Monday, July 16, 2018

రామప్ప టెంపుల్...ఓ చారిత్రక వైభవం | కాకతీయుల కళావైభవం

రామప్ప టెంపుల్...ఓ చారిత్రక వైభవం

Ramappa temple a historical glory
రామప్ప టెంపుల్ ... ఓ చారిత్రక వైభవం 
800 సంవత్సరాల చరిత్ర ఆ టెంపుల్ ది. కళల కాణాచి ఆ ఆలయం. కాల ప్రవాహంలో ఎన్నో ఎదురుదాడులు. ఎన్నో యుద్ధాలు, ఇంకెన్నో దాడులు, మరెన్నో ప్రకృతి వైపరీత్యాలు అన్నిటినీ తట్టుకొని ఠీవిగా నాటి రాజసానికి, సంస్కృతీ సంప్రాదాయలకు ప్రతీకగా సజీవంగా నిలబడింది ఆ గుడి. ఆలయమంతా ఎన్నో అద్బుతాలు. ఒకప్పటి కాకతీయ రాజుల క‌ళా వైభవాన్ని ఆధునికులకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. తెలంగాణ ప్రాంత చారిత్రక కీర్తిని ప్రపంచానికి చాటుతోంది. ఓ వైపున చారిత్రక నేపథ్యం ... మరో వైపున ఆధ్యాత్మిక వైభవం....ఇంకోవైపు కాకతీయుల కళావైభవానికి గీటురాయి అన్నీ కలగలిసిన అరుదైన పుణ్య క్షేత్రం. తెలంగాణ లోని వరంగల్ జిల్లాలో రామప్ప టెంపుల్.

అద్భుతాలకు నిలయం రామప్ప టెంపుల్

రామప్ప దేవాలయం ఎన్నో విశిష్టతలకు, మరెన్నో అద్భుతాలకు నిలయం. రామప్ప దేవాలయంగా పిలుస్తున్నా నిజానికిది శివాలయం.
స్థానికులు దీనిని రామలింగేశ్వర ఆలయంగా పిలుచుకుంటారు. సాధారణంగా గుడిలో అయినా ప్రధాన దైవం పేరుతొ ఆ ఆలయాన్ని పిలుస్తారు. కాని ఇక్కడ దానికి పూర్తీ భిన్నంగా జరుగుతుంది. ఆలయంలోని దైవం పేరుమీద కాకుండా ఆలయ నిర్మాణం సాగించిన ప్రధాన శిల్పి రామప్ప పేరుమీద రామప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.  శివ,కేశవ అబేధానికి కూడా ఉదాహరణ ఈ ఆలయం. విష్ణుమూర్తి అవతారమైన రాముడు, శివుడు ఇద్దరి పేరుమీద రామలింగేశ్వరాలయం గా ప్రసిద్ధి చెందింది. 

శతాబ్దాలనాటి కళావైభవాన్ని కళ్ళకు కట్టే టెంపుల్

రామప్ప దేవాలయం కాకతీయుల కళావైభవానికి ప్రతీక. ఆనాటి శిల్పకళను అద్భుతంగా చూపించే  వేదిక రామప్ప దేవాలయం. నక్షత్రం ఆకారంలో ఉన్న ఎత్తైన పీఠంమీద కొలువుతీరి ఉంటుంది గుడి. దీనిని 'రామప్ప' అనే శిల్పి తన శిష్య బృందంతో కలిసి 40 సంవత్సరాల పాటు శ్రమించి శిల్పకళా శోభితంగా మలిచాడు. ఆలయంలోని ప్రతి రాయి ఒక సజీవశిల్పంగా కనిపిస్తుంది. పురాణ గాధలతో పాటు చెక్కబడిన అప్సరసలు ... గంధర్వ కన్యలు ... నాగకన్యల ప్రతిమలు అపురూప సౌందర్యానికి, ఆ శిల్పుల శిల్పకళా నైపుణ్యానికి మచ్చుతునకగా కనబడతాయి. తూర్పు ముఖద్వారం నుంచి లోనికి వెళ్లి ఆలయదర్శనం ఎలా చేయాలో చూపేవిధంగా ఆలయం చుట్టూ ఏనుగుల విగ్రహాలు మనతో కలిసి వస్తున్నట్లు వివిధ భంగిమల్లో అద్భుతంగా కఅమర్చబడ్డాయి. నల్లరాతి స్తంభాలపై మలిచిన గోపికా వస్ర్తాపహరణం, క్షీరసాగరమధనం, శివపార్వతుల కళ్యాణం, దక్షయజ్ఞం, తారకాసుర సంహారం వంటి పురాణగాథలు, పేరిణి శివతాండవం దృశ్యాలు ఆనాటి శిల్పకళా వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు కనబడతాయి.
         దీనిని కూడా చూడండి - బుధ నీలకంఠ మందిరం 
పాలంపేటలో కొలువుతీరిన రామప్పటెంపుల్ చారిత్రిక నేపధ్యం చూద్దాం.
ఈ ప్రాంతం కాకతీయుల పాలనాలో ఓ వెలుగు వెలిగింది. వారి పరిపాలన సామర్ధ్యానికి, శిల్పకళపై వారికున్న అభిరుచికి.. ఆసక్తికి నిదర్శనమే ఈ ప్రాంతం అంటారు చరిత్రకారులు. నిజానికి ఈ ప్రాంతాన్ని అప్పట్లో అప్పలంపేట అని పిలిచేవారట. అదే కాలక్రమంలో పాలంపెటగా మారిందని చెప్తారు. కాకతీయ గణపతిదేవ చక్రవర్త్తి సర్వ సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. దాంట్లో భాగంగానే ఈ అప్పలంపేటలో ఆలయాన్ని, ఒక పెద్ద చెరువును నిర్మించాడట. ఆలయానికి.. చెరువుకు తన పేరు ఉండేట్లు రుద్రేశ్వరాలయం.. రుద్ర సముద్రం అని పేరు పెట్టాడట. అయితే ఆ పేర్లు కేవలం శాసనాలకే పరిమితమయిపోయి, మహాశిల్పి రామప్ప పేరుమీదుగా రామప్పగుడి.. రామప్ప చెరువుగా మారిపోయాయి.

ఎంతోమందికి ప్రేరణ రామప్ప టెంపుల్

ఆలయం ఎంతోమందికి ప్రేరణగా నిలిచిందని చెప్పాలి. ఆలయం మధ్యలో ఒక రంగమంటపం ఉంది. కాకతీయుల కాలంలో ఇక్కడ శివుని ముందు నాట్యప్రదర్శన జరిగేదట. మండపానికి నాలుగువైపులా పెద్దపెద్ద నల్లని స్తంభాలుంటాయి. వాటిమీద అందమైన, అద్భుతమైన నల్లరాతి శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఈ శిల్పాల చెక్కడం వెనుక ఒక కథనం ఉంది. గణపతిదేవ చక్రవర్తి బావమరిది అయిన జాయపసేనాని నృత్యానికి సంబంధించి రచించిన నృత్యరత్నావళి గ్రంధం ఆధారంగా చెక్కారని, ఆనాటి పేరిణి శివతాండవ నృత్యానికి చెందిన నృత్య భంగిమలని చెప్తారు.  ఆ కాలంలో సైనికులు యుద్ధానికి వెళుతున్నపుడు వారిని ఉత్తేజపరచడం కోసం కాకతీయులు ఆ నృత్యాన్ని ప్రదర్శించేవారట. ఆ నృత్య రీతులన్నీ ఇక్కడి స్తంభాలమీద మనం చూడొచ్చు. కీ||శే||శ్రీ నటరాజ రామకృష్ణగారు ఈ రామప్ప గుడిలోని నాట్య భంగిమల మీదే దాదాపు మూడు సంవత్సరాలు అక్కడే ఉండి పరిశోధన చేసి శతాబ్దాల క్రితం మరుగున పడిపోయిన అప్పటి పేరిణి శివతాండవ నాట్యాన్ని పునరుద్ధరించి, ఆ విషయం మీద ఓ పుస్తకం రచించి, 1985లో తన శిష్యుల చేత పేరిణి శివతాండవ నృత్యాన్ని ప్రదర్శించారట. అప్పుడా ప్రదర్శన చూడ్డానికి ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారట. ఇంకో విశేషమేమిటంటే మంచిమనసులు చిత్రంలో ఓ అద్భుత గీతం ఈ నల్లని రాళ్ళలో అనే పాటను సి నారాయణరెడ్డి గారు ఈ శిల్పాలు చూసి ఆ ఇన్స్పిరేషన్ తోనే రాశారని కూడా చెప్తారు.
         ఇక్కడ మరో విశేషం ఆలయం ముందు కొలువైన నంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి ఉంచి, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా ? ఎప్పుడు ముందుకురుకుదామా అన్నట్టుగా కనబడుతుంది. ఆ నందికి ముందు భాగంలో ఎటువైపు నుంచి చూసినా అది మన వైపే చూస్తున్నట్లు ఉంటుంది. గర్భగుడికి ఎదురుగా వున్న మండపంలోని స్థంబాలమీద నాట్యం చేస్తున్న అందమైన స్త్రీమూర్తుల శిల్పాలు చూసేవాళ్ళకు కనువిందు చేస్తాయి. గుడి మెట్ల దగ్గర నుంచి మొదలుకొని పై కప్పు వరకు ప్రతి చోట ఎన్నో శిల్పాలు. కాకతీయుల ప్రత్యేక శిల్పశైలికి ఇది మచ్చుతునకగా చెప్తారు.
        రామప్ప దేవాలయాన్ని కేవలం ఆధ్యాత్మిక కోణంలో మాత్రమే చూడటం కాదు ఇది ఒక వైజ్ఞానిక దర్శనం అంటారు పరిశోధకులు. రామప్ప దేవాలయం ఓ విజ్ఞాన భాండాగారం. కేవలం శిల్పకళ గురించే కాదు. నాట్యం గురించి, వాయిద్యాల గురించి, ఆ కాలపు ఆహార్యం గురించి తెలుసుకోవాలంటే ఈ ఆలయానికి వెళ్లాల్సిందే అంటారు.
రామప్ప దేవాలయాన్ని సందర్శించేవారికి సమీపంలోని రామప్ప సరస్సులో బోటు షికారు చేయటం అందమైన, మరుపురాని అనుభవం.
       క్రీస్తు శకం 1213 లో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయ రాజు రుద్రదేవుడి హయంలో ప్రారంభమైన గుడి నిర్మాణం గణపతి దేవ చక్రవర్తి కాలంలో పూర్తయిందట. వారి తరఫున రేచర్ల రామయ్య అనే సామంత రాజు ఈ దేవాలయాన్ని కట్టించినట్టుగా శాసనాలు చెప్తున్నాయి.  ఆలయ నిర్మాణం పూర్తైన తర్వాత సుమారు 100 ఏళ్లపాటు ఈ దేవాలయం ఓ వెలుగు వెలిగిందని, ఆ తరువాత తన ప్రాభవాన్ని కోల్పోయి క్రీస్తుశకం 1910 వరకూ ఈ ఆలయంలో దీపారాధన కూడా జరగలేదని చరిత్ర చెప్తోంది. ఆ తరువాత మళ్ళీ 1911లో అప్పటి నిజాం ప్రభుత్వం రామప్ప ఆలయ విశిష్టతను గుర్తించి తిరిగి రామప్ప దేవాలయాన్ని పునరుద్ధరించిందట.
       పచ్చటి ప్రకృతి మధ్య సువిశాలమైన ప్రాంతంలో సాండ్‌ స్టోన్‌ తో నిర్మించిన అపురూప కట్టడం ఈ రామప్ప దేవాలయం. ఈ దేవాలయాన్ని ముఖ్యంగా ఆలయ గోపురాన్ని అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మించారట. ఈ ఇటుకలు నీళ్లలో వేస్తే తేలుతాయి. కొంత మంది ఇక్కుడున్న నీళ్ళపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు. అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది పర్యాటకుల్ని తన వైపు ఆకర్షించుకుంటున్నఈ దేవాలయం సినిమా వాళ్లకి ఓ వరం అని చెప్పాలి. ఇక్కడున్న అందమైన పరిసరాలు సినిమా వాళ్లకి ఓ విందుభోజనమే. అందుకే చాలా తెలుగు సినిమాల్లో రామప్ప ఆలయం అందాలు చోటుచేసుకుంటాయి.
ప్రతి సంవత్సరం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునే వారి సంఖ్య ఎక్కువగానే వుంటుంది.

ఎలా వెళ్ళాలి ...

సరే ఇంత చారిత్రక ప్రాభవాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న అద్భుత ఆలయం రామప్ప గుడికి ఎలా వెళ్ళాలో చూద్దాం.....
తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదుకి 157 కిలోమీటర్ల దూరంలోను కాకతీయుల రాజధాని వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది పాలంపేట గ్రామం. ఆ పాలంపేటలోనే ఉంది స్థానిక ప్రజలు గుళ్ల తీర్థంగా పిలుచుకునే రామప్ప దేవాలయం. హన్మకొండ లేదా వరంగల్ చేరుకొని, అక్కడి నుండి బస్సులలో పాలంపేట వెళ్లి అక్కడి నుండి ఆటోలో రామప్ప దేవాలయం చేరుకోవచ్చు.

No comments:

Post a Comment