Monday, July 23, 2018

puri temple history | రథయాత్ర విశేషాలు


తొలి రథయాత్ర

puri temple history | రథయాత్ర విశేషాలు
ఈనాడింత ప్రసిద్ది చెందిన రథయాత్రను తొలిసారిగా జరిపినదీ, రథ నిర్మాణాన్ని చేపట్టినదీ  ఇంద్రద్యుమ్న మహారాజు. రథనిర్మాణం ఏ విధంగా చేయాలి, వాటియొక్క అలంకరణ ఏవిధంగా ఉండాలి, రథాలను ఏవిధంగా భద్రపరచాలి, ఎలా కాపాడుకోవాలి, రథనిర్మాణానికి కావలసిన సామగ్రిని, కలపను ఏ విధంగా సమకూర్చుకోవాలి అన్న అన్ని విషయాలను అశరీరవాణిగా సాక్షాత్తు నారాయణుడే చెప్పాడని పురాణాలు చెప్తున్నాయి. స్వామి చెప్పిన విషయాల ద్వారా, నారదుని సలహా, సూచనలతో ఇంద్రద్యుమ్న మహారాజు రథ నిర్మాణం చేయించగా ఒక శుభముహూర్తాన నారదుడు కార్యక్రమం నిర్వహింప చేశాడు.

చందనయాత్ర:


రథయాత్రకు శ్రీకారం చుట్టేది చందనయాత్రతోనే. అక్షయ తృతీయరోజు రథాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పుడే ఆలయం లోని విగ్రహాలకు చందనయాత్ర మొదలవుతుంది. ఉత్కళ ప్రాంతంగా పిలుచుకునే ఈ ప్రాంతంలో పంటలకు శ్రీకారం చుట్టేది కూడా ఆ రోజే. ఇది 42 రోజులపాటు జరుగుతుంది. మొదటి 21 రోజులు బాహర్ చందన్ అని పిలుస్తారు. గది బయట భక్తులు చూస్తుండగానే గంధం పూతపూసి పూజలు చేస్తారు. మిగిలిన 21 రోజులు అంతరాలయంలో జరుగుతుంది. దీనిని భీతర్ చందన్ అని పిలుస్తారు. చందనయాత్రలో భాగంగా చందన్ తాలాబ్ లేదా నరేంద్రకొలను అని పిలిచే సరస్సులో, జగన్నాథుడు మదననమోహనమూర్తిగా నౌకావిహారం చేస్తాడు. మూడురోజుల పాటు ఈ తెప్పోత్సవం నిర్వహిస్తారు. పంచపాండవులు ప్రతిష్టించినట్లుగా చెప్పబడే అయిదు శివాలయాలలోని ప్రతినిధి మూర్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ చందనోత్సవం తరువాతే స్నానోత్సవం జరుగుతుంది.

జగన్నాథుని స్నానోత్సవం:

రథయాత్రకు ముందు జ్యేష్ట పూర్ణిమనాడు జరుగుతుందీ ఉత్సవం. స్వామి అవతరించినది కూడా జ్యేష్టమాసంలోనే కాబట్టి జ్యేష్టమాసం లో జరిగే స్నానోత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దీనినే స్నానపూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఆలయంలోనే ఈశాన్యమూల ఉన్న స్నానవేదికపై మూలమూర్తుల్ని పెట్టి 108 బిందెల పవిత్రజలంతో ఈ మూర్తుల్ని అభిషేకిస్తారు. ఈ స్నానవేదికనే అనసరపిండి అని పిలుస్తారు ఆటవికులు. ఈ ఉత్సవంలో స్నానం చేయించినవారికి కోటిజన్మలలో చేసిన పాపాలయినా పరిహరించబడతాయి. అదేవిధంగా ఈ స్నానోత్సవాన్ని చూసినవారు కూడా ఎంతో భాగ్యవంతులుగానే పరిగణించాలి. ఎందుకంటే జ్యేష్టమాసంలో స్వామి జన్మదినమున జరిగే ఈ స్నానోత్సవాన్ని చూసినవారికి కలిగే పుణ్యఫలితంతో మరే ఇతర పుణ్యఫలితం సరితూగదట. ఎన్నో పుణ్యక్రతువులు చేస్తే, ఎన్నో దానధర్మాలు చేస్తే, ఎనో తీర్థయాత్రలు చేస్తే, పుణ్యతీర్థాలలో స్నానమాచరిస్తే, ఎనో వ్రతాలు, జపతపాలు చేస్తే లభించే పుణ్యంకంటే అధికమైన పుణ్యఫలం ఈ స్నానోత్సవం వీక్షణం వలన లభిస్తుందని, గర్భిణీ స్త్రీ గనక ఈ ఉత్సవాన్ని తిలకిస్తే ఉత్తములయిన సంతానం కలుగుతుంది. గర్భశోకాలనుండి రక్షించ బడుతుంది. రోగపీడితులు గనక చూస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఇలా ఏ రకమైన వేదనతో ఉన్నవారైనా ఆ వేదన నుండి బయటపడతారని స్కాందపురాణంతర్గత కథనం చెప్తోంది. ఇంతటి మహిమాన్వితమైన స్నానోత్సవం ముగిసిన తరువాత స్వామి జ్వరపీడితుడైనట్టు చెప్పి  వారం రోజులపాటు గర్భాలయంలో స్వామి విశ్రాంతి తీసుకుంటాడు. ఈ పదిహేను రోజులు భక్తులకుగాని, వేదపండితులకుగాని, చివరకు ఆ దేశపు రాజుకు కూడా దర్శనం ఉండదు. కేవలం దయితపతులు మాత్రమే స్వామికి చేయవలసిన పూజాది కార్యక్రమాలు, నైవేద్య సమర్పణలు జరుపుతారు. ఆటవికులు అతి గోప్యంగా చేసే ఈ పూజలే “అనవసరనీతి పూజలు”. వారి ఆటవిక సంప్రదాయానుసారం దేవతామూర్తులకు అడ్డుగా ఒక తడికలాంటి ఆచ్చాదన పెట్టి, పండ్లు, కందమూలాలు మొదలైన నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ పదిహేనురోజులలో రంగులు వెలసిన మూర్తులకు రంగులు వేస్తారు. ఈ రంగులు కూడా ఎటువంటి కృత్రిమత్వానికి తావులేకుండా సహజసిద్ధంగా తయారుచేసిన రంగులనే వాడతారు. ఈ రంగులు వేసే సందర్భంలో దేవతామూర్తుల ఆకారంలో ప్రస్ఫుటంగా కనబడే కనులకు రంగులు వేసే సందర్పాన్నినేత్రోత్సవం'గా పిలుస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ముగిసి తిరిగి అమావాస్య నాడీ స్వామి దర్శనం అవుతుంది. పది హేను రోజుల అనంతరం జగన్నాథుడు... సుభద్ర, బలరామ సహితుడై స్నానం పూర్తిచేసుకొని రథాలను అధిరోహించి తన జన్మస్థానమైన జనకపురికి బయలుదేరతాడు. ఈ జనకపురి జగన్నాథ ఆలయ నిర్మాత అయిన ఇంద్రద్యుమ్న మహారాణి గుండీచాదేవిది. దానినే గుండీచాబరి అని కూడా పిలుస్తారు. జగన్నాథుడు ఆమెను అత్తగా గౌరవిస్తాడని అందుకే వారం రోజులపాటు స్వామి అత్తవారింట్లో ఉంటాడని చెప్తారు. జగన్నాథ, సుభద్ర, బలభద్రుల దారుమూర్తులు తయారైంది అక్కడేనని అందుకే దీనిని జనకపురి, జన్మస్థానం అని చెప్తారు.

No comments:

Post a Comment