Tuesday, July 17, 2018

Puri jagannath temple history | జగన్నాథ రథయాత్ర


జగన్నాధుని ఉత్సవాలు

Puri jagannath temple history
జగన్నాథ రథయాత్ర 
జగాలనేలే జగన్నాధుని ఉత్సవాల విషయానికి వస్తే.. ఆ పరమాత్మకు ఉత్సవాలకే కొదవా! ఎన్ని ఉత్సవాలు.. మరెన్ని పండుగలు.. ఇంకెన్ని పర్వాలు.. జగన్నాధుని ఉత్సవాల విషయంలో ఒక నానుడి ఉంది.
సంవత్సరంలో పన్నెండు నెలల్లో పదమూడు ఉత్సవాలని!ఈ నయనపథగామికి ప్రతిరోజు ఉత్సవమే! ఈ ఉత్సవాలన్నింటిలోకి ముఖ్యంగా చెప్పుకోవలసినవి దేవస్నాన పూర్ణిమ, రథయాత్రలు, శయనయాత్రలు, దక్షణాయన ఉత్సవాలు, పార్శ్వ పరివర్తన, దేవ ఉధ్యాపన, ప్రావణ షష్టి, పుష్య విశాఖ, మకరసంక్రాంతి, డోలోత్సవం, దమనక చతుర్దశి, అక్షయ తృతీయ. అయితే వీటిలో కూడా చెప్పుకోతగినది, ప్రపంచ ప్రసిద్ది చెందినది మాత్రం రథయాత్ర.

రథయాత్ర:

Puri jagannath temple history
పూరీ అనగానే.. జగన్నాథుని పేరు వినగానే వెంటనే జ్ఞాపకం వచ్చేది రథయాత్ర. ఆలయంలో తన సమీపానికి రాలేని ప్రజానీకం కోసం ఆ పరంధాముడు తానే స్వయంగా కదలి వచ్చే ఉత్సవం రథయాత్ర. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో జరిగే రథయాత్రను ప్రపంచమంతా ఆసక్తిగా తిలకిస్తుంది. ఈ రథయాత్రనేమహావేదీ మహెూత్సవం'గా పురాణాలు వర్ణించాయి. ఈ ఉత్సవాలనేఘోషయాత్రలు', 'గుండీచా యాత్రలు'గా కూడా వర్ణిస్తారు. రథయాత్రకు సంబంధించిన విషయంలో అంటే ఎప్పుడు చేయాలి.. ఎలా చేయాలి.. ఇత్యాది విషయాలు, సంగతులు అన్నీ కూడా సాక్షాత్తు విష్ణుమూర్తే స్వయంగా ఇంద్రద్నుమ్న మహారాజుతో చెప్పాడని పురాణాలు చెప్తున్నాయి. సాధారణంగా ఆలయాలలో రథోత్సవాలలో ఉత్సవమూర్తుల్ని ఊరేగిస్తారు. కాని ఇక్కడ ప్రధాన మూర్తులే ఊరేగడం జరుగుతుంది. ప్రతి ఆలయంలోనూ రథం స్థిరంగా ఉంటుంది. ఉత్సవాల సమయంలో ఆ రథాన్నే ఉపయోగిస్తారు. కాని పూరీ జగన్నాథుడి తేరు తీరే వేరు. రథయాత్రకు సరిగ్గా అరవై రోజుల ముందు వైశాఖ బహాళ విదియనాడు రథ నిర్మాణానికి కావలసిన కలపను సేకరించవలసిందిగా పూరీ మహారాజు ఆదేశిస్తాడు. సామంతరాజైన దనపల్లా రాజు నేతృత్వంలో వృక్షాల సేకరణ చేసిన బ్రాహ్మణులు, దయిత నాయకులు వాటికి తగిన శాంతులు చేసి వాటిని 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తీసుకువస్తారు. అలా తీసుకువచ్చిన వృక్షపు ముక్కలతో అక్షయతృతీయ నాడు రథ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. అత్యంత కఠినమైన నియమనిష్టలతో రథాల నిర్మాణం జరుగుతుంది. రథోత్సవం అనంతరం ఆ రథాలను మళ్లీ విడగొట్టేస్తారు. అలా విడగొట్టిన చెక్కను విక్రయిస్తారట. ఆ చెక్కలను కొనుక్కొని ఇళ్లకు సింహద్వారాలుగా కట్టుకొని అది తమకు శుభాన్నిస్తుందని నమ్ముతారెంతోమంది.

నందిఘోష్:

నలభై అయిదు అడుగుల ఎత్తుతో జగన్నాథుడి రథం తయారుచేయబడుతుంది. ఇదే 'నందిఘోష్. దీనికి పదహారు చక్రాలుంటాయి. ఇవి షోడశకళలను సూచించేవిధంగా ఉంటాయి. రథాన్ని ఎర్రటి చారలు కలిగిన పసుపు వస్త్రాలతో అలంకరిస్తారు. రథం పైన అమర్చిన విజయధ్వజాన్ని త్రైలోక్యమోహిని అంటారు. ఈ రథసారథి దారుకుడు. రథంలో వరాహస్వామి, గోపీకృష్ణుడు, నరసింహుడు, నవరుద్రులు, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, సప్తర్షులు కొలువుతీరి ఉంటారు. వీరే దుష్టశక్తుల నుండి రథాన్ని కాపాడే పార్శ్వదేవతలు.

తాళధ్వజ్:

బలభద్రుడి రథం నలభై నాలుగు అడుగుల ఎత్తుతో చతుర్ధశ మన్వంతరాలను సూచించే, పధ్నాలుగు చక్రాలతో ఉంటుంది. దీని పేరు తాళధ్వజ్. దీనినే ధర్మరథమని కూడా చెప్తారు. రథసారధి మాతలి. ఎర్రటి చారలున్న నీలిరంగు వస్త్రంతో రథాన్ని అలంకరిస్తారు. గణేశుడు, కార్తికేయుడు, సర్వమంగళ, ప్రళంబోయ, మృత్యుంజయుడు, నటేశ్వరుడు, శేషదేవుడు, రుద్రుడు మొదలయిన వారు రథాన్ని రక్షిస్తూ ఉంటారు. రథంపై హలధ్వజం రెపరెపలాడుతుంది.

పద్మధ్వజ్:

సుభద్రాదేవి రథం 43 అడుగుల ఎత్తుతో ద్వాదశమాసాలకు గుర్తుగా పన్నెండు చక్రాలతో ఉండే పద్మధ్వజం. దీనినే దేవదళ్ అని కూడా పిలుస్తారు. ఎర్రటిచారలున్న నల్లటి వస్త్రంతో రథాన్ని అలంకరిస్తారు. రథసారథి అర్జునుడు. రథంపై పద్మధ్వజం ఉంటుంది.

No comments:

Post a Comment