Monday, July 9, 2018

జై జగన్నాథ - 7 | puri jagannatha temple history

విశ్వావసు విద్యాపతికి జగన్నాధుని చూపించడం 

     
puri temple history
ఏం చేయడానికి పాలుపోక అయోమయంలో పడిపోయాడు విశ్వావసు. ఎందుకంటే విద్యాపతికి స్వామిని చూపిస్తే, అతడు వెళ్లి ఇంద్రద్యుమ్నునికి సమాచారం అందచేస్తాడు. తను విన్నదాని ప్రకారం ఇంద్రద్యుమ్నుడు ఇక్కడకు వచ్చి స్వామి దర్శనం కోసం ప్రయత్నిస్తే స్వామి అంతర్హితుడు కాకతప్పదు. అలా కాదని విద్యాపతికి స్వామి దర్శనం చేయించడానికి నిరాకరిస్తే అతిధిని అగౌరవపరచినవాడు అవుతాడు. ఇచ్చిన మాటను తప్పినవాడవుతాడు. పైగా బ్రాహ్మణుడయిన విద్యాపతి కోపగించుకొని తనను శపించినా శపించవచ్చు. ఇలా ద్వైద్వీభావంతో కొట్టుమిట్టాడుతున్నాడు శబరుడు. చివరకు ఏదైతే అదే అవుతుందని భావించి, భగవంతుని సంకల్పాన్ని తప్పించడం ఎవరితరం కాదు కాబట్టి, అతడికి స్వామి కొలువైన ప్రదేశాన్ని చూపించడానికే నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకున్న విశ్వావసు....

              "ఓ బ్రాహ్మణుడా! మీరు కోరుకున్న ప్రకారం స్వామి ఉండే తావుకు తప్పక తీసుకువెళతాను. మీరు కొంతకాలం ఇక్కడే ఉండండి" అని చెప్పి విద్యాపతికి అతిధిమర్యాదలకు ఏర్పాటు చేసాడు.
             శబర నాయకుని కోరిక మీద అక్కడే కొంతకాలం విడిది చేసిన విద్యాపతి అతడెప్పుడు స్వామి దర్శనం చేయిస్తాడా.... అని ఓపికగా ఎదురుచూస్తున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం ఒక సుముహూర్తాన విద్యాపతిని తీసుకొని నీలాచల పర్వత ప్రాంతంలో జగన్నాధుడు కొలువుతీరిన రహస్య ప్రదేశానికి తీసుకుపోయి స్వామిని దర్శింపచేసాడు విశ్వావసు. స్వామిని గాంచిన విద్యాపతి పులకించిపోయాడు. విద్యాపతి ఆ ఆనందపారవశ్యంలో ఉండగానే తనతోపాటు తన గృహానికి తీసుకువచ్చిన శబరనాయకుడు విశ్వావసు అమోఘమైన, అమూల్యమైన, విచిత్రమైన ఆహారపదార్ధాలను విద్యాపతికి సమర్పించాడు. వాటిని చూసిన విద్యాపతి ఎంతో ఆశ్చర్యపోయి,
        "ఓ నాయకుడా! ఇప్పుడు నీవు నాకు సమర్పించిన పదార్ధములన్నీ సామాన్య మానవులు ఎన్నడూ కనీవినీ ఎరుగనివిగా ఉన్నాయి. ఇంతటి అపూర్వమైన, అద్భుతమైన పదార్దములు నీకు ఎలా లభించాయి? ఇక్కడ ఈ అటవీ ప్రాంతంలో ఇన్ని అద్భుత పదార్ధాలు మీకు ఎలా లభ్యమయ్యాయి?" అని ప్రశ్నించాడు.
         దానికి సమాధానంగా విశ్వావసు " ఓ స్వామీ ఇవన్నీ దేవతలు ఆ జన్నాధునికి సమర్పించినవి. ప్రతిరాత్రి దేవరాజు ఇంద్రునితో సహా సర్వదేవతలు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి ఎన్నో విచిత్రమైన పదార్దములు ఆ దేవదేవునికి నైవేద్యంగా సమర్పించి వెళతారు. వారు సమర్పించిన పదార్ధములే ఇప్పుడు నేను నీకు వడ్డించిన మధుర పదార్దములు" అని చెప్పాడు. అలా జగన్నాధుని దర్శించి, ఆ స్వామి ప్రసాదంగా తనకు లభించిన మధుర పదార్ధాలు ఆరగించి తన భాగ్యానికి ఏంతో సంతోషించిన విద్యాపతి అటు స్వామికార్యం, ఇటు స్వకార్యం కూడా అవడంతో ఉత్సాహంగా రాజ్యానికి బయలుదేరాడు.
       
puri temple story
Add caption
 నీలమాధవుని ఉదంతాన్ని మహారాజుకు వివరించాడు. కోరిన సమాచారం రావడంతో ఇంద్రద్యుమ్నుని ఆనందానికి అవధులే లేకపోయాయి. సరిగ్గా అదే సమయానికి త్రిలోకసంచారి, బ్రహ్మ మానసపుత్రుడు అయిన నారదమహర్షి కూడా అక్కడకు వచ్చాడు. నారదుని చూసి ఎంతో సంతోషించిన ఇంద్రద్యుమ్నుడు ఆ మహర్షికి ఉచితరీతిన స్వాగత సత్కారాలు జరిపి "ఓ మహర్షీ సరియైన సమయానికే వచ్చారు. మీరు త్రిలోక సంచారులు. మీరెరుగని క్షేత్రము లేదు. నేనిపుడె మా పురోహితులయిన విద్యాపతి ద్వారా పురుషోత్తమ క్షేత్ర ప్రాశస్త్యాన్ని వింటున్నాను. ఆ క్షేత్రాన్ని సందర్శించి ఆ జగన్నాధుని దర్శనం చేసుకొని నా జన్మ తరింప చేసుకోవాలనుకుంటున్నాను. దానికి మీ సహాయ, సహకారాలు కావాలి" అంటూ వినయంగా ప్రార్ధించాడు...................

No comments:

Post a Comment