Sunday, August 5, 2018

Templeinfo దేవతావృక్షాలు | బిల్వవృక్షం


బిల్వవృక్షం

Templeinfo దేవతావృక్షాలు | బిల్వవృక్షం
శ్రీ వృక్షం, మారేడు వృక్షం అని పిలువబడే బిల్వ వృక్షం సాక్షాత్తు శివ స్వరూపమే. బిల్వ పత్రాలతో పరమేశ్వరుణ్ణి పూజించడం అత్యంత శ్రేష్టం, సర్వపాపహరణం. ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను
అత్యంత ప్రయోజనకారి అయిన మారేడు' ఆవిర్భావం గురించి విభిన్న కథనాలు చెప్తున్నాయి పురాణాలు.

శివ స్వరూపం బిల్వవృక్షం:

ఒక సారి పార్వతీ పరమేశ్వరులను దర్శించడం కోసం వెళ్లాడు శనిదేవుడు. దర్శనం అయిన తరువాత వారి మధ్య జరిగిన సంభాషణలో పరమేశ్వరుడు శనిదేవుణ్ణి అడిగాడటనువ్వు నన్ను పట్టుకోగలవా?” అని.
ఎందుకు పట్టుకోలేను.... నేనెవరినైనా ఎంతటి వారినైనా పట్టుకోగలనుఅన్నాడట శనిదేవుడు.
ఎవరి విషయం ఎలా ఉన్నా, నన్ను పట్టుకోవడం మాత్రం నీకు సాధ్యం కాదుఅన్నాడు శివుడు.
సాధ్యమే....అన్నాడు శని.
అసాధ్యం...అన్నాడు శివుడు.
సరే... నేను మిమ్మల్ని రేపు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పట్టి ఉంటాను. కావాలంటే పరీక్షించండిఅన్నాడు శని.
ఆ మరునాడు యథాప్రకారం సూర్యోదయం అయింది. కాని శివుడు మాత్రం ఎక్కడా, ఎవ్వరికీ కనబడలేదు. చివరికి  పార్వతీదేవి కూడ శివుని జాడ తెలియక ఆందోళన చెందింది. దేవతలందరూ వెతుకులాటలో పడ్డారు. సూర్యాస్తమయమయింది. అప్పుడు అందరి ముందు ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు.
"స్వామీ ఏమిటీ విపరీతం...? సూర్యోదయం నుండి తమరు మాకెవ్వ రికీ దర్శనమీయకపోవడం వెనుక ఉన్న కారణమేమిటో సెలవీయండి...అని కోరింది పార్వతీదేవి.
శనిదేవుడితో జరిగిన సంభాషణ ఫలితమే ఇదని, ఇంతవరకు శని నన్ను పట్టుకోవడానికి వీలు లేకుండా అతడి దృష్టి పథానికి అందకుండా బిల్వవృక్ష రూపంలో ఉన్నానని చెప్పాడట శివుడు. శనిని చూస్తూనన్ను పట్టుకోగలనన్న నీ ప్రతిన ఏమయిందిఅని ప్రశ్నించాడు.
అప్పుడన్నాడు శని, మహానుభావా... నేను పట్టుకోకపోవడం ఏవిటి...!? నా ప్రభావం కారణంగానే కదా నీవు నీ స్వస్వరూపాన్ని వదిలి బిల్వవృక్ష రూపంలో ఉండవలసి వచ్చింది...!అని.
దాంతో, శని ప్రతిభను గుర్తించి మెచ్చుకున్న శివుడు, ఈనాటి నుండి శనీశ్వరుడిగా కొలువబడతావనే వరాన్నిచ్చాడు. అందుకనే బిల్వదళాలతో శివుణ్ణి పూజించిన వారిని శనిదేవుడు ఏ విధంగానూ కష్టపెట్టడట. అలా సాక్షాత్తు శివుడే బిల్వవృక్షంగా ఆవిర్భవించినట్టు కథనం.
Templeinfo దేవతావృక్షాలు | బిల్వవృక్షం
లక్ష్మీదేవి తపఃఫలం బిల్వవృక్షం:
మరో కథనం ప్రకారం, లక్ష్మీదేవి తపః ఫలంగా ఆమె కుడి హస్తం నుండి బిల్వ వృక్షం ఆవిర్భవిస్తే, దానిని దేవతలం దరూ తీసుకువెళ్లి, నందనవనంలో నాటినట్టూ అక్కడి నుండి భూలోకం లోకి వచ్చినట్టూ చెప్తారు. అందుకే లక్ష్మీదేవిని బిల్వ నిలయ అంటారు. స్కాందపురాణంలోని కథనం ప్రకారం లక్ష్మీదేవి ఓసారి పరమేశ్వరుని గూర్చి ఘోరమైన తపస్సు మొదలు పెట్టింది. లక్ష సువర్ణ పుష్పాలతో శివుణ్ణి ఏ పూజించాలని సంకల్పించిన లక్ష్మీదేవి పుష్పాలను సమకూర్చుకుని శివారాధన ఏ ప్రారంభించింది. అయితే ఆమె భక్తిని పరీక్షించదలచిన శివుని సంకల్పానుసారం ఒక పుష్పం తగ్గింది. దాంతో ఏం చెయ్యాలో అర్ధంకాక ఆమె తన వక్షోజాన్ని కోసి పుష్పంగా సమర్పించిందట. ఆమె భక్తికి మెచ్చి ఆ తపః ఫలితంగా మారేడు వృక్షాన్ని ఉద్భవింప చేసినట్లు ఆ దళాలతో తనను పూజిస్తే తాను అనుగ్రహిస్తానని చెప్పినట్లు ఓ కథనం చెప్తారు.
సర్వదేవతామయం బిల్వవృక్షం: 
Templeinfo దేవతావృక్షాలు | బిల్వవృక్షం
బిల్వవృక్షం సర్వదేవతల కొలువు. ఈ వృక్షం యొక్క ముళ్లు అమ్మవారిని, కొమ్మలు వేదాలను, వేళ్లు శివుడిని సూచిస్తాయి. బిల్వ పత్రంలో ఉండే మూడు దళాలు శివుడి త్రినేత్రాలను సూచిస్తాయి. అందుకనే బిల్వదళాలతో శివుడిని పూజించేటప్పుడు మూడు ఆకులున్న దళాలను మాత్రమే ఉపయోగించాలి. మూడు రేకులలో ఎడమవైపు బ్రహ్మ కుడివైపు విష్ణువు, మధ్యలో శివుడు, మం ముందు భాగంలో అమృతం, వెనుక ఉన్న భాగంలో యక్షులు ఉన్నారు.
బిల్వ వృక్ష విశిష్టత:
బిల్వదళాలు ఒక్క శివునికే కాదు త్రిమూర్తులకు అత్యంత ప్రీతికరమైనవే. ప్రసిద్ధమైన పుణ్యతీర్థాలన్నీ కూడ మారేడు చెట్టు మొదట్లోనే ఉంటాయి. అందుకనే మారేడు చెట్టు మొదట్లో స్నానం చేస్తే సర్వ తీర్థాలలో తన స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. మారేడు చెట్టును గంధపుష్పాక్షతలతో పూజిస్తే సర్వపాపాలనుండి విముక్తులవడమే కాకుండా శివ సాయుజ్యం పొందుతారు. ఈ చెట్టు క్రింద అన్నదానం చేస్తే మరే జన్మలోనూ దారిద్ర్యాన్ని అనుభవించకుండా ఉంటారని కూడ చెప్తారు. దీని మూలం గంధపు నీటితో పూజిస్తే వంశాభివృద్ధి జరుగుతుంది. దీని నీడన ఒక్కరికి అన్నదానం చేస్తే, కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది. మారేడుచెట్టు ఇంత మహిమాన్వితమైనది కాబట్టే దేవతలు కూడ దీనికి పూజలు చేస్తారు.
బిల్వదళాలు ఎప్పుడు కోయాలి:
సూర్యాస్తమయం తరువాత, సోమ, మంగళ వారాల్లోను, ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు, సంధ్యాసమయాలలోను, రాత్రులందు, పౌర్ణమి, సంక్రమణ దినాలల్లోను కోయకూడదు. కాబట్టి ముందుగానే కోసి పెట్టుకోవాలి. ఒకసారి కోసిన దళాలు పదిహేను రోజుల వరకూ ఉపయోగించుకోవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి.
ఎక్కడ నాటాలి:
సాధారణంగా ఈ వృక్షాలను శివాలయాలలో ఎక్కువగా పెంచుతారు. ఇంటి ఆవరణలోనైతే ఈశాన్యంలో ఈ వృక్షాన్ని పెంచుకుంటే ఆపదలు తొలగి ఐశ్వర్యం లభిస్తుందని, తూర్పున సుఖం, పడమర యమబాధల నుండి విముక్తి లభిస్తుందని వాస్తు శాస్త్రజ్ఞులు చెప్తారు.
ఆయుర్వేద వైద్యంలో మారేడు:
మహిమాన్వితమైన మారేడు ఆయుర్వేద మందులలో కూడ ఎక్కువగానే ఉపయోగిస్తారు. మారేడు పళ్లు, పుష్పాలు, పత్రాలు అన్నీ ప్రయోజనకరమైనవే. ఆ పళ్ల రసం అతిసార వ్యాధికి,ఆకుల రసం చక్కెర వ్యాధికి మందుగా ఉపయోగిస్తారు. మారేడు కాయతో చేసిన షర్బత్ కలారా, విరేచనాలు తగ్గిస్తుంది. మారేడు ఆకలి కలిగించడానికి, జీర్ణ శక్తిని కలిగించడానికి కూడ ఉపయోగపడుతుంది. బిల్వదళాలు నీటిని, గాలిని కూడ శుద్ధి చేయడంలో తమ పాత్ర నిర్వహిస్తాయి.
'సర్వం శివమయం జగత్' అంటే ఇదే మరి!

No comments:

Post a Comment