నో పటిష్టమైన భవనాలు, మందిరాలు నేలమత్తమైనా ఈ పశుపతినాథుని మందిరం మాత్రం చెక్కుచెదరలేదు. మనిషిలోని పశుత్వాన్ని జయించి మోక్షమార్గం వైపు పయనించాలంటే పశుపతినాథున్ని తప్పక పూజించాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.
 హిందువులకు అత్యంత ప్రదానమయిన ఈ ఆలయంలో మహాశివరాత్రికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాదిమంది భక్తులతో సాధువులతో ఆ ప్రదేశమంతా శోభాయమానంగా ఉంటుంది. ఆ రోజు ఆలయ ప్రాంగణమంతా దీపాల వరుసలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది.

No comments:

Post a Comment