Wednesday, July 18, 2018

puri jagannatha temple history | జగన్నాథ రథయాత్ర


రథయాత్రలో విశేషాలు

puri jagannatha temple history | జగన్నాథ  రథయాత్ర
రథయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరువాత పూరీలో శంకర భగవత్పాదులు ఏర్పాటు చేసిన గోవర్ధన మఠ పీఠాధిపతులు వచ్చి స్వామిని దర్శించుకొని వెళతారు. అనంతరం భగవంతుడి ముందు ఎంతటివారైనా సేవకులే అని చెప్పడానికి నిదర్శనంగా పూరీ రాజు వచ్చి మూడు రథాల ముందు కస్తూరి కళ్లాపి జల్లి బంగారు చీపురుతో ఊడుస్తాడు.
అనంతరం రథం  త్రాళ్లు లాగి  రథయాత్రను ప్రారంభిస్తాడు. దీనినే 'చెహరాపహారా' అంటారు. తరువాత పండాలు “జై మనిమా..” అంటూ రథయాత్రను కొనసాగిస్తారు. ముందు బలభద్రుని రథం, తరువాత సుభద్రాదేవి రథం, ఈ తరువాత జగన్నాటక సూత్రధారి... చిద్విలాసుడు అయిన జగన్నాథుని రథం లాగుతారు. ఇక అక్కడి నుంచి రథయాత్ర సందోహం మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి జై జగన్నాథా... అంటూ నినదిస్తూ వివిధ వాయిద్యాలతో, నృత్య గానాలతో సాగిపోయే జనయాత్ర మరో సాగరఘోషను తలపింపచేస్తుంది. ఇసుకేస్తే రాలని జనసంద్రంతో ప్రధాన ఆలయం నుంచి ప్రారంభమయ్యే రథయాత్ర కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సుదీర్ఘ సమయం పడుతుంది. జాతి, మత బేధాలు గాని, పేద, గొప్ప తారతమ్యాలుగాని, చిన్న, పెద్ద అంతరాలుగాని లేకుండా ప్రతిఒక్కరూ ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాన్నిచ్చేది రథయాత్ర. రథయాత్ర ప్రారంభ దినం నాడు గుండీచా మందిరానికి చేరుకున్న జగన్నాథుడు ఆ రోజు రాత్రి మందిరం బయటే ఉండి సోదర, సోదరీలతో విశ్రాంతి తీసుకొని ఆ మరునాడు మందిరంలోనికి చేరుకుంటాడు. అప్పటి నుండి తొమ్మిదిరోజులు గుండీచా మందిరంలోనే కొలువుతీరి భక్తులకు దర్శనమిస్తాడు సోదరీ, సోదర సమేతుడైన జగన్నాథుడు.

తలకింత:

ఈ యాత్రలో లక్షలాదిగా వచ్చే ప్రజలు ఎక్కడ ఒకింత చోటు దొరుకుతుందా అక్కడ చేరి స్వామిని దర్శిద్దామా అన్న ఆత్రంతో ఉంటారు. ఏ ఇంటి మేడ చూసినా జనాలతో క్రిక్కిరిసి ఉంటుంది. ఇదే అదనుగా అక్కడ రథయాత్ర జరిగే ప్రాంతంలో ప్రతి ఇంటివారు తమ ఇంటి మేడలను, మిద్దెలను ఎక్కి చూడడానికి అద్దెను కూడా వసూలు చేస్తారు. ఒకొక్క మనిషికి ఇంత అని రుసుమును వసూలు చేస్తారు.

రధయాత్రలో వింత ఆచారాలు:

puri jagannatha temple history | జగన్నాథ  రథయాత్ర
జగన్నాథుని రథయాత్రలో ఎన్నో విచిత్రమైన, వింతైన ఆచారాలు కనబడతాయి. రథయాత్రలో ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా రథం కొంచెం కూడా ముందుకు కదలదట. అలాంటప్పుడు రథయాత్రలో ఏదో తెలియని పొరపాటు జరిగి ఉంటుందని భావించి, జరిగిన పొరపాటేదైనా తమను క్షమించమని వేడుకుంటూ
రధం ముందు కొబ్బరికాయలు కొడతారట. అప్పుడు రథం ముందుకు కదులుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఉత్సవంలో స్వామి రథం మీద అసభ్యపదజాలంతో స్వామిని దూషిస్తూ ఉండే ఒక మనిషి ఉంటాడట. ఆ వ్యక్తి స్వామిని ఉద్దేశించి అసభ్యమైన మాటలతో పాటలు పాడుతూ ఉంటే స్వామి రథం మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతుందనే అభిప్రాయంతో అనాటి రాజులు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించేవారట. ఆ వ్యక్తినే 'ధక్కువాడు' అని పిలుస్తారు. కేవలం ఈ రకమైన పాటలు పాడడానికే దక్కువాడు ఉద్దేశించబడి ఉంటాడు. ఉత్సవంలో ఈ ధక్కువాడు అలగడం, అతడిని అందరూ బ్రతిమాలడం కూడా ఒక ఆనవాయితీగా ఉండేదట అప్పట్లో అయితే దీని వెనుక మరో కథనాన్ని చెప్తారు పెద్దలు. ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం ఒక నిరుపేద భక్తుడు స్వామిని నమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. ఎంతగా స్వామిని నమ్ముకున్నా జగన్నాథుడు అతడిని కరుణించకపోవడంతో బాధపడిన ఆ భక్తుడు స్వామి మీద ఆగ్రహించి, దుఃఖంతో, అసహాయతతో కూడిన ఆగ్రహంతో రథయాత్ర సమయంలో స్వామి రథం ముందు నిలబడి ,స్వామిని ఉద్దేశించి ఒరియా భాషలో "ఓ జగన్నాథా..! నీవు కరుణామయుడవంటారే! భక్తులకు ఎల్లవేళలా అండగా ఉంటావంటారే..! నిరంతరం నీ భక్తులను కంటికి రెప్పలా కాపాడతావంటారే..! మరి అహర్నిశలూ నేను నిన్నే నమ్ముకున్నాను. నీవు తప్ప మరో దైవాన్ని తలచుకొని ఎరగను. నీవు తప్ప మరో దైవాన్ని తలచుకొని ఎరుగను. మరి నన్నెందుకు నీవు కరుణించవు? నేను నీకు చేసిన పూజలు, జపాలు చాలలేదా? లేక నీవు నిజంగా అందరూ అంటున్నట్లు భక్తులను ఆదుకునేవాడివి కాదా?" అంటూ వివిధ రకాలుగా కఠినమైన మాటలతో నిందించాడట. అప్పటి నుండి అదొక సంప్రదాయంగా మారి, రానురాను శృతిమించి రాగాన పడినట్లు నిందారోపణలు, దారితప్పి అసభ్యతకు దారితీసి అదే ఢక్కువాడి సంప్రదాయంగా మారినట్లు ఒక కథనం.

No comments:

Post a Comment